Wednesday, July 14, 2021

కృష్ణుడు మరియు ఒక దొంగ కథ

కృష్ణుడు మరియు ఒక దొంగ కథ

🌺 బ్రాహ్మణుడు.. ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం పారాయణ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ.. ధనవంతుని ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.

🌺 భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వివరణ ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించేదో కనులకు కట్టినట్లు చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే అతని నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దాని కోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.

🌺 బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన.. నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు.

🌺 బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకి రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి, పిల్లనగ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లనగ్రోవి వాయిస్తూ ఉండేవాడే..నేను చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు.

🌺 దొంగ బ్రాహ్మణుడి మాటలు నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో పిల్లనగ్రోవి వినిపించింది, ఇద్దరు పిల్లలు వస్తున్నారు, ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకి వెళ్ళాడు దొంగ.

🌺 బాల కృష్ణుని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారగా, ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు.

🌺 ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది. అతను వెళ్లి బాల కృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగల గానే, దొంగ చేసిన పాపములన్నీ కరిగి పోయాయి. ఎంత అదృష్టవంతుడో కదా దొంగ ! బాలకృష్ణుడిని..ఆ దొంగ అమాయకంగా "ఎవరు నువ్వు?" అని అడిగాడు. దానికి కృష్ణుడు "నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నన్ను వదిలి వెళ్ళిపో" అన్నాడు.

🌺 అప్పుడు దొంగ... "నేను దొంగని. అందువల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపో" అని మాత్రం అనకు అని ప్రాధేయపడ్డాడు.

🌺 అప్పుడు బాలకృష్ణుడు..దొంగకి.. అతను వచ్చిన పనిని గుర్తుచేసి, తను వేసుకున్న నగలన్నీ ఇచ్చాడు. అప్పుడు దొంగ, "ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా?" అని అడిగాడు.

🌺 దానికి కృష్ణుడు "ఏమి కోప్పడదు. ఎందుకంటే నా దగ్గర చాలా నగలు ఉన్నాయి. నేను నీకంటే పెద్ద దొంగని. కానీ.. నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. నన్ను ప్రేమగా చిత్తచోరా అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏమిటంటే, నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇద్దరూ అక్కడినుంచి మాయమైపోయారు. తరువాత చూస్తే.. దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని, ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి...జరింగింది అంతా చెప్పాడు.

🌺 ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు.. కృష్ణుడిని చూసిన చోటు.. తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగా దొంగకి కనిపించిన బాలకృష్ణుడు.. బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో.. కృష్ణుడిని "నీవు ఒక దొంగని అనుగ్రహించావు. కానీ నాకు కూడా దర్శనం ఇవ్వవా?" అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు "నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు. కానీ దొంగ.. నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపారమైన నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను.

నీతి:
🌺 పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్న అంతరార్ధం కూడా తెలుసుకోవాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment