Saturday, September 27, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
                *ఈ పది వుంటే*

*మనిషి జీవితం సార్థకం కావాలంటే ఉండాల్సినవి ధనం, హోదా తదితరాలు కాదు. కానీ, దేశకాలాలకు అతీతంగా లోకమంతా జీవితం అంటే అవే అనుకుంటోంది. వాటిని సంపాదించడం కోసమే జీవితమంతా పరుగులు పెడుతున్నారు. ఆ క్రమంలో యుక్తాయుక్త విచక్షణను మర్చిపోతున్నారు. సత్యం, ధర్మం, నీతి, నడవడిక మొదలైన వాటికి సమాజంలో విలువ లేకుండా పోతోంది. సమాజం ప్రగతి సాధించినప్పుడు మానవ జీవన స్థితిగతులు మెరుగుపడాలి. సాంకేతిక అభివృద్ధితో జీవనశైలి సులభతరం కావాలి. కానీ, అందుకోసం నైతిక విలువలను పణంగా పెట్టరాదు. లోక ధర్మాలు శ్రుతి తప్పకూడదు. స్వార్థంతో మనిషి పతనం కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించకతప్పదు.*

*మనిషి నిర్వాణ పథం చేరుకోవడానికి భగవాన్‌ బుద్ధుడు- దానం, ధ్యానం, ఉపేక్ష, ప్రజ్ఞ, క్షమ, శీలం,* *సహనం, సత్యం, శౌర్యం, నిరపేక్ష అని దశ పారమితలను (పరిపూర్ణతలు) ఉపదేశించాడు. ప్రతి వ్యక్తీ ఉన్నంతలో కొంత దానం చేయడం అలవరచుకుంటే కలిగే తృప్తి, ఆనందం ఎందులోనూ లభించవు. సత్ప్రవర్తన, నైతికత మనిషి వ్యక్తిత్వానికి అలంకారాలవుతాయి. శీలసంపద మనిషిని ఉన్నతీకరిస్తుంది. ప్రాపంచిక సుఖాల పట్ల ఎంత అనాసక్తత పెంచుకుంటే అంతగా కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు. దానివల్ల దుఃఖం తగ్గుతుంది. క్షమించడం వల్ల మనిషి ప్రశాంతతను పొందగలడు. పగ, కక్షలతో హింస తప్ప ఏమీ సాధించలేం. అలాగే మనిషిలో శౌర్య గుణం తప్పక ఉండాలి. దీనివల్ల ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో జీవించగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.*

*అలాగే ధ్యానం అంటే- చేసే పనిమీద ఏకాగ్రత కలిగి ఉండటం విజయానికి తొలి మెట్టు అవుతుంది. ఉత్తమ జీవన విధానానికి ప్రజ్ఞ అంటే- జ్ఞానం చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే జీవితాన్ని సరైన ఎరుకతో తీర్చిదిద్దుకోగలరు. అందుకే బుద్ధిజీవులకు అపజయం ఆమడదూరంలో ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. అటువంటి కష్ట సమయాల్లో ఓరిమి చూపాలి. సహనం లేకపోతే మనుషులను అశాంతి ఇట్టే ఆవరిస్తుంది. దృఢచిత్తంతో నిత్యం సత్యం పలికేవారి వల్ల లోకానికి మేలు జరుగుతుంది. తమ ప్రవర్తన మీద శ్రద్ధ కలిగినవారే సత్యమార్గంలో ముందుకు వెళ్లగలరు. ఎదుటివారు ఎటువంటి వారైనా మనం కొంత దయతో ప్రవర్తించాలి. చెడు చేసిన వారిపట్ల కూడా కరుణ చూపగలిగిన వారు మహోన్నతులు అవుతారు. అన్నిటికన్నా గొప్పది నిరపేక్ష. అంటే విడిచి పెట్టడం. మితిమీరిన కోరికలను, స్వార్థాన్ని, ఈర్ష్ష్య అసూయలను, కోపం, పగ, అహంకారాలను విడిచిపెట్టాలి.*

*ఈ దశ పారమితలను జీవితాంతం పాటించాలి. అప్పుడే జీవనగమనంలో వచ్చిపడిన వేగం తగ్గి, తానేంటో తనకు బోధపడుతుంది. మనుషుల మధ్య అనురాగం పెరిగి ద్వేషం తగ్గుతుంది. సమస్త మానవాళి మంగళకరమై వర్ధిల్లుతుంది.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment