Friday, January 28, 2022

🌀విచిత్రం... మనిషి* *తత్వం*💥

🌀విచిత్రం... మనిషి
తత్వం💥

సృష్టిలోని ఒకే జాతికి చెందిన జీవులన్నీ ఒకే రకమైన లక్షణాలు, అలవాట్లు కలిగి ఉంటాయి. మనిషి తత్వం విచిత్రం. మనిషి ముఖం చూసి సన్మార్గుడో, దుర్మార్గుడో నిర్ణయించడం కష్టం. ఒకే ఆకారంలో కనిపించినా మనుషుల మధ్య గోముఖ వ్యాఘ్రాలుంటాయి.
విచిత్రం... మనిషి తత్వం
జ్ఞానులు, అజ్ఞానులు, మంచివారు, చెడ్డవారు, శాకాహారులు-మాంసాహారులు, ధర్మవర్తనులు, అధర్మ చింతనులు, అమాయకులు-అహంకారులు, బుద్ధిమంతులు-బుద్ధిహీనులు వంటి వైరుధ్య స్వభావులు కలిసి తిరగగలగడం మానవజాతి ప్రత్యేకత.
మనిషికి పైకి కనిపించే చేతులు, కాళ్లు వంటి అవయవాలు- కంటికి కనిపించని మనసు, బుద్ధి ఆదేశానుసారం పనిచేస్తాయి. మాట నేర్చిన మనిషి మంచి మాటలు చెప్పగలడు. వితండవాదనా చేయగలడు. మనిషి తన భావనలతో ఏకీభవించినవారిని, మనసుకు నచ్చినవారిని ఆత్మీయులంటాడు. తనమాట కాదన్నవారిని శత్రువులుగా భావిస్తాడు.
నమ్మించి మోసం చేయడం, ప్రేమించి ద్వేషించడం, అభిమానిస్తూనే అనుమానించడం, మాటలతో కవ్వించడం, ఆవేశంతో కక్ష కట్టడం మనిషి నేర్చిన కళ. మనసు మాయకు లొంగిపోవడం మానవ బలహీనత. ప్రశాంతంగా జీవించగల శక్తియుతుడు అశాంతితో అలమటిస్తుంటాడు. నిలకడ లేని మనస్తత్వం మనిషి తత్వం.

మరుక్షణంలో జరగబోయేది తెలుసుకోలేనివాడు కాలాన్ని శాసించ గలనన్న భ్రమలో బతుకుతాడు. మంచిచెడుల విచక్షణ చేయగలవాడు చెడుమార్గాన్ని అనుసరించడానికి ఉత్సాహపడతాడు. హానికరమని తెలిసీ దుర్వ్యసనాలకు బానిసవుతాడు. స్వయంకృతాపరాధాలతో సతమతమవుతాడు. దుష్టులు, దురా త్ములైనవారి సంఖ్య పరిమితమై నందుకే ఈ జగత్తు ఇంకా నిలిచి ఉందని లోకాభిప్రాయం.

యుద్ధ భయంతో నిద్రపట్టక అలమటిస్తున్న ధృతరాష్ట్రుడికి సకల శాస్త్ర పండితుడు, నీతి కోవిదుడు, ధర్మవేత్త అయిన విదురుడే నీతి సూత్రాలు బోధించాడు. మానవ శరీరం ఒక రథం. దానికి ఆత్మ(బుద్ధి) సారథి. ఆ రథానికి అశ్వాలు ఇంద్రియాలు. జాగరూకతతో నిపుణుడైన ధీరుడు తనకు వశమైన గుర్రాలతో మహారథికుడిలా సుఖంగా జీవన ప్రయాణం సాగిస్తాడని, శిక్షణ పొందని అదుపులోకి రాని గుర్రాలు మార్గమధ్యంలో సారథిని కూలదోసినట్లు అదుపు కాని ఇంద్రియాలు మానవుణ్ని నాశనం చేస్తాయని విదురుడు బోధించాడు.
మాట్లాడటం కన్నా మౌనం మేలని, మాట్లాడితే సత్యం మాట్లాడటం రెట్టింపు మేలని, ఆ సత్యం ప్రియంగా పలకడం మూడు రెట్లు మేలని, ఆ సత్యం, ప్రియం ధర్మంతో కలిసి ఉంటే నాలుగు రెట్లు మేలని విదురుడు ఉపదేశించాడు.

వ్యక్తికి శీలం(సత్ప్రవర్తన) ముఖ్యం. శీలంతో ధర్మం తెలుస్తుంది. అసూయ లేనివాడు, ప్రజ్ఞ కలవాడు, సదా సత్కార్యాలు చేసేవాడు అందరికీ ఇష్టుడవుతాడని, ఉత్తమ పురుషుడు ఇతరులకు కీడు తలపెట్టక అందరి అభ్యున్నతిని కోరుకుంటాడని, మానవుడు ప్రయత్నపూర్వకంగా తన నడవడిని రక్షించుకోవాలన్న విదుర నీతిని అనుసరించి జీవన విధానాన్ని తీర్చిదిద్దుకునేవారు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతారనడంలో సందేహం లేదు.
విదురుడు సమగ్రంగా బోధించిన ధర్మ, న్యాయ, నీతి సూత్రాలను శ్రద్ధగా విన్న ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యానికి లోబడి కౌరవపాండవ యుద్ధాన్ని నివారించలేక కురువంశ నాశనానికి కారకుడయ్యాడు. జ్ఞానుల బోధనలను విని అర్థం చేసుకున్నా ఆచరించకపోతే ఫలితం శూన్యమని గ్రహించాలి.

- ఇంద్రగంటి నరసింహమూర్తి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment