Saturday, January 29, 2022

పరోపకారం ఇదం శరీరం

🍁పరోపకారం ఇదం శరీరం🍁

📚✍️ మురళీ మోహన్

-[ప్రతి ఒక్కరికి.. శరీరమే అతిపెద్ద నిధి]-

ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి, కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.

రామాపురం అనే ఊరి చివరిగా ఓ గురువుగారు ఒకే ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.

మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన ధర్మాలు చేయరు.


అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.

నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు. అందులో మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండిఉండ వచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నువ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.


ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు‌. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.

ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.

ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

కాబట్టి ప్రియ ఆత్మీయులారా ! నీ ఒక చిన్న సహాయం, నీ చేయూత ఎదుటి వారి జీవితాలలో దేదీప్యమానంగా వెలుగులను వెలిగించగలవు. అందుకే పెద్దలు అంటారు భగవంతుడు మనకిచ్చిన జీవితం, కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ ! అలాంటి నీ జీవితాన్ని దుర్భరం చేసుకొంటూ నీవు ఏడుస్తూ, ఇతరులను ఏడిపించక ప్రతిక్షణం ఆనందంగా నీవు ఉంటూ, ఆ ఆనందాన్ని పదిమందికి అనేక రకాలుగా పంచుతూ శారీరకంగా, మానసికంగా అందరికీ సహాయపడుతూ, నీ జన్మను చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..

🕉🌞🌎🌙🌟🚩

సేకరణ

No comments:

Post a Comment