Wednesday, April 22, 2020

భయం

భయం

భయం పలురకాలు. అందంగా ఉన్నవారికి అది తరిగిపోతుందని భయం. యౌవనం శాశ్వతం కాదన్న ఆందోళన, వార్థక్యం చుట్టుముడుతుందని, రోగాలు పీడిస్తాయనే బాధ. సంపద కరిగిపోతుందనే మానసిక వ్యధ. ఇలా ఎన్నింటికో మనిషి భయపడుతూ భీరువవుతాడు. సహజ పరిణామాలకు చింతిస్తూ భీతిల్లుతాడు. భయపడవలసినవాటికి భయపడడు. అదే మానవ జీవితంలోని వింత!

సూర్యోదయం, చంద్రోదయం, వర్షాలు, ఉరుములు, మెరుపులు... ఇటువంటి అనేక ప్రకృతి పరిణామాలు మనిషిని భయపెట్టాయి. క్రమక్రమంగా భాషాపరంగా, విజ్ఞానపరంగా ఎదిగాడు. తనను భయపెట్టిన మార్పులు సహజమని అర్థం చేసుకున్నాడు. వాటివల్ల ఉపయోగాలు తెలుసుకున్నాడు. మనల్ని భయపెట్టే విషయాలపట్ల అవగాహన పెరిగిననాడు భయం తొలగిపోతుంది.


భయం మూఢనమ్మకాన్ని పెంచుతుంది. అది మన హేతుబద్ధతను, తార్కికతను, ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. విజ్ఞాన, శాస్త్ర రంగాల పురోగతిని నిలువరిస్తుంది. భయం గురించి మనం ఎంతగా భయపడితే అంతగా భయభ్రాంతుణ్ని చేస్తుంది. భయాన్ని అధిగమించాలంటే దాన్ని ఎదుర్కోవాలి. దానినుంచి పారిపోకూడదు.

పుట్టుకెంత సహజమో చావూ అంతే. ఈ రెండు పరిణామాల మధ్య సాగవలసిన జీవితాన్ని అర్థరహిత, ఆధారరహిత భయాలతో గడిపేయకూడదు. భయపడుతూ జీవించే జీవితం జీవితమే కాదు. అది మృతప్రాయమే. భయం వల్ల సంకల్పం వీగిపోతుంది. ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. ఉత్సాహం నీరైపోతుంది. ఉద్యోగంలో, జీవితంలో చేరుకోవలసిన స్థితికి చేరలేం. జీవన క్రమంలో కొన్ని అవసరవేళల్లో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోలేం.

భయం రెండు రకాలు. ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది. మొదటిది- మనల్ని రుజుమార్గంలో నడిపే పాపభీతిని నేర్పుతుంది. స్వీయక్రమశిక్షణ ఇస్తుంది. మనస్సాక్షికి బద్ధుల్ని చేస్తుంది. ఎదుటివారికి హాని కలిగించాలనే ఆలోచననే దరిచేరనివ్వదు. ధర్మచింతనతో ప్రవర్తించే విధంగా ఉపకరిస్తుంది. ఇక రెండోది- జీవితంలో ముందుకు వెళ్లనీయదు. ఆలోచించనీయదు, ఎదగనీయదు.


మానవులు విపరీతంగా భయపడే విషయం మృత్యువు. నిజానికి ఈ భయం వల్ల మేలే జరుగుతుంది. చావు తప్పదన్న స్పృహ మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. బాధ్యతలను నిర్వర్తించేలా, లక్ష్యాలను చేరేలా, చేయదలచుకున్న సత్కార్యాలను పూర్తి చేసేలా చేస్తుంది. అనివార్యమైన ఆ ప్రకృతి ధర్మం- మన జీవితానికొక అర్థాన్ని, సార్థకతను ఆర్జించుకొమ్మని హెచ్చరిస్తుంటుంది. ఈ మృత్యుభయాన్ని వీడిన క్షణం- మనిషికి ఆనంద సామ్రాజ్యమే. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలే. మన బుద్ధికే కాక మనసుకూ తెలియవలసిన విషయమిది. ఆ స్థితికి చేరుకున్ననాడు చావునైనా నవ్వుతూ ఆహ్వానిస్తాం.

మన మనసులోకి చూసినప్పుడు తప్పు అన్నది లేకుండా ఉండాలి. అప్పుడు ఏ అపరాధ భావమూ దరిచేరదు. అప్పుడిక దేనికీ విచారించవలసిన అవసరమే ఉండదు. మనిషి ఈ ప్రపంచాన్ని మోసం చేయవచ్చు. కానీ, అంతరాత్మను వంచించలేడు- అంతరాత్మ ఎప్పడూ వాస్తవాన్నే చూపుతుంది.

భయపడుతూ జీవించడమంటే అనేకసార్లు మరణించడమే. భయాన్ని వదిలిననాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడపగలం. అదే అసలైన జీవితం. భయపడటం మానేసినప్పుడే మన జీవితం మొదలవుతుందంటాడు ఓ తాత్త్వికుడు.

No comments:

Post a Comment