Friday, July 30, 2021

జీవితం సమాహారం

💦జీవితం సమాహారం🎊
🕉️🌞🌎🏵️🌼🚩

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!

డబ్బు విలువ నేర్పుతుంది
చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.

మనుషుల విలువ నేర్పుతుంది
‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు.కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండాపోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.

వినయం విలువ నేర్పుతుంది
అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము.మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.
లక్ష్యం విలువ నేర్పుతుంది
కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు.లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.

జీవితం విలువ నేర్పుతుంది
అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment