Wednesday, July 14, 2021

భక్తి

🌹 భక్తి 🌹

సాధారణంగా మనం ప్రతిరోజు దేవునికి పూజ చేస్తూ ఉంటాం. దేవుడిని అందంగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటాం. దేవుని కొరకు రకరకాల పదార్ధాలు తయారు చేసి నివేదిస్తూ ఉంటాం. కాని మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోతే దేవుడు నన్ను కరుణించలేదు. నాపై దేవునికి దయ కలుగలేదు అని బాధ పడుతూ ఉంటాం.

ఇలా మన కోరికల కోసం చేసే పూజల వలన ప్రయోజనం ఉండదు. చిత్తశుద్ధి లేని పూజ, దైవ భక్తి లేని ప్రసాదం అంటే దేవుడికి కూడా ఇష్టం ఉండదు. మన మనస్సును ఆయనపై లగ్నం చేసినప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితం లభిస్తుంది. అది ఎలాగో చూద్దాం.....👇

పూర్వం ఒక గ్రామంలో విష్ణుభక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు.

ఎంత పేదరికంలో ఉన్నా భగవంతుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయత్వంతో స్తోత్రాలు చేసాడు. స్వామికి ఏదైనా నివేదించాలి అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా ఒక అరటిపండు కన్పించింది.

దానిని స్వామికి నివేదించాలని అరటి పండు ఒలచి పండు పడవేసి భక్తి పారవశ్యం లో తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్తవత్సలుడు అయిన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్థానమయ్యాడు.

తర్వాత తేరుకొని చూసి తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేసాను అని కుమిలి పోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్ష మైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులతో ప్రతి రోజూ ఒక డజను అరటి పండ్లు తెచ్చి స్వామి విగ్రహానికి తొక్క వలిచి పండు మాత్రమే నివేదిస్తూ వచ్చాడు.

ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు... దాంతో భక్తుడు బాధతో... ‘తండ్రి అపరాధి అయిన ఈ భక్తుడుని కరుణించి దర్శనం ఇవ్వమని’ వేడుకున్నాడు.

దయార్ద్ర హృదయుడైన స్వామి భక్తుడు కోరిన విధంగా మరలా ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో ఆ భక్తుడు స్వామికి అరటి పండ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు మరల జరగకుండా తొక్క పడవేసి పండు స్వామికి అందించాడు. కాని విష్ణుమూర్తి పండు తినటానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలిన ఫలితం లేదు.

అప్పుడు ఆ భక్తుడు ఆవేదనతో... “స్వామీ ! నా భక్తిలో ఏదైనా లోపం వుందా !? గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా ! ఇప్పుడు ఇలా కినుక వహించారు ఏమిటి ?” అని ప్రశ్నంచాడు.

విష్ణుమూర్తి చిన్నగా నవ్వి... “నాయనా ఇంతకుముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించి నందున స్వీకరించాను. ఇప్పుడు నీ మనస్సు అరటిపండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా భక్తి రసహీనం కావడం వలన అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను” అని సమాధానం ఇచ్చాడు.

స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయ్యింది. భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనస్సుతో ఆరాధించి తిరిగి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.

దేవుడు తనకు నైవేద్యంగా ఏం పెట్టారో ఆయా పదార్థాల విశిష్టతను చూడడు. ఎంత భక్తితో సమర్పించారు అనేదే చూస్తాడు. కాబట్టి మనం చేసే పూజ, ప్రార్థనాదులందు భక్తికి ప్రాధాన్య నిచ్చి, మనస్సును ఏకాగ్రతతో నిలపడాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి.

“అణ్యప్యుపాహృతం భక్త్యా
ప్రేమ్ణాభూర్యేన మే భవేత్ ।
భూర్యప్యభక్తోపహృతం న
మే తోషాయ కల్పతే ॥”

కొంచమైనా భక్తితో, ప్రేమతో పెట్టినది కొండంత కాగలదు.

కొండంత సమర్పించినా భక్తితో కూడియుండనిచో అది నాకు సంతుష్టిని కలుగజేయ జాలదు.

అను ఈ భగవద్ వాక్యమును ఎప్పుడూ గుర్తుంచుకుని ఆ సర్వేశ్వరుని యెడల అనన్య భక్తి భావమును పెంపొందించు కోవాలి

Source - Whatsapp Message

No comments:

Post a Comment