Friday, January 28, 2022

నేటి జీవిత సత్యం. *💥తలుపులు 🌈* *🌀తెరుద్దాం💥*

నేటి జీవిత సత్యం. 💥తలుపులు 🌈
🌀తెరుద్దాం💥


ప్రభాతకాలంలో తలుపులు తెరవగానే అరుణవర్ణంతో ఆకాశం దర్శనమిస్తుంది. సూర్యకిరణాలు నులివెచ్చగా, ప్రసన్నంగా పలకరిస్తాయి. పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. అప్పుడే మేల్కొంటున్న లోకం స్వాగతం పలుకుతుంది. శరీరం, మనసు పులకిస్తాయి.

రోజంతా ఇదే ఆనందం, ఆహ్లాదం ఉంటాయా అంటే ప్రశ్నార్థకమే. దైనందిన జీవనం సాయం సమయం వరకు ఎంతో శ్రమకు గురవుతుంది. భారాన్ని మోస్తుంది. అలసట చెందుతుంది. కొందరికి తృప్తినిస్తే మరికొందరికి అసంతృప్తిని ఇస్తుంది.

మనసు చెప్పుచేతల్లో ఉండదు. దానిపై మనిషికి నియంత్రణ ఉండదు. కోర్కెలపై అదుపు ఉండదు. స్వార్థచింతన అంటిపెట్టుకొని ఉంటుంది. అహంకారం, ఆభిజాత్యం వంటివి వదలకుండా ఉంటాయి. ఇవే ప్రధాన కారణాలు.


వీటి ప్రాబల్యంతో మనసు ఎప్పుడూ ‘స్వీకరించేదిగానే’ ఉంటుంది. ఇవ్వడం, పంచడం వంటివి ఉండవు. నేను-నాది అన్న వలయంలోనే ఉండిపోతుంది.

హృదయం తలుపులు మూసిన చీకటిగదిలా ఉంటుంది. దీంతో మనసు సమస్యలను సృష్టించుకుంటూ వాటిని పరిష్కరించుకోవాలన్న తాపత్రయంతో వేదన పాలవుతుంటుంది. హృదయం మనసును స్పందింపజేస్తుంటుంది. మనఃస్థితి హృదయస్పందనను బట్టి ఉంటుంది. ఈ రెండూ ఒకే నాణేనికున్న రెండు పార్శ్వాల్లాంటివి.

‘నీ తల్లిదండ్రులు, భార్యాబిడ్డల సుఖంకోసం దోపిడులు చేస్తున్నా నంటున్నావు. నీ పాపాల్లో భాగం పంచుకుంటారేమో అడిగిచూడు!’ అన్న నారద మహర్షి మాటతో రత్నాకరుడనే దోపిడి దొంగ తన ఆవాసానికి వెళ్లి తల్లిదండ్రులను, భార్యను అదే అడిగాడు. ‘మమ్మల్ని పోషించడం నీ బాధ్యత. నీ పాపాల్లో మేమెలా భాగం పంచుకుంటాం?’ అని సమాధానమిచ్చారు.

చీకటి తెరలు తొలగాయి. వెలుగు రేఖలు ఉదయించాయి. నారద మహర్షి ఉపదేశంతో వాల్మీకి మహర్షిగా మారాడు. లోకారాధ్యుడయ్యాడు.


నిన్ను నీవు తెలుసుకుంటే విశ్వంపట్ల ఆరాధనాభావం ఏర్పడుతుంది. విశ్వంలోని చైతన్యమే భగవానుడి రూపమన్న సత్యాన్ని గ్రహిస్తావని అంటాయి ఉపనిషత్తులు.

సుఖ దుఃఖాలకు రాగద్వేషాలకు మహానుభావులు అతీతంగా ఉంటారు. సర్వత్రా సమదర్శనం వారిది. స్థితప్రజ్ఞ కలవారు సుఖదుఃఖాలను, ఎత్తుపల్లాలను ఒకటిగానే భావిస్తారు.

అధ్యయనం, ఆత్మపరిశీలన, అభ్యాసం ద్వారా హృదయాన్ని వికసింపజేసుకోవాలి. ఇందుకు ఆధ్యాత్మిక సాధనా మార్గం దోహదపడుతుంది.

మనిషి తనకు తోచిందే న్యాయమని భావిస్తాడు. ఇతరుల స్వరూప స్వభావాలు నిర్ణయించుకోవడంలో తప్పులు చేస్తాడు. తనకు తెలిసిందే ప్రపంచమని భావిస్తాడు. ఈ ధోరణి మారాలి.


దూషణ, తిరస్కారాలను ప్రేమాభిమానాలతో జయించాలి. లక్ష్యసాధనపైనే మనసు లగ్నం కావాలి. ఈర్ష్యాసూయలు పండంటి జీవితాలను ఛిద్రం చేస్తాయని గ్రహించాలి. మనకు కష్టాలెదురైనప్పుడు మేరు శిఖరంలా ఉండాలి. ఇతరుల కష్టాలకు మంచు శిఖరంలా కరిగిపోవాలి. ఈ సద్గుణ సాధనకు మనిషి కంకణధారి కావాలి. ఈ గుణాలు కలిగిన మనిషి ప్రతి నిత్యం ఆనందంగా ఉంటాడు. ఆ మనసుకు బాధ భయం ఉండవు. అడుగుపెట్టిన చోట ఆహ్లాద వాతావరణాన్ని చూస్తాడు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment