Sunday, January 30, 2022

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

 *🙏🌷దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!🌷🙏*


*https://chat.whatsapp.com/G9JYO020qwIEZux1f10tNR*


*దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః*


*దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే*


*బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం)* 


                                * * *

*దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)*

                                * * *

*దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)*

                                 * * *

*ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)*


                                * * *


*మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)*

                                  * * *


*భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...*


*దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే* -


*భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?*


*మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!*


*మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.*


*మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?*


*ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!*


*ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు.*


*హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది.*


*మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది.*


*ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని!*


*ఇంకా ఉంది తర్వాతి పోస్టులో*


*ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేకపోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?*


*https://chat.whatsapp.com/G9JYO020qwIEZux1f10tNR*


*'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం. ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.*


*అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహలాడుతుంటాం. మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.*


*'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం. మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.*


*నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. "గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుందంటారు భగవాన్ రమణమహర్షి.*


No comments:

Post a Comment