Sunday, January 30, 2022

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది.

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో

♥️ కథ-52 ♥️

చదవడానికి ముందు... నెమ్మదిగా కళ్లు మూసుకోండి... ఈ స్వేచ్ఛా వాతావరణంలో, చిరునవ్వుతో దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి... స్వేచ్ఛను అనుభూతి చెందండి... చదవడం కొనసాగించండి...

రష్యాలో వివాహం
సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు:

ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు.... ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను.
వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంతఅందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువ జంట మీద పడింది.
వాళ్ళు కొత్త పెళ్లిఅయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి.
అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.
ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది. ఆమె వెనుక, ఇద్దరు తోడుపెళ్లి కూతురులు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.
ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు. అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు.
ఆ దృశ్యం చాలా అందంగా ఉంది.
నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోయాను. వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా ఆనందకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు. నేను చూస్తూండగా వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు.
నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను. కానీ నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.
నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓ వృద్ధుడిపై నా చూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే, "మీరు భారతీయులా?" అని అడిగాడు.
“ అవును నేను భారతీయురాలినే”అని నమ్రతగా బదులిచ్చాను. చాలా ఆప్యాయంగా ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈలోగా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను.
అతను చాలా మర్యాదపూర్వకంగా ఇలా బదులిచ్చాడు: "నేను విదేశాలలో పనిచేశాను."
దానితో, నేను, "ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?", అని అడిగాను.
"ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారం జరుగుతాయి" అని అతను చెప్తూ, "ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి. ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి. అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి", అని వివరించాడు.
నేను చాలా ఆశ్చర్యపోయాను, "ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?" అని అడిగాను.
అది విని, "ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి."
“పెళ్లి వేడుకల కంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మా పెద్దల నమ్మకం.. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం."
ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఒక్కటే మెదిలింది, ఇక్కడ మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం?
మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మన అమరవీరులను స్మరించుకునే రివాజు మనకు ఉందా?
మన దేశంలో వివాహాల సమయంలో, చీరల కోసం షాపింగ్ చేయడం, ఆభరణాలను కొనుగోలు చేయడం, విస్తృతమైన వంటకాలను సిద్ధం చేయడం, డిస్కోలలో పార్టీలు చేసుకోవడం మొదలైన వాటితో తీరిక లేకుండా గడుపుతాం.
బహుశా మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించమేమో.
ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.
మన దేశం కోసం, మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం - ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,...!

♾️

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది. 🌼
దాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment