Saturday, September 27, 2025

 *లంకలో హనుమంతుడు..* 

హనుమంతుడు లంకలో నున్న ఆశోకవనానికి బయలుదేరాడు. చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా ఒక చెట్టు క్రింద కూర్చున్న సీతమ్మను హనుమంతుడు చూసాడు. అప్పుడే రావణుడు వచ్చి తన పట్టపురాణిగా ఉండాలని సీతను భయపెట్టడానికి ప్రయత్నించేడు. కాని సీత రావణుని వైపు కన్నెత్తి కూడ చూడలేదు. ఆమె రామనామాన్నే స్మరిస్తూ ఉంది...రావణుడు వెళ్ళిన కొంత సమయం తరువాత హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీత ముందు జారవిడిచాడు. రాముని ఉంగరాన్ని గుర్తించగానే సీత సంతోషించింది. చుట్టూ చూసింది. చిన్న కోతి రామనామాన్ని స్మరించడం ఆమె విన్నది. అతడు దగ్గరకు వచ్చి తాను నిజంగా రాముని బంటునని రుజువు చేసుకునేందుకు, కేవలం రాముడు, సీతకు మాత్రమే తెలిసిన రహస్య వివరాలు తెలియజేశాడు. తన సహజ రూపాన్ని ధరించి రాముని అనుగ్రహం వల్ల లంక చేరుకున్నానని చెప్పాడు. తల్లి సీతమ్మను తన వీపు మీద మోసుకుని రాముని దగ్గరకు తీసుకుపోదామనుకున్నాడు. కాని సీత అంగీకరించలేదు. రాముడు వస్తాడనీ, రావణుని ఓడించి తనని సగౌరవంగా తిరిగి తీసుకొని వెళతాడనీ ఆమె చెప్పింది...

 *ఇక్కడ  మనమందరం గమనించవలసిన విషయం ..* 

 సీత హనుమంతునితో వెళ్ళగలిగి ఉండేది. కాని ఆమె తిరస్కరించింది. ఎందుచేతనంటే ఆమెకు రామునిపై దృఢమైన విశ్వాసం ఉంది. అతడు వచ్చి తనను రక్షిస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. మన జీవితాల్లో కష్టసమయంలో మనం కూడా దగ్గర దారులు వెతుక్కోకూడదు. భగవదనుగ్రహంతో మనకనుకూలంగా పరిస్థితులు మలుపు తిరిగేవరకు
సరియైన సమయం కోసం వేచి ఉండాలి. మనం సక్రమమైన రీతిలో పని చెయ్యాలి. దైవాన్ని ప్రార్థించాలి. మిగిలినది దైవానికి విడిచిపెట్టాలి.

 *మనమందరం గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:..*
 
 మంచి లక్ష్యం కోసమైనా, ఆ మంచి లక్ష్యసాధనకైనా చెడ్డ దారులు వెతక రాదు. ఫలితం ఎంత ప్రధానమో దాన్ని సాధించే మార్గాలు కూడా ధర్మబద్ధమైనవిగా ఉండడం అంతే ముఖ్యము..

No comments:

Post a Comment