Sunday, April 28, 2024

ధర్మ భిక్షవు మిలారేపా కధ - 1

 *ధర్మ భిక్షవు మిలారేపా కధ - 1* 

☀️

రచన : శ్రీ శార్వరి 
    

*ముందు మాట* 

ఉద్రేకం ఉరకలు వేసే వయసులో తన మంత్ర శక్తితో వడగళ్ల వాన కురిపించి పచ్చని చేలను చిందర వందర చేసి గ్రామస్తుల్ని భయ భ్రాంతుల్ని చేసిన వ్యక్తిని, 83 ఏళ్ల వయసులో శరీరం త్యాగం చేసే సమయంలో అదే ప్రజ ప్రేమ సుమాలతో అభిషేకించే స్థితికి చేరిన సద్గురువు ... మిలారేపా.

మంత్రశక్తితో కిరాతకమైన పనులు చేశావని చీదరించుకుని, హింసించి ఉపదేశం ఇవ్వని గురువు - అదే వ్యక్తిని మహా యోగులలో ఒకడిని చేయడం ... ఊహాతీతం.

నేను పదేళ్ల క్రిందట మిలారేపా జీవిత చరిత్ర చదివి ఎంతో చైతన్యం పొందాను. ఆ మహాత్ముని జీవిత సంఘటనలు ఎన్నో ఆత్మాన్వేషణలో సాధకులకు క్లిష్ట సమయం లో సహకరిస్తుంటాయి.

గౌతమ బుద్ధుని తర్వాత ఆయన ధ్యాన సూత్రాలు 'మహాముద్ర' పేర రత్నమతికి, ఆయన నుండి బోధిసత్వులకు అందాయి. మన దేశంలో శావరి నుండి నాగార్జునికి, తర్వాత టిబెట్ లో మైత్రిపా, తిలోపా, నారోపా, మార్పాలు అంది పుచ్చుకున్నారు. మిలారేపా కి గురువు మార్పా.

మానవ వికాసానికి, పరిణామానికి మహా ముద్ర బోధనలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి.

'మహాముద్ర' పద్ధతిలోనిదే మాస్టర్ సి.వి.వి. గారి యోగ పద్ధతి, మహాముద్ర ధ్యానంలో ముఖ్యంగా ఆరు అంశాలున్నాయి.

1. Dont' recall...

Let go what has passed

2. Dont' inquire...

Let go what may come

3. Don't think....

Let go what is happening

4. Don't examine...

Don't try to figure anything out

5. Don't control...

Don't try to make anything happen

6. Rest...

Relax right now and Rest


మిలారేపా జీవితం చదవబోతున్నారు. ప్రేమతో చదవండి. సృష్టికి ఆకారమైన మహా చైతన్యం (univerial consciousness) తో అనుసంధానం అయ్యే సాధకులకు, ప్రస్తుతం తాము ఏ స్థితిలో ఉన్నా, సరైన స్థితికి చేర్చి సిద్ధం చేస్తుంది. ఎక్కడో దక్షిణ టిబెట్ లోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడిలో, అందరిలో ఉండే ఆకాంక్షలు, అభినివేశాలు, రాగద్వేషాలు ఉంటాయి సహజంగా. తానేమిటి, తన మూలం ఏమిటి అని అన్వేషించే వారికి ఏదో ఒక పాత్రలో తనను చూసుకోవచ్చు. చదువుతున్నంత సేపు భౌతిక, మానసిక చైతన్యాలను మరచి ఒక విధమైన తన్మయత్వం, తాదాత్మత పొందగలుగుతారు. మన చైతన్యం మిలారేపా చైతన్యంలో ఒదిగిపోతుంది.

తండ్రి మరణానంతరం, ఆస్తి మొత్తం పిన తండ్రి, పిన్నమ్మల స్వాధీనం కాగా వారి ఈసడింపులకు గురై తల్లి, చెల్లి కష్టాలపాలు కాగా తనలోని ఆత్మాభిమానం రెచ్చగొట్టి ప్రతీకారం చేయమని తల్లి పురమాయిస్తుంది. అమ్మకిచ్చిన మాట కోసం, 'క్షుద్రవిద్య' కోసం గురువును అన్వేషిస్తూ ఇల్లు విడిచి, ఊరు విడిచి వెళ్లిపోతాడు.

