Friday, January 28, 2022

సంకల్పబలం

సంకల్పబలం

ఏ పనిలోనైనా ఉత్తమఫలానికి సోపానాలను పరచేది అద్భుతమైన సంకల్పబలమే. కార్యాన్ని సాధించాలంటే సంకల్పమే సంతులితమైన శక్తిని సాధకుడికి అందిస్తుంది. మనిషికున్న ప్రధానమైన వనరు మదిలో ఒక విషయాన్ని సాధించే దిశలో మెదిలే ఆలోచన. తరవాత వెంటనే ఆ దిశగా విజయాన్ని సాధించాలనే సంకల్పం జనిస్తుంది. అది బలం పుంజుకొనే దారిలో అడ్డుగా నిలిచేది వికల్పం. వికల్పం అంటే, తాను సాధించదలచిన కార్యాన్ని సానుకూలంగా మలచుకోగలనా లేదా అనే అనుమానం, విజయాన్ని కైవసం చేసుకోగలనా అనే సందిగ్ధత! ముందుగా తన సంకల్పం సిద్ధించాలంటే, మనిషి దూరం చేసుకోవలసిన ప్రధానమైన శత్రువు- అనుమానం. అది అణుమాత్రం ఉన్నా, అపజయానికి మనిషి చేరువవుతున్నట్లే గ్రహించాలి.

మానవమేధకు అందనిదీ లేదు... అంతుచిక్కనిదీ లేదు. కావలసింది ఒక్కటే, తాను కార్యకుశలతను చూపి విజయాన్ని సాధించగలను అన్న సంకల్పబలం. తాను సంకల్పాన్ని చేబూని, చేరే లక్ష్యం దిశగా చిన్న చిన్న ప్రయోగాలు, వాటి ఫలితాలను బేరీజు వేసుకుంటూ, భావిలో సాధించబోయే కార్యానికి ప్రణాళికను రూపొందించుకుంటూ ముందుకు సాగిపోవాలి. సంకల్పబలంతో ముందుకు సాగితే, దుర్నిరీక్ష్యమైన లక్ష్యమైనా అవలీలగా సాకారమవుతుంది. బలవత్తరమైన కొండచిలువ సైతం అల్పమైన శక్తికలిగిన చలిచీమల చేతచిక్కి చస్తుందనేది తెలిసిందే. సంకల్పం అంటే కోరిక లేదా మనో నిశ్చయం. మనసులో కలిగిన దృఢమైన మనోవ్యాపారాన్ని సాధించాలంటే శక్తి ఒక్కటే చాలదు. తగినపాళ్లలో యుక్తి కూడా అవసరం. అంటే, ఎప్పుడు, ఏ విధంగా ప్రవర్తించాలి, సాధనలో ఎప్పుడు ముందుకు పరిశ్రమిస్తూ, పరిక్రమించాలి వంటి విషయాలు. మనసు అనే తరాజు ప్రతి విషయాన్నీ బేరీజు వేసుకుంటూ ముందుకు సాగితే, విజయలక్ష్మి తప్పక వరిస్తుంది.

మనిషి భూమిపై తిరిగే లేశమాత్రపు జీవిగానూ కనిపిస్తాడు. ఆకాశవీధిలో జోరుగాసాగే వ్యోమగామిగానూ దర్శన మిస్తాడు. సంకల్పం తమ శ్వాసగా, ధ్యాసగా ముందుకు సాగితే, భక్తుడే భగవానుడిలా అవతరిస్తాడని చాటిన ఘనుడు ధ్రువుడు. తాను విష్ణుదేవుడి కటాక్షంకోసం తీవ్రమైన తపస్సు సాగిస్తానని అన్నప్పుడు, దేవర్షి నారదుడు ‘బాలుడవు నీవు’ అని నవ్వినా, వెనుతిరగక, కఠోరతపస్సుతో నారాయణుణ్ని మెప్పించి, ఎన్నటికీ చెదరని ‘ధ్రువక్షితి’ని కైవసం చేసుకుని ధ్రువతారగా నిలిచాడు.


మనం పొందే ప్రతి అపజయమూ, మన విజయానికి మరో మెట్టు అనుకుంటే- మనిషి తాను అనుకున్నది సాధించడంలో అలుపన్నదే ఎరుగడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని మన దేశం నుంచి తుడిచిపెట్టడానికి ఎంతమంది త్యాగధనుల సంకల్పబలం కారణమైందో వారి జీవిత చరిత్రలే తేజోమయంగా తెలియజేస్తాయి. చెదరని సంకల్పబలంతో మానవాళి మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ నేడు ఏ విధంగా ముందుకు సాగుతోందో మనమంతా గమనిస్తూనే ఉన్నాం కదా!

సంకల్పబలం ఉంటే చాలు, సాధకుడికి ఏ పనిలోనైనా విజయం సిద్ధిస్తుంది. కార్యనిర్వాహకత్వంలో చూపే సంకల్పబలం, అత్యున్నతమైనదిగా భావించే నిర్వాణపథంలోనూ ఆవశ్యకమేనని భక్తుల చరితాలు వెల్లడిస్తాయి. నిర్వాణసోపానాన్ని అధిరోహించాలంటే అందుకు కావలసిన ఉత్తమజీవన పద్ధతులను చెక్కు చెదరని సంకల్పంతో అనుసరిస్తూ, దైవం అందించే బలాన్ని దానికి తోడుగా సొంతం చేసుకోవాలి.

- వెంకట్‌ గరికపాటి

సేకరణ

No comments:

Post a Comment