Friday, January 28, 2022

మనుషులను వాడుకుంటాం, వస్తువులను ప్రేమిస్తున్నాం.

తను కొత్త కారును శుభ్రం చేసుకుంటూ, బాగా తుడిచి పాలీష్ చేసుకొంటూ ఉంటే, మరో పక్కన అతని నాలుగేళ్ల కొడుకు ఒక పదునైన వస్తువుతో కారు మీద గీతలు గీయడం మొదలు పెట్టాడు. అది చూసిన తండ్రి పిచ్చ కోపంతో, “ఏం చేస్తున్నావురా???” అంటూ చేతిలో ఉన్న స్పానర్ తో ఆ అబ్బాయి చేతివేళ్ళ మీద బలంగా కొట్టసాగాడు.

ఎంత గట్టిగా కొట్టాడంటే చేతివేళ్ళు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. బాలుడిని హాస్పెటల్లో చేర్చితే చితికిపోయిన వేళ్ళన్నీ తీసేయాల్సి వచ్చింది. తండ్రిని చూసిన కొడుకు, బాధను దిగమింగుకుంటూ, “నాన్నా, నా వేళ్ళు మళ్ళీ ఎంత కాలానికి మొలుస్తాయి.”

అని మూర్తీభవించిన అమాయకత్వంతో అడిగాడు. కొడుకును చూసి తండ్రి బాధ భరించలేక కారు దగ్గరికి పోయి కసితీరా కాలితో తన్నాడు. తన చర్యలకు తనే విస్తుపోయి, కారు దగ్గర కూర్చున్నాడు. కొడుకు కారు మీద గీచిన పిచ్చి గీతలు కనబడ్డాయి. దుఃఖం ఆపుకోలేక వాటిని జాగ్రత్తగా చూస్తే, ఐ లవ్ యూ డాడ్

I LOVE YOU DAD అని కనిపించాయి.

కోపానికి, ప్రేమకు అవధులు ఉండవు. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, మనుషులను వాడుకుంటాం, వస్తువులను ప్రేమిస్తున్నాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment