Wednesday, September 24, 2025

 *మేకవన్నె పులులు – మన మధ్యలోనే ఉన్న మోసగాళ్లు*

మేకల గుంపులో పులి వేషం వేసుకుని తిరిగితే, అది మన కంటికి సాధారణ మేకలా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం రక్తపిపాస దాగి ఉంటుంది. అలాగే మన ఊరిలో, మన సమాజంలో, మనతో కలిసి తిరిగే కొందరు కూడా అలాగే ఉంటారు. బయటకు స్నేహితుల్లా, బంధువుల్లా ఆత్మీయుల్లా కనిపిస్తారు… కానీ లోపల మాత్రం మోసం, దోపిడీ, స్వార్థం దాగి ఉంటుంది.
వారిని మనం గుర్తించలేకపోతే – మన ఊరి భవిష్యత్తే ఆగమౌతుంది బలిపశువవుతుంది.
ప్రతీ ఊరిలో గుడి బడి చెరువు లు తప్పనిసరిగా ఉంటాయి ఇవే దోపిడీ దారులకు ప్రధాన వేదికలు.
దేవుడి పేరుతో చందాలు తీసుకునే వారు ఉన్నారు… గుడుల పునర్నిర్మాణం అంటారు… ఉత్సవాలు అంటారు…గుడి చుట్టూ మెరుపు లైట్లతో కాంతులు విరజిమ్మిస్తారు కానీ చివరికి ఏం మిగులుతుంది? పాడైన గుడి, మాయమైన డబ్బు, కానీ నీవెవరినైతే నమ్మావో వారి ఆస్తులు అంతస్తులు అవుతాయి.
అభివృద్ధి పేరుతో చెరువులు, కుంటలు బాగు చేస్తామని చెప్పేవారు ఉన్నారు… కానీ కాగితాల మీదే పనులు జరుగుతాయి. నీరు పోతుంది, భూములు పోతాయి, చెరువులు కుంటలు మాయమౌతాయి కానీ లాభం మాత్రం వారికే చేరుతుంది.
పై రెండు చోట్ల దోపిడీ అవకాశం ఎక్కువ దోపిడీ చేయడానికి తక్కువ అవకాశం ఉన్న బడులను ప్రభుత్వ పాఠశాలలను మాత్రం పట్టించుకోరు కావాలనే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తారు.
అసలు సమస్య ఎక్కడ ఉంది తెలుసా?
వారిని ఇక్కడికొచ్చేలా చేసింది మనమే.
ఓటు వేయించే రోజున ఇచ్చే చిల్లర పైసలు, చిన్న చిన్న వాగ్దానాలు చూసి మనమే మోసపోతున్నాం. మన చేతుల్తోనే మేకవన్నె పులిని మన ఊరి పాలకుడిగా కూర్చోబెడుతున్నాం.
అందుకే… నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను:
మోసగాళ్లను గుర్తించండి!
మీ ఓటును ఎవరికి ఇస్తున్నారో ఆలోచించండి!
దేవుడి పేరు చెప్పేవాడు నిజంగా దేవుడి పనులు చేస్తున్నాడా అని చూసుకోండి!
అభివృద్ధి పేరు చెప్పేవాడు నిజంగా ఊరి కోసం కష్టపడుతున్నాడా అని ప్రశ్నించండి!
ప్రశ్నించే ధైర్యం ఉంటేనే… మన ఊరు, మన సమాజం కాపాడబడుతుంది.
మేకవన్నె పులులను మన ఊరికి దూరం పెట్టగలిగితేనే… నిజమైన మేకలైన ప్రజలమైన  మనం సురక్షితంగా బతకగలము.
ఒక మంచి మనిషిని, నిజాయితీ కలిగిన వ్యక్తిని ఎన్నుకోండి.
మన ఊరికి భవిష్యత్తు ఇవ్వగల పాలకుడిని నిలబెట్టండి.
అదే మన నైతిక బాధ్యత, అదే మన సమాజానికి మనం చేసే గొప్ప సేవ! ప్రస్తుతం మన గ్రామంలో మరియు మన నియోజకవర్గంలో  ఇదే పరిస్థితి జరుగుచున్నది కావున అందరూ గమనించి మేల్కొని నాయకులకు బుద్ధి చెప్పవలసిందిగా మనవి......

Sekarana 

No comments:

Post a Comment