Sunday, April 28, 2024

ధర్మ భిక్షవు* *మిలారేపా కధ - 2

*ధర్మ భిక్షవు* 
*మిలారేపా కధ - 2* 

☀️

రచన : శ్రీ శార్వరి 
    

*ఉపోద్ఘాతం*

*(ఆత్మ చెప్పిన కథ)*


శాక్యముని గౌతమ బుద్ధుని జీవితానికి ...
టిబెట్ లో అపర బుద్ధుడుగా ప్రసిద్ధుడైన మిలారేపా జీవితానికి పది విధాల పోలికలు ఉన్నాయి.

గౌతమ బుద్ధుడికి ఆత్మీయుడు, ఆనందుడు అనే శిష్యుడు.

మిలారేపాకు ఆత్మీయుడు, ప్రధమ శిష్యుడు రేచుంగ్ పై.

మిలారేపా మరణించిన తర్వాత రేచుంగ్ ప్రార్ధనతో మిలారేపా దివ్య శరీరంతో దర్శనమిస్తాడు.

రేచుంగ్ లో తన దివ్యాత్మను ప్రవేశపెట్టి తన కథను శిష్యుని నోటి ద్వారా చెప్పిస్తాడు. శిష్యులకు దర్శనమిస్తాడు.

ఇది ‘మిలారేపా' ప్రియ శిష్యుడు రేచుంగ్ నోట వినిపించిన కథ. 

గౌతమ బుద్ధుని ప్రియ శిష్యుడు, ప్రాణంలో ప్రాణం ఆనందుడు. బుద్ధుని ప్రవచనాల న్నింటిని ఆనందుడు తన జ్ఞాపకాల్లోంచి వెలికి తీసి వివరిస్తాడు. అది 'లలిత విస్తరం'. గౌతమ బుద్ధుడే స్వయంగా ఈశ్వరునికి, దేవతలకు చెప్పినట్లు ఆనందుడు వివరిస్తాడు.

ఇక్కడ బుద్ధుని స్థానంలో ఉన్నది మిలారేపా.
ఆనందుని పాత్ర పోషించింది రేచుంగ్ పా.


ఎనభైయవ ఏట బుద్ధుడు నిర్యాణం చెందడం చారిత్రకం. ఎనభై నాలుగవ ఏట మిలారేపా నిర్యాణం చెందడం ఐతిహ్యం. నిర్యాణానికి ముందర బుద్ధుడు తన శిష్యులను ఉద్దేశించి తన నిర్యాణానంతరం సమాధి చేసి, ఆ సమాధి పైన ఒక స్థూపం నిర్మించమని, అది భవిష్య కాలంలో బౌద్ధులకు పవిత్ర యాత్రా స్థలం అవుతుందని, సూచిస్తాడు. 

ఆ స్తూపాన్ని దర్శించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పాడు. కారణాంతరాల వల్ల బుద్ధుని అవశేషాలు, అస్థికలను ఎనిమిది భాగాలు చేసి ఎనిమిదిమంది పంచుకున్నారు. చితాభస్మాన్ని ఒక పాత్రలో ఉంచారు. ఆ చితాభస్మాన్ని మరొక బృందం దక్కించుకుంది. 

అలా మొత్తం మీద పది చోట్ల బౌద్ధ స్తూపాల నిర్మాణం జరిగింది. బుద్ధుని నిర్యాణానంతరం శిష్యులకు బౌద్ధం పైన నమ్మకం తగ్గింది. బౌద్ధ ధర్మం పట్ల విశ్వాసం సన్నగిల్లింది.

'భగవాన్ భౌతికంగా లేరు గదా!' మందలించే వారెవరు?

ఆ సందర్భంలో ముఖ్య శిష్యులు ఒక సమారోహం ఏర్పాటు చేశారు. గృధ్ర పర్వతం మీద ఒక గుహలో సమావేశమైనారు. 500 మంది శిష్యులు హాజరైనారు. గౌతమ బుద్ధుని బోధనలన్నీ సమీకరించాలని అక్కడ వారు ప్రతిపాదించారు. అందరికీ అన్నీ తెలియవు గదా! ఏ సమావేశంలో గౌతముడు ఏం బోధించింది అన్నది ప్రశ్న. ఆ పనిని ఆనంద భిక్షువుకు అప్పగించారు. ఆనందుడు బుద్ధుని బంధువు, ఆత్మబంధువు, ఆత్మీయ శిష్యుడు. అన్ని విషయాలు ఆనందునికి చెప్పేవాడు బుద్ధుడు. ఆనందుడు మహామేధావి, ఏకసంధాగ్రాహి. ఒకసారి విన్న విషయాన్ని మరచిపోవడం జరగదు. అక్షరాక్షరం పునరుద్ధరించగలడు. పూసగుచ్చినట్లు చెప్పేవాడు. "నేను విన్నంతవరకు - జ్ఞాపకం ఉన్నంత వరకు---" అంటూ చెప్పేవాడు. అది ఆనాటి సంప్రదాయం.

మిలారేపా విషయంలో రేచుంగ్ అదే సంప్రదాయం అనుసరించాడు. టిబెట్ వారు మిలారేపాను అపర బుద్ధుడుగా ఆరాధిస్తారు. బుద్ధుని మరొక 'జన్మ మిలరేపా' అని వారి విశ్వాసం.

మిలారేపా జీవిత కథను మొట్టమొదట సంపాదించినవాడు సాంగ్లియన్ హె మాకే. ఆయన అదే పద్ధతి అనుసరించాడు. 'నేను విన్నదాన్ని బట్టి' అని ప్రారంభించాడు.

టిబెట్ వారికి అసలు గౌతమ బుద్ధుడు తెలియదు. వారి దృష్టిలో మిలారేపాయే బుద్ధుడు. అక్కడ గృధ్ర పర్వతం లేదు. మిలారేపా సంవత్సరాల తరబడి తపస్సు చేసిన 'గర్భ గుహ' ఉంది. అది వారికి పవిత్ర యాత్రా స్థలం. మిలారేపా శిష్యులు, అభిమానులు అంతా టిబెట్ వారే. భారత దేశం నుండి బుద్ధ ధర్మాన్ని టిబెట్ కి చేర్చిన వాడు మార్పా లామా. బౌద్ధ తంత్రాన్ని టిబెట్ కి పరిచయం చేసినవాడు పద్మసంభవుడు. టిబెట్ బౌద్ధులు పద్మసంభవుని కూడా అపర బుద్ధునిగా ఆరాధిస్తారు. తర్వాతి కాలంలో మిలారేపా టిబెట్ బుద్ధుడిగా వాసికెక్కాడు. 

మిలారేపా 'భారతదేశం రాలేదు. బౌద్ధ ధర్మం అధ్యయనం చేయలేదు. ఆయన గురువు మార్పా తన జీవితకాలంలో మూడుసార్లు భారత్ దర్శించి బౌద్ధ వాఙ్మయాన్ని చక్కగా అనువదించి టిబెట్ తీసుకెళ్లాడు. మిలారేపా మార్పా శిష్యుడే అయినా కూడా స్వతంత్ర యోగి, ఆత్మ సన్యాసి అయినాడు.

మహాయానంలో ఒక ఆచారం ఉంది. నిర్యాణానంతరం బుద్ధుని గురించి చెప్పేటప్పుడు బోధిసత్వునిగా పేర్కొంటూ గత జన్మల కథలు ఏకరవుపెడతారు. మిలారేపా ప్రధాన శిష్యుడు రేచుంగ్ పా ది యదార్ధ సంఘటనలు కాస్త మార్చి వేసే స్వభావం. యదార్ధ సంఘటనలు కలల వంటివి అంటాడు.

ఆయన కలలో స్వర్గం చేరతాడు. అది 'బుద్ధియాన' అనే డాకినీ లోకం. అక్కడ అంతా తాంత్రికమే. వాయవ్య భారతంలో 'బుద్ధియాన' అనే ప్రదేశం ఒకటి ఉంది. అది పద్మసంభవుడి జన్మభూమి. అక్కడ రేచుంగ్ పా 'అక్షోభ్య' అనే గురువు వద్ద తంత్ర సాధన చేస్తాడు. శాక్యముని వలె అక్షోభ్య బౌద్ధ గురువుల కథలు చెబుతుంటాడు. అలా చెప్పిన కథలలో మిలారేపా జీవితకథ ఒకటి.

ఏడవ శతాబ్దం వరకు టిబెట్ దేశానికి బౌద్ధం తెలియదు. అప్పుడైనా జనంలోకి బౌద్ధం వెళ్లింది లేదు. రాజప్రాసాదాలకే పరిమితం. పదవ శతాబ్దంలో ఒక టిబెట్ రాజు ఒక యువకుడిని భారతదేశం పంపాడు ... బౌద్ధ ధర్మం నేర్చుకురమ్మని. పదిహేడు సంవత్సరా ల వయసులో వెళ్లిన ఆ యువకుడు మరో పదిహేడు సంవత్సరాలు భారత్లోనే ఉన్నాడు. తర్వాత ఒక బెంగాలీ సన్యాసి అలీషా 1042 లో టిబెట్ వెళ్లి బౌద్ధం ప్రచారం చేశాడు. ఆ తర్వాత మార్పా మూడుసార్లు భారత్ లో పర్యటించి బౌద్ధ విజ్ఞానం మొత్తం టిబెట్ కి తరలించాడు. మార్పా లామా శిష్యుడే మిలారేపా.

ఏడవ శతాబ్దంలో భారత్ లో పర్యటించిన చైనా యాత్రీకుడు హ్యూన్సోంగ్, ఆరు సంవత్సరాల పాటు భారత్లోనే ఉండి బౌద్ధ సాహిత్యాన్ని, ధర్మాన్ని అధ్యయనం చేశాడు. అందుచేత చైనా బౌద్ధం పై హ్యూన్సోంగ్ ప్రభావం ఉంటుంది. భారత్లోని బౌద్ధానికి - చైనా, టిబెట్ దేశాల బౌద్ధానికి చాలా తేడాలు ఉన్నాయి. మిలారేపా తర్వాతనే టిబెట్లో బౌద్ధం బాగా ప్రచారమైంది. 1042 తర్వాత ముస్లిం దండయాత్రల వల్ల భారతదేశంలోని బౌద్ధారామాలు, బౌద్ధ విద్యాకేంద్రాలు కనుమరుగయ్యాయి. అప్పటి నుండి టిబెట్ బౌద్ధ కేంద్రమైంది. బౌద్ధాన్ని తనలో దాచుకుంది. హీనయాన, మహాయాన, వజ్రయానాలు గౌతమబుద్ధుని బోధనలకు ఉపశాఖలైనాయి.

మిలారేపా గురువు మార్పా, మార్పా గురువు నారోపా. నారోపా సిద్ధయోగి. వారి ప్రమేయం తోనే తంత్రం బౌద్ధంలో ప్రవేశించి 'వజ్రయానం' రూపుదిద్దుకుంది.

అనేక జన్మలలో సంక్రమించిన పాప కర్మలను ఒక్క జన్మలో రద్దు చేసుకోవచ్చన్నది మిలారేపా సిద్ధాంతం. అందుకు తన జీవితాన్నే ఉదాహరణ చేశాడు. క్షుద్ర విద్యలు అభ్యసించాడు. ఘోర పాపాలు చేశాడు. కసితో ప్రతీకార చర్యలకు పాల్పడతాడు. అటు తర్వాత మహా తపస్వి, మహర్షి అయినాడు. మహా మహా సిద్ధులను సంపాదించి సిద్ధ పురుషుడు అని అనిపించుకున్నాడు.
🪷

*సశేషం* 
    
    
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment