Wednesday, April 22, 2020

ఏకాక్షరి బోధ

ఏకాక్షరి బోధ (జ్యోతిర్మయం) ✍🏾 -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
మానవులు నిత్యజీవితంలో ప్రవర్తించాల్సిన విధానం తెలిపే కథ ఉపనిషత్తులలో ఉంది.
ఒకసారి దేవ, రాక్షస, మానవులు బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుని, అనేక విధాలుగా స్తుతించి ప్రసన్నం చేసుకున్నారు. వారి రాకకు కారణం అడిగిన విధాతతో తమ బాధలు విన్నవించుకున్నారు.
రాక్షసుల వలన కలుగుతున్న ఇక్కట్లను దేవతలు వివరించగా, దేవతల మీద అసూయతో రాక్షసులు వ్యాఖ్యలు చేసారు. భూలోక జీవనంలో ఎదురౌతున్న కష్టాలను వివరించి మోక్షమార్గం ఉపదేశించమని వేడుకున్నారు మానవులు.
బ్రహ్మదేవుడు “విడివిడిగా బోధ చేసే తీరిక లేదు. ఏకాక్షరి బోధిస్తా. ”ద” అని పలికాడు.
ఏకాక్షరి అందించిన సందేశం అవగతం కాక అయోమయ స్థితిలో ఉన్న దేవ రాక్షస మానవులకు త్రిలోక సంచారి నారదుడు ఎదురయ్యాడు. వారి సమస్యను తెలుసుకుని వివరణ ఇచ్చాడు.
ముందుగా దేవతలతో “ ద అనగా ‘దమము’ నేర్చుకుని ప్రవర్తించమని. దేవతలు ఎక్కువగా భోగలాలసులు. భోగాలకు అధికంగా అలవాటు పడినవారు దమము నేర్చుకోవాలి. అనగా మనస్సు నిగ్రహించుకోవాలి. భోగజీవితం వినాశనానికి హేతువు. చెడు మార్గానికి చేరువ చేస్తుంది. భోగ జీవితం వలన మోక్షం లభించదు. త్యాగ జీవితం, యోగ జీవితాల వలన మాత్రమే అది సాధ్యం” అని బోధించగా సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు దేవతలు.
రాక్షసులతో “ ద అంటే దయ చూపమని. మీకు క్రూరత్వం ఎక్కువ. దయాదాక్షిణ్యాలు మరచి ప్రవర్తిస్తారు. రాక్షస స్వభావం ఉన్న మానవులైనా దయ లేకుండానే ప్రవర్తిస్తారు. ఇతరులను బాధించడంలో ఆనందం వెతుక్కుంటూ, లోక వినాశనానికి పాల్పడక దయగా ప్రవర్తించమని బ్రహ్మ గారి ఉపదేశం” అన్నాడు నారదుడు.
మానవులతో “ద అనగా దానం చేయమని. మీలో ఎక్కువ మందికి లోభిత్వం ఉంటుంది. అది విడిచిపెట్టి దానం నేర్చుకోండి. ఇంట్లో ధనరాసులు, విలువైన వస్తువులు ఉన్నాయని గర్వపడకుండా సాటివారికి వీలైనంత సహాయపడడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఉత్తమం. దానధర్మాలు చేయడం వలన పుణ్యం దక్కుతుంది. దానం చేసే అవకాశం కలిగినందుకు సంతోషించండి. గర్వపడవద్దు” అని తెలిపిన నారదుడికి కృతజ్ఞతలు తెలుపుకుని బయల్దేరారు మానవులు.
“ ఈ దేహం సొంతం కాదని, కొన్నాళ్ళ పాటు ఆత్మకు ఆశ్రయం కల్పించందని “ గౌతమ బుద్ధుడు ప్రవచించినట్టు ప్రపంచంలో ఏదీ సొంతం కాదని గ్రహించ గలిగితే దాన గుణం అలవడుతుంది. సులువుగా త్యాగం చేసే బుద్ధి కలిగితే దేహవాసన , వ్యామోహం నశించి ఉత్తమ గతులు పొందుతారు.
*_

No comments:

Post a Comment