Saturday, April 13, 2024

విధివ్రాత: చిన్న కథ రచన : సుధావిశ్వం

 విధివ్రాత:  చిన్న కథ

రచన : సుధావిశ్వం

విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ...

        ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది .

            అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో, విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు.   ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి, అందరూ కూర్చుంటారు. అలా కూర్చున్న వారు  బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు. 

      అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన ఆ దొంగ ఆ స్త్రీ కి దగ్గరగా వెళ్లి ...
        "ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చంపుతున్నావు అందరినీ?" అని అడుగుతాడు.
    ఆవిడ "నేను మృత్యువును. 
ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో,  ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం. అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను" అని వివరిస్తుంది.

          అది విన్న దొంగకు తన మరణం ఎలా, ఎప్పుడో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది.
  " అయితే నేను ఎప్పుడు, ఎలా మరణిస్తానో చెప్పమ్మా" అని వేడుకుంటాడు
      
       "నన్ను ఎవ్వరూ చూడలేరు.ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు. కాని అలా చెప్పడం కుదరదు" అన్న మృత్యువుతో

     "ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా" అని ప్రాధేయపడతాడు.

         "సరే! ఇంతగా ప్రాధేయ పడుతున్నావు కనుక చెబుతాను.  నీకు ఇంకా సమయం ఉంది. ఆ లోపు మంచి పనులు చేసి బ్రతుకుతూ నీ
 జన్మ సార్ధకం చేసుకో. ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు" అని హితవు పలికి,  

           సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం , ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెబుతుంది. 

         అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకుని తన ప్రాంతానికి బయలుదేరుతాడు.

                అప్పట్నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ, అందరికి సాయపడుతూ జీవిస్తుంటాడు.  

        నేను దొంగగా ఉంటే రాజ భటులకు దొరికి రాజదండనకు గురి కావొచ్చు కదా!  ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను  మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు.

 కానీ...

       అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్థుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి,  తీస్కెళ్ళి రాజు ముందు  నిలబెడతారు.
  " నేను ఏ దొంగతనం చేయలేదు. నేను మంచిగా మారాను మహారాజా! మంచి జీవితం గడుపుతున్నాను" అంటాడు. కానీ..
        ఆ రాజుగారు  వినకుండా,
   "ఇంతకుముందు చేసేవాడివే కదా! ఇప్పుడు మారావని నమ్మకం లేదు" అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. 

     మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు....

        " నన్ను ఇంకేరకంగా అయినా చంపండి. కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు.  ఇది నా చివరి కోరిక. చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా" అని అంటాడు.
 
      "అలా రాజాజ్ఞ ధిక్కరించలేము. రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము" అంటారు వాళ్ళు.  

         దొంగ ఎంతో బ్రతిమిలాడిన తరువాత...

                   "కానీ చివరి కోరికగా అడుగుతున్నావు. కనుక ఒక పని చేస్తాం.కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి, ఆ తర్వాత నీ ఇష్టమైనట్టు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్టు అవ్వదు, నీ చివరి కోరికా తీర్చినట్టు అవుతుంది. ఏమంటావ్" అంటారు. 

         సరే బొమ్మే కదా అనుకుంటాడు.
అందుకని ఒప్పుకుంటాడు దొంగ.

       కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగుగా మారి తొక్కి, ఆ దొంగను చంపేస్తుంది. అలా  విధి నిర్ణయించినట్లుగా, నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు

         అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు.  అలాగని మొండిగా ఇష్టంవచ్చినట్టుగా చేయకూడదు.

      మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో, పరోపకారబుద్ధి తో, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మ ను సార్ధక్యము చేసుకోవాలి...

చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్న కథ

No comments:

Post a Comment