Thursday, March 23, 2023

సమాధానం అంటే ఏమిటి?

 🍒 *"సమాధానం అంటే ఏమిటి?"* 🍒
        🌹🍒🌹🍒🌹🍒🌹
             🌹🍒🕉️🍒🌹
                   🌹🍒🌹
                         🌹

*"మనస్సును, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని; అటువంటి మనస్సును బాహ్యవిషయాలలోనికి పోనీయకుండా నిల్పి, చుట్టూ మోహం కలిగించే వస్తువులున్నప్పటికీ మనస్సులో ఎట్టి చలనము కలగకుండా ఉపరతిలో నిల్పినప్పుడు, మనస్సు భగవంతుని ఆలోచనల యందే స్థిరంగా నిలిచి శాంతంగా ఉంటుంది. అలా మనస్సు శాంతించినప్పుడు బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది, శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకుంటుంది, పరమాత్మతత్త్వాన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకొని ఆ తత్వ విచారణలో నిత్యము - నిరంతరము బుద్ధిని నిలపాలి. ఈ ప్రపంచానికి ఆధారంగా అధిష్టానంగా ఉన్నది సర్వవ్యాపక బ్రహ్మమేనని - అదే భగవంతుడు - అదే పరమాత్మ అని; అదే అంతటా - అన్నివేళలా అన్ని చరాచరములందు అధిష్టానంగా ఉన్నదని గ్రహించి నిర్మలమైన సూక్ష్మబుద్ధిని ఆ పరమ సత్యంతో ఐక్యం చేయాలి. తాదాత్మ్యం చెందాలి. అదే నీవు కావాలి. అలా సూక్ష్మబుద్ధి బ్రహ్మమునే చింతిస్తూ, బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది - నేను బ్రహ్మమునే అని విచారణ చేస్తుంటే మనస్సు ఆనందంగా - ప్రశాంతంగా ఉంటుంది."*
 
*"అట్టి ఆనందస్థితినే సమాధానం అన్నారు."* 

*"అట్టి ఆనందస్థితిలో ఇక బాహ్య వస్తువులకు - విషయాలకు, భోగాలకు విలువ ఉండదు. అందుకే వాటికి చలించం. సామాన్యులకీ విషయం అర్థంకాదు. ఎందుకంటే మనకు సంతోషాన్నిచ్చే వస్తువులు ఎదురుగా ఉంటే వాటి మీదకు దృష్టి పోకుండా ఎలా ఉంటుంది? అనీ, - ఎలా చలించకుండా ఉంటాము? అనీ వారి భావన. అసలు వస్తువులే లేకపోతే సంతోషం ఎలా ఉంటుంది? అని అనుకుంటారు."*

*"ఇరుగు పొరుగున నున్న ఇద్దరు వ్యక్తులు సరిహద్దు తగాదా వద్ద కీచులాడు కొని ఎప్పుడూ ఎడమొగం పెడమొగంగా ఉండేవారు. వారిద్దరూ విమానంలో ప్రయాణిస్తూ క్రిందకు చూస్తే వారి తగాదాకు కారణమైన ఆ స్థలం కనిపించదు. అసలు వారి ఇండ్లు బొమ్మరిళ్ళు లాగా కనిపిస్తాయి. ఇప్పుడు వారిలో ఆ తగాదాను చిన్నవిషయంగా పరిగణించే విశాల భావం కలుగుతుంది. దానితో ఇద్దరూ ఎంతో ప్రేమతో మాట్లాడుకోగలుగుతారు.* *అలాగే ఆధ్యాత్మికపు ఎత్తులకు ఎదుగుతున్న కొద్దీ ఇక్కడి విషయభోగాలు అల్పమైనవై పోతాయి. అందువల్ల వాటిపట్ల ఉదాసీనంగా ఉంటారు..."*

*"ఏక, రూప నామారాధన ఉత్తమం. మాదిరాజు రామచంద్రరావు, భగవంతుడు అనేక రూపాలలో, అనేక నామాలతో భక్తులచే ఆరాధింపబడుతున్నాడు."*

 *"అన్ని నామములు, అన్ని రూపములు ఆయనవే. సకల మంత్ర, త్రంత స్వరూపుడు, సమస్త విశ్వానికి అధిపతి ఆయనే. అందులో సందేహం లేదు. ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేదీ స్థిరమైనది కాదు. అందుకే.. అనంత నామధేయాయ, సర్వాకార విధాయనే సమస్త మంత్ర వాచ్యాయ, విశ్వైక పతయేనమః అంటూ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటాం. అయితే, అన్ని!రూప,నామములు ఆయనవే అయినా.. భక్తులు తమకు ప్రియమైన ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఎంపిక చేసుకొని ప్రగాఢ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మంచిది."*

*"ఏకోన్ముఖం చేయటం వల్ల భక్తిలో గాఢత, తీవ్రత, సాంద్రత పెరుగుతాయి. భక్తులు మైమరచి దైవారాధన చేయగల స్థితి సంప్రాప్తిస్తుంది. ఫలితం సత్వరంగా అందుతుంది."*

 *"భూతద్దంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి, ఆ వెలుగు ఒక కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది. సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే ఇలా జరుగుతుంది. భక్తి కూడా అంతే. కానీ.. కొంతమంది వారంలో ఒక్కోరోజునూ ఒక్కో దేవుడికి కేటాయిస్తారు. సోమవారం శివారాధన, మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ, గురువారం సాయీబాబా గుడికి వెళ్లడం, శుక్రవారం అమ్మవారి ఆలయానికి, శనివారం వేంకటేశ్వర స్వామి కోవెలకు వెళ్లి దర్శనం చేసుకోవటం వంటివి చేస్తుంటారు. అన్ని రూప నామములూ శక్తిమంతమైనవే అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని, శక్తిని, భక్తిని ఇలా అనేక దైవరూపనామాలుగా పంచడం సరియైున విధానం కాదు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన సూక్తి స్మరణీయం.."*

*"పట్టినదేదియో పట్టనేపట్టితివి- పట్టు నెగ్గుడు దాకా అట్టె ఉండు*
*కోరినదేదియో కోరనే కోరితివి-* *కోర్కె చెల్లెడిదాక కొలచియుండు*
*అడిగినదేదియో అడగనే* *అడిగితివి- అడిగినదిడుదాక అట్టె ఉండు*
*తలచినదేదియో తలచనే తలచితివి*
*- తలపు తీరెడుదాకా తలరకుండు*
*పోరుపడలేక తానైన బ్రోవవలయు*
*- ఒడలుతెలియ నీవైన ఉడుగవలయు*
*అంతియేగాని మధ్యలో మరలిపోవుట                        - భక్తుని లక్షణముగాదు*
*చిరస్మరణీయులైన అనేక మంది మహాభక్తుల చరిత్రను పరిశీలించినా ఒకే రూపనామాన్ని అంటిపెట్టుకొని ఉండి జన్మ సాఫల్యం చేసుకోవడం మనకు కన్పిస్తుంది."*

 *"రోమరోమానారామనామాన్ని పలికించిన ఆంజనేయస్వామి చిరంజీవియైు, తానే దైవం స్థాయికి ఎదిగి లోకానికి పూజనీయుడైనాడు. కలియుగంలో కూడా త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, జ్ఞానదేవ్‌, నామదేవ్‌, చైతన్యమహాప్రభు, సక్కుబాయి, మీరాబాయి వంటి మహాభక్తులు ఒకే రూపనామాలను ఆరాధించి ధన్యజీవులైనారు. కనుక మనమంతా మనకు ప్రీతిపాత్రమైన రూప నామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ ధన్యులమవుదాం."*

*"వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి.  అదే జీవన సాఫల్యం.  ఈ ప్రయాణంలో ఎదురయ్యే.."*

*"అతినిద్ర*
*బద్ధకం*
*భయం*
*క్రోధం*
*అలసత్వం*
 *ఎడతెగని ఆలోచన*
*...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని మహాభారతం చెబుతోంది. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు.  ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది.  అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి, ఉన్నతి లభిస్తాయి."*

*"ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.."*

*"నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే."*

*"రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం."*

*"అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి.  బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి.  ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం."*

*"ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం ధీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు."*

*"అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు."* 

*అలాగే..*

*"ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు."*

*"ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి.  ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం."*

*"ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది మనభారతం"*
            

No comments:

Post a Comment