Monday, July 26, 2021

నవ్వు 😀నవ్వించూ

నవ్వు 😀నవ్వించూ
🕉️🌞🌎🏵️🌼🚩

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు.

‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే
నవ్వులు – సర్వము దుఃఖదమనంబు వ్యాధులకు మహీషదుల్’’

అన్నారు మహాకవి గుర్రం జాషువాగారు. నవ్వు సర్వరోగ నివారిణి. అటువంటి నవ్వును నవ్వాలా, వద్దా అని ఆలోచించడం అర్ధరహితం.

చిరునవ్వు, సకిలింపు, ఇకిలింపు, ముసి,ముసి నవ్వు, మూగనవ్వు, గుడ్డినవ్వు, పక,పకలు, అట్టహాసం ఇలా నవ్వనేక రకాలు. దేనికదే సాటి. భరతముని నాట్యశాస్త్రంలో ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వుని వర్గీకరించాడు. ఆధునికి సాహిత్యంలో హాస్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇగిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కుండమూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు అంటూ నవ్వుకి అనేక రూపాలిచ్చారు.

అయితే, నవ్వంటే ఏమిటిని, దానికి నిర్వచనం చెప్పమంటే మాత్రం మహామహులకే సాధ్యంకాలేదు. నవ్వు ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని అనుభవించాలే కానీ, అర్ధాలు వెదికి ప్రయోజనం లేదు. నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం కలిగిస్తూనే విజ్ఞాన్ని అందిస్తుంది. ఆ రసాస్వాదన చేసిననాడు అసంకల్పితంగా వచ్చేదే నవ్వేమో!

జనజీవనంలో అంతర్లీనంగా హాస్యం తద్వారా నవ్వు గేయాలు, పాటలు, పొడుపు కథల రూపంలో నిక్షిప్తమై ఉంది .

‘‘కలకల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కలతలు పుట్టెను కపులందరికినీ
కిలకిల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కిలకిల నవ్వగా ఖిన్నుడయ్యె రాజూ
ఇందరి చిత్తమ్ము లీవిధమ్ముననూ – నిండిన కొలువెల్ల కడుచిన్నబోయె’’

లక్ష్మణుడి నవ్వు రాముని కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. గుమ్మడి పండ్ల దొంగ భుజాలు తడుముకున్నట్టు ప్రతి ఒక్కరూ తమలోని లోపాన్ని తలుచుకుని సిగ్గుతో కుంచించుకోపోయిన వైనం జానపదుల నోటి నుండి ఎంతో రమణీయంగా జాలువారింది. ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికే హేతువైంది. ఇక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికే ఊపిరైంది.

మనకు నవ్వు పట్ల ఎప్పుడు శీతకన్నే అయినా మన ప్రాచీన, ఆధునిక కవులు వీలైనప్పుడల్లా నవ్వుని అందించడానికే ప్రయత్నించారు. ఆంధ్ర మహాభారంతో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ, 32 రకాల నవ్వుల గురించి చెప్పారు. అవి: 1. పిన్న నవ్వు 2. అల్ల నగవు 3. అలతి నవ్వు 4. చిరునవ్వు 5. మందస్మిత 6. హర్ష మందస్మిత 7. అంతస్మితం 8. జనిత మందస్మితం 9. ఉద్గత మందస్మితం 10. అనాదరం మందస్మితం 11. సాదర దరహాసం 12. తిన్నని నవ్వు 13. లేత నవ్వు 14. కొండొక నవ్వు 15. పెలుచన నవ్వు 16. ఉబ్బు మిగిలి నవ్వు 17. గేలికొను నవ్వు 18. ఒత్తిలి నవ్వు 19, అపహాసం 20. రోషకఠిన హాసం 21. ఊద్భుట నవ్వు 22. కలకల నవ్వు 23. ఎల నవ్వు 24. ప్రౌఢ స్మితము 25. బెట్టు నవ్వు 26. కన్నుల నవ్వు 27. కన్నుల నిప్పుల రాలు నవ్వు 28. కినుక మానిన నవ్వు 29. కినుక మునుగు నవ్వు 30. కఠిన నవ్వు 31. నవ్వురాని నవ్వు మరియు 32. ఎర్ర నవ్వు.

ఇవికాక, ఆధునికి కవులు మరికొన్ని నవ్వులను కనిపెట్టారు. తలకాయ నవ్వు – తల మాత్రం తెగ ఝాడిస్తూ వంచేసి కళ్లు మూసుకు నవ్వడం, లయధాటీ నవ్వు – తాళం వెయ్యటానికి వీలై ఉండేది. తుపాకి నవ్వు – పెదిమల బద్ధలు చేసుకుని ఠప్పున బయల్దేరేది, కొన ఊపిరి నవ్వు – గుక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా, నవ్వు రాకుండా నవ్వడం, కోతి నవ్వు – నవ్వేమో అని ఇతరులు భ్రమించేది, దాగుడు ముచ్చీ నవ్వు – అధికారి ఎవరైనా కని పెడతారేమో అనే భయంతో చప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించే టప్పటిది, సరి విషపు నవ్వు – నవ్వు జాతిలో చెడబుట్టి లోపలి ఏడుపుని ఓ ప్రక్క నుంచే వెళ్లగక్కేది, డోకె నవ్వు, దొంగ నవ్వు, కొలిమి తిత్తి నవ్వు, గుడ్స్ బండి నవ్వు ఇలా అనేకం.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, నవ్వులో ఎన్ని వంద రకాలున్నాయని వెడకడం మానేసి మల్లెపూవులాంటి స్వచ్ఛమైన నవ్వు నవ్వొకటి నవ్వుతూ ఉండండి. లేకపోతే ‘నవ్వనివాడు దున్నపోతై పుట్టున్’ అనను కానీ…

‘‘అకాల మృత్యుహరణం
సర్వ వ్యాధి నివారణం
సమస్త దురితోపహారం
హాస్యరసామృతం – పావనం శుభం.’’

సౌమ్యశ్రీ రాళ్లభండి

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment