Thursday, September 1, 2022

అన్నిటిలో పరమాత్మను చూడాలి

 అన్నిటిలో పరమాత్మను చూడాలి

🔹🔸🔹🔸🔹🔸

'సమత్వం’ అనే భావన భగవద్గీత అంతటా అంతస్సూత్రంగా కనిపిస్తుంది. సమత్వ భావం, సమత్వ దృష్టి, సమత్వ బుద్ధి గురించి అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు ప్రధానంగా ప్రస్తావించాడు. ‘సమత్వం’ అనే మాట బాగానే అర్థమవుతుంది, కానీ దాని అంతరార్థాన్ని అంత సులువుగా గ్రహించలేం. మనలో ఉండే సమత్వ స్థాయి... ఆధ్యాత్మిక మార్గంలో మన పురోగతికి ఒక సూచిక. ‘చట్టం ముందు పౌరులందరూ సమానమే’ అనే భావనగా.... భౌతిక ప్రపంచంలోని అనేక సమాజాలు సమత్వాన్ని ఆమోదించాయి. సమత్వానికి అనేక ఉదాహరణలను శ్రీకృష్ణుడు ఇచ్చాడు. వేటకు గురయ్యేదాన్ని, వేటాడేదాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్నీ, లాభాన్నీ, నష్టాన్నీ... ఇలా వేటినైనా జ్ఞానులు సమానంగానే చూస్తారని చెప్పాడు. 

ఇబ్బందేమిటంటే... సంస్కృతి, మతం, కులం, జాతీయత, జాతి... ఇలా అనేక విషయాల ఆధారంగా ఏర్పరచుకున్న ఒకటి లేదా అనేక కృత్రిమ విభజనల ఆధారంగా మనల్ని మనం గుర్తించుకుంటూ ఉంటాం. ఇలాంటి విభజనల్ని అధిగమించడానికి, ఇద్దరు భిన్నమైన వ్యక్తులను ఒకేలా చూడడానికి కావలసిన సామర్థ్యాన్ని సాధించడమే సమత్వానికి మొదటి అడుగు. సహజంగానే ఇది బయటకు కనిపించే ప్రవర్తన కన్నా చాలా లోతుగా ఉంటుంది. సమత్వంలో పురోగతికి తదుపరి స్థాయి... మనకు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను సమత్వంతో చూడగలిగే సామర్థ్యం. మన పిల్లలకు మంచి ఫలితాలు రాకపోయినా... వారి స్నేహితులకు వచ్చినప్పుడు ఆనందించడం, తల్లినీ, అత్తగారినీ ఒకేలా గౌరవించడం, కూతురినీ, కోడలినీ సమానంగా చూడడం... ఇలాంటివి. 
సమత్వంలో అత్యున్నత స్థాయి... ఇతరులతో మనల్ని సమానంగా పరిగణించుకొనే సామర్థ్యం. మనకు చెందినవిగా మనం విశ్వసించేవి... అంటే పదోన్నతి, పేరు ప్రతిష్టలు, ఘనతలు, ఆస్తులు లాంటివి... ఇతరులు పొందినప్పుడు... సమత్వ భావనతో చూడగలిగే సామర్థ్యం. ఇతరుల బలహీనతలు మనలో కూడా ఉన్నాయనీ, మన బలాలు ఇతరుల్లోనూ ఉన్నాయనీ మనం చూడగలిగినప్పుడే ఇది సంభవిస్తుంది. ఇతరుల్లో మనల్నీ, మనలో ఇతరుల్నీ చూడాలని శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. అంతిమంగా ప్రతి ఒక్కరిలో, ప్రతి చోటా ఆ పరమాత్మను చూడాలి. ఇది అచ్చంగా అద్వైతమే. రెండు అనేవి లేనేలేవని అది చెబుతుంది. సమత్వంలో ఈ అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి మనకు ప్రధాన అవరోధం మన మనసే. అది విభజించడానికి శిక్షణ పొందింది. అది ఆధిపత్యం చెయ్యడానికి అనుమతించడానికి బదులు, దాన్ని లొంగదీసుకొనే సామర్థ్యాన్ని సాధించాలి.

🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment