Thursday, July 29, 2021

నవ్వు నలభై విధాల మేలు

😄నవ్వు నలభై విధాల మేలు😅
😀😃😄😁😆🤣😇😜🤪🤓

మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం.
దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది.

కొన్ని ఉదాహరణలు చూద్దాం.

👉 పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు.

ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి
గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు.

కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలా కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు.

హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత.

'నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు.

నవ్వు నాలుగు విదాల చేటు అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.

'నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ.

కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి.

👉 ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు.

అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల ఫేర్‌వెల్‌ ఫంక్షన్ లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ ఇవాళ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు.

దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు.

తీరాచూస్తే ఇరవై అయిదు-ఖర, ఇరవై ఆరు- నందన!

"ఖర నందన"

అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.

👉 అప్పట్లో కేంద్రమంత్రులు సంప్రదాయ అంబాసిడర్‌ కార్లు వదిలేసి, విదేశీ వాహనాల కొనుగోలుపట్ల మొగ్గు చూపడంపై చట్టసభలో పెద్ద దుమారం రేగింది.

పెద్దపెద్ద విదేశీ కార్లలో మహారాజుల్లా తిరగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఘోరం.
అంటూ ప్రతిపక్షసభ్యులు విరుచుకు పడ్డారు.
సభలో ఉద్రిక్తతలు చెలరేగాయి.

అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి లేచి 'అవును నాకు ఇష్టం లేదు... అంతపెద్ద కారులో నావంటి పొట్టివాడు కూర్చుంటే బయటికి అసలు కనపడడు' అన్నారు. సభ గొల్లుమంది. గాంభీర్యం తొలగిపోయింది. హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి.

👉 చైనా దురాక్రమణ సందర్భంగా మనదేశం కోల్పోయిన భూభాగం విషయమై డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా ఆవేదనగా ప్రసంగిస్తున్నారు.

'గడ్డికూడా మొలవని వృథా భూభాగం కోసం ఇంత రభస చెయ్యాలా' అని నెహ్రూజీ ఆ వాదనను తోసిపుచ్చారు.

వెంటనే డాక్టర్‌ లోహియా 'మీ బట్టతలపై కూడా ఏమీ మొలిచే అవకాశం లేదుకదా, అదీ వృథా అని ఒప్పుకొంటారా' అని అడిగారు. అంతవరకూ ఆయన చేసిన ప్రసంగం సాధించలేనిదాన్ని ఈ ఒక్క చమత్కారపు ప్రశ్న సాధించింది. లోహియా హాస్య చతురతకు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది.

మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు.

దీని ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.

'ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే'
😀😃😄😁😆😂🤣😇🤪😜

Source - Whatsapp Message

No comments:

Post a Comment