మంత్ర సాధన సమయంలో మనిషిలోని బలహీనతలు పైకొస్తాయి. ఆ విషయాలన్నీ కథలో కలిసిపోయి ఉంటాయి కనుక పాఠకులకు కొత్త అనిపించవు. వాటిని విశ్లేషించి బయటకు లాగాలి. అస్థిరమైన మనసు ఎవరికైనా బలహీనంగా ఉంటుంది. సంకల్ప బలంతో దానిని ప్రేరేపించి, బలమైన చిత్తంతో సంధాన పరచి, లక్ష్యం సాధించడం మిలారేపా కథలో మొదటి భాగం.

ఆ దుష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూచి, ఆత్మ విచారణ చేసి చైతన్యం పొంది సన్మార్గం లోకి రావడం ఉత్తర కథ, మలినమైన మనస్సుతో, సంకల్ప బలంతో ఏదైనా సాధించగలననే అహంభావంతో పరమ దారుణమైన స్థితిలో ఉన్న మనసుని, స్వస్థితి కి చేర్చి, మరల సాధనకు ఎంత కష్టపడాలో ... ఈ కథ చదివితే తెలుస్తుంది.

జీవితానికి అర్థం తెలియకుండా బ్రతకడమే అసలైన అజ్ఞానం. చైతన్యం లేకపోతే అగాథం లోంచి బయటపడే అవకాశం ఉండదు. ధ్యాన ప్రక్రియతో, సాధన ద్వారా మనలోని చైతన్యాన్ని అనుభూతిస్తూ శరీరానికి, మనస్సుకి పరిమితమైన వ్యక్తిగత చేతనను మహా చైతన్యంతో జతపరచడం యోగ రహస్యం. ధ్యానానికి పరాకాష్ఠ. మనలోని చైతన్యాన్ని గమనికతో నివృతం చేసుకుంటూ' పోవడమే ధ్యాన లక్ష్యం ... లక్షణం. ఈ క్రియకు కొంతవరకు సహాయ పడేది మనసే అయినా, తర్వాతది స్వీయ చైతన్యమే. అది అన్ని విధాల ఆదుకుంటుంది.

మొదటి దశలోనే – అంటే మనసు సహాయం అవసరమైన దశలో భౌతిక (బాహ్య) గురువు సహాయ, సహకారాలు అవసరం. ఈ విషయం మిలారేపా తన గురువు మార్పా కోసం రాతి భవనం నిర్మించిన కాలంలో గమనించవచ్చు. తర్వాత సాధన తీవ్రతరం అయినప్పుడు, అంటే, అంతర్ చైతన్యం పైకొచ్చే స్థితిలో, గురు చైతన్యం తన చైతన్యంతో కలిసిపోయి మహా చైతన్యంగా పరిణమిస్తుంది. కథ చివరన మిలారేపా, అనేక కొండ గుహల్లో (28) సాధన చేస్తూ పొందిన అనుభవాలు ఈ పరిణామాన్ని సూచిస్తాయి.

తర్వాత ఆయనే శిష్యులకు 'నా పద్ధతి అనుసరించండి' అని చెబుతాడు. మొత్తం కధను హృదయపూర్వకంగా, ప్రేమతో చదివితే మన సైకాలజీ మొత్తం అవగాహన అవుతుంది.

'Evolvement of Consciouness' 
అర్థమవుతుంది. సత్యాన్వేషి సాధన ఎలా ఉండాలో మిలారేపా జీవితం నేర్పుతుంది. అటువంటి సాధకుని గురువు ఎలా ఉండాలో 'మార్పా' ప్రవర్తన, ప్రతిభ చెప్పక చెబుతాయి. మార్పాగారి అర్ధాంగిలో 'యోగమాత' దర్శనమిస్తుంది. గురువు ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తుంటే భౌతికమైన అవసరాలు 'గురుపత్ని' తీరుస్తుంది. వారిది చిత్రమైన దాంపత్య యోగం.

మార్పా లామా తన శిష్యుడైన మిలారేపాని తీర్చిదిద్దిన పద్ధతి మొదటి నుండి చిత్రంగా ఉంటుంది. కష్టం అనిపిస్తుంది. సానుభూతి కలిగిస్తుంది. మిలారేపాలో తాను ఆశించిన మార్పు రాని ప్రతిసారీ గురువు పద్ధతి మారుస్తుంటాడు. (అదే "మార్పా' ఏమో!) మిలాని తొలి ఇనిసియేషన్ కి సిద్ధం చేయడం కష్టమైంది. తర్వాత కడదాకా శిష్యుని హృదయంలో తానుండి నడిపించడం సద్గురు లక్షణం. తాను ఎందుకు అంత కష్టపెట్టవలసి వచ్చిందో చివరి వరకు చెప్పడు.

ఆరంభం నుండి గురుదంపతులు మిలారేపాని తమ ఆధ్యాత్మిక పుత్రునిగా ప్రేమిస్తారు. వారిద్దరికీ తెలుసు ఆ కుర్రవాడిని మామూలు పద్ధతుల్లో దిద్దలేమని. అంచేత కష్టమైన పనులు అప్పగించి కర్మ రహితుని చేస్తారు. అసలు శిష్యునిలో పట్టుదల లేకపోతే ఏ గురువు మాత్రం ఏంచేయగలడు? అందుచేత మిలారేపా కథ మన నేటి సాధకులందరికీ మార్గగామి.

మిలారేపా అంతటి దీక్షాదక్షుడైనప్పుడు ఆయన గురువు మార్పా ఎంతటివాడై ఉంటాడు! మార్పా మూడుసార్లు భారతదేశం వచ్చి 18 సంవత్సరాలు గురు శుశ్రూషలు చేసి బౌద్ధధర్మాన్ని వంటపట్టించుకుని, బౌద్ధ వాఙ్మయాన్ని తలదాల్చి టిబెట్ చేరాడు. మార్పా సిద్ధ యోగి మాత్రమే కాదు. గొప్ప వైజ్ఞానికుడు. సంసార పక్షంగా జీవిస్తూ మహాగురువైన మొదటి వ్యక్తి ఆయనేనేమో.

ఒకసారి మిలారేపాను శిష్యులు అడిగారు: "మేము మీలాగా బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాసి కావడమా లేక మీ గురువుగారి లాగా సంసార పక్షంగా ఉంటూ బుద్ధత్వం 'సాధించ గలమా?' అని, మీ గురువులాగా మీరెందుకు పెళ్లి చేసుకోలేదని అడిగారు.

మిలారేపా సమాధానం. "కుందేలు సింహాన్ని అనుసరిస్తే సింహం కాదు". సంసార జీవితంలో నిస్వార్థంగా ఉండడం సాధ్యం కాదు. స్వార్థం, బాంధవ్య బంధాలు లేకుండా జీవించగలిగితే అదే ఉత్తమమైన పద్ధతి..

మార్పాకి తెలుసు మిలారేపా తనను మించిన యోగి అని, ఏ గురువు తన శిష్యుల్ని పూర్తిగా తన మీద ఆధారపడనివ్వడు. మార్గం నిర్దేశిస్తాడు. స్వతంత్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తాడు. సద్గురువు ఒకే పద్ధతి అనుసరించడు. శిష్యుల మానసిక స్థితుల్ని బట్టి వారికి అనుకూలమైన పద్ధతులు నిర్దేశిస్తుంటాడు. మిలారేపా జీవిత కథలో ప్రతి సాధకుడు తనను చూచుకోవచ్చు.


*మిలారేపా బోధన*

"ఆత్మజ్ఞానం ఎవరికి వారు సాధించుకునేదే తప్ప ఒకరు ఇచ్చేది కాదు. పూర్వజన్మల కర్మ శేషాలన్నీ ఒక్క జన్మలోనే రహితం చేసుకుని జన్మ రహితులం కావచ్చు.."

మాస్టర్ మిలారేపా ... సుస్వాగతం!!

*రచయిత....*
🌼

*సశేషం* 
    
    
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment