Saturday, April 20, 2024

నిజమైన స్నేహితుడు

 *నిజమైన స్నేహితుడు* 

పూర్వం ఒక అడివిలో ఒక కుక్క ఉండేది. అది ఒంటరిగా ఉండడం వల్ల ఎవరైనా స్నేహితుడు దొరికితే బాగుండును అనుకొన్నది. స్నేహితుడి కోసం అడివి అంతా తిరగ్గా తిరగ్గా చివరకు దానికో కుందేలు తారసపడింది.

అప్పుడు కుక్క ఆడిగింది - "కుందేలా మనం ఇద్దరం స్నేహితులుగా ఉంటే బాగుండుననిపి స్తోంది. మరి నీ ఉద్దేశం ఏమిటి?” అంది.

"సరే మంచిదే!" అని కుందేలు జవాబు చెప్పింది.

కుక్క, కుందేలు అడివిలో ఒక మంచి చోటు చూసుకుని రాత్రికి అక్కడే పడుకొన్నాయి. కుందేలేమో నిద్రపోయిందిగాని కుక్కకు మాత్రం నిద్రే రాలేదు. దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మ గాలికి 'టపాటపా' కొట్టుకుంటోంది. ఆ శబ్దానికి కుక్క ఒకటే మొరగడం మొదలు పెట్టింది. కుందేలుకు నిద్ర పాడైపోయింది. దాంతో అది కుక్క మీదకు విరుచుకుపడింది.

"కుక్కా, ఎందుకు అదే పనిగా మొరుగుతు న్నావు? ఎవరైనా శత్రువుల్ని పసిగట్టావా?నీవిలా మొరుగుతూ ఉంటే ఏదైనా తోడేలు మన ఉనికి తెలిసికొని మన ఇద్దరినీ తినేస్తుంది జాగ్రత్త!" అని హెచ్చరించింది కుందేలు. కుక్క ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయి మనసులో అనుకుంది.

'అయ్యో, ఈ అల్పజీవిని స్నేహితుడిగా ఎన్నుకున్నానే. నా తెలివిమండా, ఈ కుందేలు వట్టి పిరికిది. అదే తోడేలు ఐతేనో. ఎవరికీ భయపడనే భయపడదు."

మర్నాడు కుక్క కుందేలు స్నేహం వదిలేసి తోడేలు కోసం అడివి అంతా వెదుక్కుంటూ పోయింది. వెతగ్గా వెతగ్గా ఎలాగైతేనేమి ఒక తోడేలు దొరికింది.

కుక్క అసలు సంగతి చెప్పింది.

“తోడేలు బావా! నాదో చిన్న మనవి. మనం ఇద్దరం స్నేహితులుగా ఉంటే బాగుంటుందను కొంటున్నాను. మరి నీకు ఇష్టమైతే....” సందేహంగా నసిగింది కుక్క.

“ఓ, ఇష్టమా అని అడగడమెందుకు? ఇద్దరం కలిసి ఉంటే ఎంత బావుంటుందో వేరే చెప్పాలా” అని తన ఇష్టాన్ని ప్రకటించింది తోడేలు బావ.

రాత్రి అయింది. కుక్క, తోడేలు నిద్రపోయాయి. అర్థరాత్రి కుక్కకేదో చప్పుడు వినపడింది. కుక్క మొరగడం ప్రారంభించింది. తోడేలుకు ఎక్కడ లేని భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకోవడంతో కుక్కను కసురుకుంది.

అస్తమాను ఏమిటా మొరగడం, మనం ఇక్కడ ఉన్నట్టు ఎలుగ్గొడ్డుకు తెలిసిందంటే, క్షణంలో మన ఇద్దరి పని స్వాహా అంతే!” అని తోడేలు చివాట్లు పెట్టింది కుక్కను.

కుక్క అనుకొందప్పుడు 'తోడేలుకు ధైర్యం ఎక్కువ అనుకొన్నా గాని దీనికీ భయమే. ఆ ఎలుగ్గొడే నయం. దానికి ధైర్యం ఎక్కువ.'

తెల్లవారగానే కుక్క తోడేలుతో స్నేహం తెగ తెంపులు చేసుకొంది. అడివంతా తిరిగి తిరిగి చివరకు ఒక ఏలుగ్గొడ్డును కనుక్కొంది. ఎలుగ్గొడ్డును చూడగానే కుక్క చిన్నగా నవ్వి-

"బలశాలీ. ఎలుగ్గొడ్డు మామా! మనం ఇద్దరు స్నేహితులుగా ఉందామా మరి?" కుక్క అడిగింది తోక ఆడిస్తూ.

“ఓస్ ఇంతేనా. దానికేం? ఈ క్షణం నుండే మనం ఇద్దరం మంచి స్నేహితులం" చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసింది ఎలుగ్గొడ్డు.

ఆడుతూ పాడుతూ పగలంతా తిరిగి బాగా అలిసిపోయాయి కుక్క, ఎలుగ్గొడ్డూ.

ఇంతలో రాత్రి అయింది. రెండూ గాఢనిద్రలోకి జారుకొన్నాయి. సరిగ్గా అర్థరాత్రి అయిందో లేదో టక్కున లేచి కూర్చొంది కుక్క. గట్టిగా మొరగడం మొదలెట్టింది. కొంపమునిగి ఏం ప్రమాదం వచ్చి పడిందోనని భయంతో ఎలుగ్గొడ్డు లేచి కూర్చుని విసుగ్గా కుక్కను తిట్టింది.

“కుక్కా, ఎందుకా మొరుగుడు? ఊరికే ఉండలేవా? మనం ఇక్కడ ఉన్నట్టు ఎవడైనా మనిషి పసిగట్టాడంటే ఇద్దరినీ తప్పక చంపుతాడు తెలుసా?" అన్నది.

కుక్క బాగా తిట్లు తిన్నది. మనసులో ఇలా అనుకొంది. "అయ్యోరామ, ఇదీ పిరికిదే. ఈ పిరికిదానితో స్నేహం కన్నా మనిషితో స్నేహం చేస్తేనే మంచిది.”

ఆ రాత్రి ఎలాగో గడిపేసి తెల్లవారిన తర్వాత ప్రయాణానికి సిద్ధమైంది కుక్క. ఎలుగ్గొడ్డుకు రాత్రి నిద్ర సరిపోలేదు గనుక ఇంకా గుర్రుపెట్టి నిద్రపోతోంది. అదే మంచి సమయమను కొంది కుక్క.

అక్కడ నుండి దూరంగా ఒక్క పరుగుతీసింది. అడివిలో అడ్డుపడి ఆ మూల ఈమూలా గాలించింది మనిషి ఎక్కడయినా తారస పడతాడేమోనవి. తిరిగి తిరిగి అలిసిపోయిన కుక్క ఒక చెట్టు నీడలో రవ్వంతసేపు విశ్రమిం చింది. అనుకోకుండా అక్కడే కొద్ది దూరంలో కనిపించాడు ఓ మనిషి కట్టెలు కొట్టుకుంటూ, కుక్కకు చెప్పలేనంత సంతోషం కలిగింది.

ఒక్క గెంతులో అతడి దగ్గరకు పరిగెత్తి
అడిగింది.

"ఏమయ్యా మనిషీ, మనం ఇద్దరం స్నేహంగా ఉంటే బావుండదూ..!”

"సరే మంచిది, నాకేం అభ్యంతరం లేదు" అని కుక్కను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అతడు. రాత్రి తనతో పాటు కుక్కకు తృప్తిగా అన్నం పెట్టి గొలుసుతో దాన్ని తన మంచానికి కట్టబెట్టాడు. అతడు మంచం మీద నిద్ర పోయాడు.

అర్థరాత్రి కాగానే ఎప్పటిలాగే కుక్క మొరగడం ప్రారంభించింది. దాని అరుపులకు మంచం మీదున్న మనిషి లేచి కూర్చున్నాడు. నిద్ర పాడయిందనే కోపంతో కుక్కను కసిరాడు.

కసిరి ఇలా అడిగాడు. "ఏమే ఎందుకలా మొరుగుతూ కూర్చొని నా నిద్రని మొత్తం పాడుచేస్తావు ? నువు కూడా కాస్త నిద్ర  పోరాదూ?”

సమాధానంగా కుక్క “స్వామీ! శత్రువుల నుండి మనకేదయినా ప్రమాదం వస్తుందని అనుమానం కలిగినప్పుడు నేను ముందుగానే మొరుగుతాను. అది నా నైజగుణం. ఇప్పుడే ఒక క్షణం క్రితం మన ఇల్లు దోచుకోడానికి ఒక దొంగ వచ్చాడు. ప్రమాదం నుండి మిమ్మల్ని హెచ్చరించాలనే నేను మొరిగాను. నేను మొరగడం వల్లనే దొంగ భయపడి ఠక్కున పారిపోయాడు. నన్ను మంచానికి కట్టకుండా ఉన్నట్టయితే దొంగ మీదకు ఎగిరి వాడి కాలుని నా వాడి పళ్ళతో పట్టుకొనేదాన్ని. మేలు చేసిన మీకు విశ్వాసంగా ఉండకపోతే ఎలా, అది నిజమైన స్నేహం ఎలా అవుతుంది ?" అని వినయంగా పలికింది కుక్క.

అతడు ఆనందపరవశుడై కుక్కకు కట్టిన గొలుసు తీనేసి, కుక్క తలను మృదువుగా నిమిరాడు. దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కుక్కకూ మనిషికీ నిజమైన.. విలువైన స్నేహం అలా సాగుతూనే ఉంది !

*సమాప్తం*

No comments:

Post a Comment