Tuesday, July 20, 2021

కలలు కూలిపోయాయి.. స్థైర్యం నిలబెట్టింది!

కలలు కూలిపోయాయి.. స్థైర్యం నిలబెట్టింది!
💎💥💦🌟🌈💧

ఉత్సాహం పరవళ్లు తొక్కడం అంటే ఏంటో మరియాను చూస్తే తెలుస్తుంది. పదిమందికీ సేవ చేయాలంటే వైద్యవిద్య చదవాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది తను. కలల సాకారం దిశగా అడుగులు వేస్తున్న ఆ అమ్మాయిని విధి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. మరియా బెదరలేదు... కష్టాలను ధిక్కరిస్తోంది... విధిని వెక్కిరిస్తోంది...

కలలు కూలిపోయాయి.. స్థైర్యం నిలబెట్టింది!

కొచ్చిలో ఓ మధ్యతరగతి కుటుంబం మరియా బిజు వాళ్లది. నాన్న పీటర్‌ వ్యాపారి. అమ్మ సునీ గృహిణి. పేదలకు అమ్మానాన్నలు చేసే సాయం చూశాక తనూ తోటివారికి తోడ్పడాలనుకుంది. ఇందుకు డాక్టర్‌ అవ్వడమే మంచి మార్గమని నిర్ణయించుకుంది. ఇంటర్‌ తర్వాత మెడిసిన్‌ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి తొడుపుళా అఘర్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది. ఎప్పుడూ చలాకీగా, ఉత్సాహంగా ఉండే మరియా కొద్ది రోజుల్లోనే ‘చాలా చురుకైన అమ్మాయి’గా పేరు తెచ్చుకుంది. రోజులు ఇంతే హాయిగా సాగిపోయి ఉంటే బాగానే ఉండేది. కానీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆ రోజు జూన్‌ 5, 2016. వర్షం వస్తోందని ఆరేసిన దుస్తులు తెచ్చుకోవడానికి బాల్కనీలోకి వెళ్లింది. అప్పటికే ఆ చోటంతా వర్షపు నీటితో నానిపోయి ఉంది. చీకట్లో అది గమనించలేకపోయింది. రెండో అంతస్తులో ఉన్న ఆ బాల్కనీ నుంచి జారి కింద పడిపోయింది. రక్తపు మడుగులో అచేతనంగా ఉన్న ఆమెని ఆసుపత్రికి తరలించారు. చేతులు, ముఖం, కాళ్లు, వెన్నెముకలకు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఐసీయూ నుంచి బయటకు రావడానికే రెండు నెలలు పట్టింది. వెన్నెముక గాయం కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమవ్వాలని తెలిసి కుప్ప కూలిపోయింది మరియా. ‘నా నడుం కింద నుంచి శరీరం మొత్తం చచ్చుబడి పోయింది. పట్టుమని పదినిమిషాలు కూడా ఒక చోట ఉండటానికి ఇష్టపడని నేను ఇలా కదల్లేని స్థితికొస్తానని అనుకోలేదు. తల్చుకుంటే భరించలేని దుఃఖం ఆవరించేది. అమ్మానాన్న ధైర్యం చెప్పడంతో కోలుకోవడం మొదలుపెట్టా. వరసగా చాలా సర్జరీలు జరిగాయి. ఆసుపత్రి నుంచి బయటకు రావడానికి నాలుగు నెలలు పట్టింది. అప్పటి నా మానసిక స్థితి చూసి వెల్లూరు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్చారు. తర్వాత పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. నా అంతట నేను బ్రష్‌ చేసుకోవడం, చెంచా పట్టుకొని తినడం వంటి పనులన్నీ నేర్చుకున్నా. ఆ సమయంలో అమ్మ, నా తోబుట్టువులు నీడలా నాతోనే ఉండేవారు. నాలో నిండిన నిరుత్సాహం అమ్మ వల్ల కొంచెం కొంచెంగా దూరమైంది. డాక్టరు కావాలనే నా లక్ష్యానికి వైకల్యం అడ్డుకాకూ డదనుకున్నా. తిరిగి చదువుకుంటా అంటే ఇంట్లో వాళ్లూ ప్రోత్సహించార’ని గుర్తు చేసుకుంది మరియా.
ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత కాలేజీలో అడుగుపెట్టింది. చక్రాల కుర్చీలోనే క్లాసులకు వెళ్లేది. ఏదైనా రాద్దామంటే చేతివేళ్లు మొరాయించేవి. వాటిలో కదలిక తీసుకురావడం కోసం ఖాళీ సమయంలో చిత్రలేఖనాలు వేయడం, వయొలిన్‌ వాయించడం వంటి అభిరుచులతో ప్రయత్నించేది. వీటికి ఫిజియోథెరపీ కూడా తోడయ్యింది. చదువుల్లో తోటి విద్యార్థినులు ఆమెకు అండగా నిలిచారు. దాంతో మొదటి ఏడాది పరీక్షలకు సిద్ధమైంది. స్క్రైబ్‌ సాయాన్ని తీసుకోమన్నారు కాలేజీ నిర్వాహకులు. ‘ఎంబీబీఎస్‌ పరీక్షలను ఆ కోర్సు చదివే విద్యార్థి మాత్రమే స్క్రైబ్‌గా పనికొస్తారు. అలా కుదరక పోయేసరికి నేనే రాద్దామని నిశ్చయించుకున్నా. కానీ చాలా కష్టమైంది. పెన్‌ పట్టుకొని రాయడానికి ఎంతో సాధన చేసేదాన్ని. వేళ్లు విపరీతంగా నొప్పి పెట్టేవి. నాలుగైదు గంటలు కష్టపడి సాధన చేసేదాన్ని. నెలరోజుల తర్వాత రాతపై పట్టుసాధించా. అలా ఆ ఏడాది పరీక్షలు రాసి పాసయ్యాను. నాలుగేళ్ల కోర్సును 64 శాతం మార్కులతో పూర్తి చేయగలిగా. నా కల సర్జన్‌ అవ్వాలని. శస్త్రచికిత్స చేయడానికి నా చేతివేళ్లను ఇంకా సిద్ధం చేసుకోవాలి. ఇటీవలే హౌస్‌సర్జన్‌గా చేరా. ప్రమాదం జరిగినప్పటి నుంచి అమ్మ నా నీడలా ఉంటూ సేవలు చేస్తోంది. తన రుణం తీర్చుకోవాలంటే నేను పేదలకు ఉచితంగా వైద్యం చేయాలి. నన్ను నేను నిరూపించుకుని, నాలాంటి వారికి నేనో ఉదాహరణగా ఉండాలన్నదే నా కల’ అని చెప్పే మరియా తనకిష్టమైన బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌లను ఆడటంతోపాటు బొమ్మలూ చాలా చక్కగా వేస్తుంది. తన చిత్రలేఖనాలకు సోషల్‌మీడియాలో బాగా అమ్ముడు పోతూంటాయి. తన జీవితాన్నే పట్టుదలకు ప్రతిరూపంగా చూపుతూ యువతలో స్ఫూర్తినింపే వక్తగానూ మారింది.👏

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment