మాంస దృష్టి - ఆత్మ దృష్టి
నాయనా ! జనకా ! ఎందుచేతనో ఈ జీవుడు ఆత్మదృష్టిని ఏమరచి మాంస దృష్టిని కొన్ని దేహపరంపరలుగా పెంపొందించుకొన్నమవాడై ఉంటున్నాడు. ఈతడు మోహము చెందుచున్నాడు! ఈ భౌతిక దేహములు ఎటువంటివి ? మాంసముతోను, బొమికలతోను, గ్రంధులతోను, క్రొవ్వు - రక్త - చీములతోను తయారుకాబడిన భౌతికమైన (మెటీరియల్) బొమ్మలే కదా ! అవి కాస్త ప్రక్కన పెడితే ఏ దేహములో ఏమి ప్రత్యేకత ఉన్నది?
తత్ మాంసరక్త భాష్పాంబు పృథక్ కృత్వా విలోచనే, సమాలోకయ ! గమ్యం చేత్ కింముధా పరిముహ్యసి?
ఓ జీవుడా ! చర్మము - మాంసము - రక్తము - కన్నీరు… ఇవన్నీ విడివిడిగా ఒక చోట ఒక వరుసలో పెట్టి పరిశీలించిచూడవయ్యా. వీటన్నిటిలోని ఏ ఒక్కటిలో ఏమి ప్రత్యేకత ! ఏమి రమ్యత ? ఎందుకు నీవు పరిమోహము పొందుచున్నావయ్యా ? భావకవులు “మేరు శిఖరము మీద నుండి తెల్లటి మెరుపులతో కూడి జాలువాడుచున్న సెలయేరువంటి మల్లెపూలచే గ్రుచ్చబడిన పొడవైన జడవలె, గంగాజలము వంటి అధరామృతముతో”… ఇటువంటి వర్ణనలతో ముక్తాహారములతో కూడిన స్త్రీ - పురుష దేహములను వర్ణిస్తూ పాఠకుల భ్రమలను మరింత అధికము చేస్తున్నారు.
ఇటు వంటి వన్నీ మననము చేసుకొంటూ స్త్రీ - పురుష జీవులు ఒకరినొకరు దేహములవైపు చూచుకొనుచూ రస-సముల్లాసము పొందుచున్నారే! “జిలుగు - జిగేల్ వస్త్రములచే, పుష్పహారములచే అలంకరించబడిన భౌతిక దేహముల లోపల రక్త -చీము - మాంస - బొమికల అమరికయే కదా !”… అనేది ఈ జీవుడు గుర్తు పెట్టుకొని ఉండకపోతే ఎట్లా ? అభౌతికము - అప్రమేయము అయి, సర్వమును కదలుటకు కారణముగుచున్న ఆత్మను గుర్తించి దర్శించాలి కదా !
ఓయీ ! అమాయక జీవుడా !
శ్మశానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః శ్వభిరా అస్వాద్యతే కాలే లఘుపిండ ఇవాంధనః !
ఏ ఏ స్త్రీ స్థనములు, పురుషుల భుజస్కంధములు చూచి ఒకరికొకరు స్పృశించి మురిసిపోతూ ఆనందించుచున్నారో, అవన్నీ కూడా “కాలక్రమేణా ఒకానొక రోజు కుక్కల చేత - నక్కల చేత అన్నపు ముద్దలవలె, తమకు ఇవ్వబడగా లభించిన సొంత సొమ్ము వలెను గుటకలు వేస్తూ మ్రింగబడబోవుచున్నాయి కదా !"… అనునది గుర్తు కలిగి ఉండకపోతే ఎట్లా? ఎప్పటికప్పుడు మార్పు చెందుచున్న భౌతిక రూపములు చూచి పిచ్చిగా ఆకర్షితులవటము మానవ జన్మ పొందిన మీకు ఉచితమా? కాదు.
నల్లటి కురులు ధరించి మనస్సులో దుష్టమగు పరస్పర స్పర్శభావన - ఆలోచనలతో కూడుకొని ప్రియురాండ్లు ప్రియుల పట్లా, ప్రియులు ప్రియురాండ్ల పట్లా భౌతిక ధ్యాసలు పెంపొందించుకొని ఫలితంగా మండుటెండలో గడ్డివలె ఈ జీవులు కాలుతూ ఉడికిపోవుచున్నారు.
ఈ భౌతిక దేహములకు సంబంధించిన ధ్యాసలు ఎటువంటివంటే….
- జ్వలితా అతి దూరేఽపి। : మనస్సు ఒక దేహముతో మమకారము - కోపము - కామము దృష్టితో సంబంధము పెట్టుకోవటము వలన తత్ఫలితంగా ఆ దేహము ఎక్కడో దూరాన ఉన్నప్పుడు కూడా … అతని మనస్సును జ్వలింపజేయగలదు. మకిలి నింపగలదు.
- సరసాపి నీరసా : భౌతిక దేహముతో కలిగి ఉన్న సంబంధము పైకి సరసముగా కనిపిస్తూ ఇంతలోనే నీరసముగా పరిణమిస్తోంది.
- స్త్రీ యోహి నరకాగ్నీనామ్ ఇంధనమ్ చారుదాగుణమ్ : ఈ స్త్రీ - పురుషుల పరస్పర దేహాకర్షణ సమాచారములు ’నరకము’ అనే అగ్నిని హృదయములో దారుణముగా ప్రజ్వలించుటకు ఇంధనముగా అగుచున్నాయి. ‘కాముడు’ అనే కిరాతకుడు దృశ్యమునందు ధ్యాసలు గల జీవులు అనే పక్షులను (“నారీ దేహములు - పురుష దేహములు" అనే ఆకారములను) ఎరగ వేసి “అనేక దుర్వాసనలు” రూపముగల త్రాళ్ళతో తయారైన వలలో బంధించి “జన్మపరంపరలు” అనే పంజరములలో కట్టివేసి ఉంచుచున్నాడు.
అన్ని దోషములకు పేటిక వంటిది ఈ నారీ సంబంధింత (దృశ్య సంబంధిత) వ్యవహారమంతా! ఇక్కడ ఏదో పొందాలి - కావాలి- ఏదో చేయాలి. అనునదంతా ఈ జీవునికి దాస్య శృంఖలములుగా పరిణమిస్తున్నాయి. అట్టి బంధములకు అంతూ-పొంతూ ఏముంటుంది?
అందుచేత,
అలమ్ అస్తు మమ స్త్రీయా - ఓ మనసా ! ఈ సంబంధములను, అనుబంధములను ఇక చాలించు. మనము అసలు విషయమునకు వచ్చి పరిశీలిద్దాము” … అని ఈ జీవుడు వివేకి అయి ఆత్మతత్త్వ జ్ఞానము కొరకై అత్యంత త్వరగా నాంది పలకటము ఉచితము.
యస్య స్త్రీ, తస్య బోగేచ్ఛా ! ని స్త్రీ కస్య క్వ భోగభూః? - స్త్రీ (దేహ) ధ్యాస కలిగి ఉంటేనే భోగేచ్ఛ ఉంటుంది ? భోగేచ్ఛ లేనప్పుడు భోగభూములూ ఉండవు. స్త్రీయం త్యక్త్వా జగత్ త్యక్త్వం ! స్త్రీ (సంబంధము)ను త్యజిస్తే జగత్తును త్యజించినట్లే అవుతుంది.
జగత్ త్యక్త్యా సుఖీ భావేత్ ! జగత్తును త్యజించినవాడు ‘సుఖి’ అగుచున్నాడు. (స్త్రీ = సత్వ + రజో + తమో = స + ర + త). ఈ పరస్పర సంబంధములు, భార్య - పుత్ర - కళత్ర - మిత్ర… ఇత్యాది వ్యవహారములు ఈ జీవుని భ్రమింపజేస్తూ ఉన్నాయి. ఈ జీవుడు సత్యము వైపుగా దృష్టి సారించకుండానే రోజులు - జీవితములలను గడిపివేస్తున్నాడు. ఈ సంసారమును నమ్మి ఉండకూడదు
ఎందుకంటే …
- చాలా కాలము వరకు దంపతులకు సంతానము కలుగకపోతే అది వారికి ఎంతో దుఃఖము - నిరుత్సాహము కలుగజేస్తూ ఉంటుంది.
- సంతానము కలుగుతూ ఉంటే… అది ఆ తల్లికి గర్భపాతము సమయములో ప్రసవవేదన.
- సంతానము కలిగినప్పటి నుండి వారి అనారోగ్య బాధల వలన తల్లి తండ్రులకు ఎన్నో ఆదుర్దాలు ! ఉద్వేగాలు ! ముచ్చెమటలు పోస్తూ ఉంటాయి.
- ఆ కుమారుడు అల్లరి - చిల్లరగా తిరుగుతూ ధూర్తుడైతే అది మరింత వేదన !
- ఉపనయనము చేసినా విద్య అబ్బకపోతే మరింత మనఃతాపము.
- ఒకవేళ పండితుడు అయితే కూడా అతనికి వివాహము అవ్వకపోతే … ఇల్లంతా నిరుత్సాహము “ఏమి చెయ్యాలిరా !" అని వేదన.
- అతడు సంపదలు పొంది పరస్త్రీ వ్యామోహముతో దురభ్యాసి అయితే కష్టాలకు అంతు ఉండటము లేదు.
- ఒకవేళ కొడుకు కుటుంబము దారిద్ర్య బాధ అనుభవిస్తూ ఉంటే, అది తల్లిదండ్రులకు మరింత కష్టకాలము.
- కొడుకు పరుషంగా పలికేమాటలకు ఆ తల్లిదండ్రుల మనస్సులు వికలమైపోతూ ఉంటాయి.
ధనీ చేత్ మ్రియతే తదా!
ఒకవేళ, “అన్నీ బాగానే ఉన్నాయి కదా ! సంతానము, సంపద అన్నీ అనుకూలమే”… అని అనుకుంటూ మురిసిపోయేవారికి ఖరా-మృత్యువులు దేహగతియే మార్చివేస్తున్నాయి. ఎవ్వడూ కాలమును నమ్మి ఉండటము కుదరదు. ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా అవుతుందో ఎవ్వరూ ముందుగా తెలుసుకోలేని కాలగతి ఇక్కడ తాండవ మాడుతోంది. కాలమునకు “ఎర” కానిదేది, ఒక్క ఆత్మ తప్ప? |
No comments:
Post a Comment