వర్తమాన ప్రతిబింబాలు
-మందరపు హైమవతి
(ఆలీబాబా అనేక దొంగలు కథా సంపుటి పై ప్రజాశక్తి దినపత్రిక లో..)
మనలో చాలా మందిమి మన జీవితాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిందగ్గర నిం రాత్రి పడుకునేవరకూ రాజకీయాలు మన జీవితాలలో చాపకింద నీరులాగా చేరి అల్లకల్లోల పరుస్తున్నాయని ఎప్పటికో తెలుసుకుంటాము. అలా తెలియపరనచిన కథలే దేశరాజు ‘ఆలీబాబా అనేక దొంగలు’ సంపుటిలోని కథలు.
ఇంద్రధనస్సులో ఏడు రంగులుంటాయి. కానీ, మన దేశంలో ఇటీవల ఆ రంగులన్నీ కనిపించడం మానేసాయి. కేవలం కాషాయ వర్ణమే ఆకాశమంతా అలముకొని భయపెట్టేస్తోంది. దేశభక్తి, గో భక్తి ఎక్కువైపోయాయి. ‘ఒకే దేశం ఒకే మతం’ నినాదాలు ఎక్కువై పోయాయి. ’లౌకిక దేశం’ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. కేవలం ఒక మతంలో పుట్టినందుకు కొందరిపై దేశద్రోహుల ముద్ర వేసారు. వాళ్ల ఆహారంపై, వేషభాషలపై సోక్యాలు ఎక్కువయ్యాయి. సోదరుల్లా కలిసిమెలిసి వున్నవాళ్లే ఈ దుష్ట రాజకీయాల వల్ల బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు. అకారణ విద్వేషం మనుషుల మధ్య ప్రజ్వరిల్లుతోంది. వీటన్నిటినీ కళ్ల ముందు నిలుపుతుంది ‘ఆలీబాబా అనేక దొంగలు’ కథ. సంపుటిలోని కథలన్నిటికన్నా పెద్ద కథ అయినా, ఎక్కడా విసుగనిపించదు. వర్తమాన రాజకీయాలను వ్యంగ్యంగా ఆవిష్కరించిన కథ ఇది. ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో కదా అనే ఆవేదన కలిగిస్తుంది.
మనిషి ఇప్పుడు కరెన్సీకి దాసుడయ్యాడు. ప్రతి ఒక్కరూ రూపాయి వస్తుందంటే ఏం చెయ్యడానికైనా సిద్ధపడిపోతున్నారు. భార్యాభర్తల మధ్య, తండ్రి పిల్లల మధ్య ప్రేమలు లేవు, అనురాగాలు లేవు. వృధాప్య పింఛను వచ్చిన రోజే అత్తగారిని కోడలు మనిషిగా చూస్తుంది. ఇలాంటి డబ్బు వాసన కొట్టే ప్రపంచంలోనూ తాత్కాలికంగానైనా నిజమైన మనుషుల్లా ప్రవర్తించేవారు వుంటారని ‘కాసేపు మనిషి’లో నిరూపిస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఆకలి తీర్చిన ముసలావిడ ఔదార్యం ఓ సంపన్నుడిలోని మానవత్వాన్ని మేల్కొలుపుతుంది.
చదువు ఆత్మవిశ్వాస దీపం వెలిగించి, నలుగురికీ ధైర్యం చెప్పేలా వుండాలి. కానీ, కార్పొరేట్ విద్యాలయ్యాల్లో చదువును కొనుక్కుంటున్న వ్యాపార కాలంలో ఫలితాలు వెలువడిన సందర్భాల్లో పసివాళ్ల ఆత్మహత్య వార్తలు వింటూనే వుంటాం. వీళ్లతోపాటు స్కూల్లో మాస్టారు తిట్టారనో, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారనో ఉసురు తీసుకునే పిల్లలూ ఉన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన అపార్ట్ మెంట్ వాసులందరినీ కలచివేయడం ‘కుదుపు’ కథ. ఆ విషాద వృత్తాంతం పెద్దల్లోనూ, పిల్లల్లోనూ కూడా మార్పు తీసుకు వస్తుంది. సెల్ ఫోన్కు బానిసలైనవారు ఆ అలవాటు నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఏదైనా మార్ప రావాలంటే కుదుపు తప్పదని ఈ కథ వివరిస్తుంది. ఈ సంపుటిలో ‘అవాంఛితం’ ఓ మంచి కథ. పురుషాధిక్య సమాజంలో స్త్రీల చిన్నచిన్న కోరికలు నెరవేరకుండా వుండిపోతుంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు వుండే మన దేశంలో ఇందులోని కధానాయకికి ఒకటే కోరిక-ఒళ్లంతా చల్లబడేలా తనొక్కత్తే ఏసీ గదిలో వుండాలని. సాధారణంగా ఇంట్లో ఒక్క ఏసీ గది మాత్రమే ఉంటుంది. ఆ గదిలో భర్త మాత్రమే స్వేచ్ఛగా, హాయిగా వుంటాడు. ఆమెకి కూడా అటువంటి గది ఒకటి అవసరమని భావించడు. ఆడవారికి ఇటువంటి కోరికలు ఉంటాయా? అదీ ఒక కోరికేనా? అని ఆమె కూడా సంకోచిస్తుంది. చివరకు భర్త మరణించిన సందర్భంలో ఆ కోరిక నెరవేరడం కథలో కొసమెరుపు. సున్నితమైన విషయాన్ని ఎక్కడా హద్దు మీరకుండా, అసభ్యతకు తావు లేకుండా చిత్రీకరించారు.
మరో కథ ‘తల్లీ, కూతురు –మధ్యలో ఆమె’ మూడు తరాలకు చెందిన స్త్రీల కథ. ఒకప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషి అయితే, అప్పుడెలా వుండాలో రహస్యంగా చెప్పేవారు. ఇప్పుడు అవేమీ లేదు. ఒక తల్లి తన కూతురికి విషయంలో జాగ్రత్తలు చెప్తుంటే ‘‘ఆడుకుంటున్నప్పుడు దెబ్బల తగలవా? అప్పుడు బ్లడ్ రాదా? ఇప్పుడెందుకు ఓవర్ చేస్తున్నావ్’’ అని అడుగుతుంది. తల్లికి తన తరంలో గుసగుసగా చెప్పుకున్నది ఇప్పుడు బట్టబయలుగా చెప్పుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికే సిగ్గు పడితే, ఇప్పటి తరం అటువంటి సంకోచాలు లేకుండా ధైర్యంగా దూసుకుపోవడాన్ని ఈ కథలో చూడొచ్చు. తరాల అంతరాలలో, ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు అద్దంపడుతుంది ఈ కథ.
ఒక పెళ్లికొడుక్కి పల్లెటూరు అంటే ఇష్టం. అక్కడి అందాలు, అక్కడ అమ్మాయిల అమాయకత్వం అతనికిష్టం. పల్లెటూరి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబడతాడు. చివరకు పెళ్లికొడుకు తల్లి నాటకమాడి కొడుకు పెళ్లి చేస్తుంది. చివరకు బాగా చదువుకున్న పట్నం అమ్మాయే పెళ్లి కూతురనే విషయం బయటపడటమే ’అంతా మీ కోసం’ కథ. సృష్టిలో అనేక కోట్ల ప్రాణులున్నాయి. కానీ, అన్నిటిపై మానవుడు పెత్తనం చేస్తాడు. ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మనిషి ఆయా ప్రాణుల ఆవాసాల్లోకి చొరబడటంతో అవి మనుషులపై దాడి చేస్తున్నాయి. కొన్ని ఊళ్లలో పొలాలపై ఏనుగుల దాడి, పంటలపై కోతుల దాడి అని వార్తలు చదువుతూ వుంటాము. అపార్ట్ మెంట్లో పావురాలు చొచ్చుకు రావడం వలన కలిగిన ఇబ్బందులను ‘సహజాసహజం’ కథలో చూడవచ్చు. పావురాలు వస్తుండటంతో అవి రాకుండా నెట్లు కడతారు. దాంతో వాటితో వుండే సాన్నిహిత్యం మాయమైపోతుందని దిగులు పడతారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చెయ్యాలని ప్రయత్నిస్తున్న చైనాలోని ఉగ్రవాదుల ప్రయత్నాన్ని మన దేశంలోని బిగ్ క్యాట్ తిప్పికొట్టడమే ఎయిర్ జామ్ కథ. ఈ కథ ఒకప్పటి షాడో కథలను గుర్తుకు తెస్తుంది. మనసు యవ్వనంలో వుంటే సరిపోదు, శరీరానికి వయసు వస్తుంది. వృద్ధాప్యం వస్తుంది. ఆ వయసుకి తగినట్లే ఎవరైనా ప్రవర్తించాలని చెప్తుంది ‘చిలుక’ కథ.
మధ్యతరగతి వర్గం వారు కూడా శ్రామిక వర్గాన్ని దోచుకోవడం గురించి కనుకలకు కడుతుంది ‘రిక్షావోడు’ కథ. ఈ కథ చదువుతుంటే త్రిపురనేని గోపీచంద్ రాసిన ‘రిక్షావాడు’ కథ గుర్తుకు వస్తుంది. ఈ బరువైన కథలన్నిటితోపాటు ఈ సంపుటిలో ‘కవి దుర్బేధ్య’ అనే హాస్య కథ కూడా ఉంది. సాహిత్యంలోని ప్రక్రియలన్నిటిలో కవితా ప్రక్రియ విశిష్టమైనది. కానీ, కొంతమంది కవులు తమ నాసిరకమైన కవితలతో కవిత్వం అనే పదానికే అర్థం మార్చేస్తున్నారు. శతాధిక కవిసమ్మేళనాలు, సహస్ర కవిసమ్మేళనాలు వచ్చి కవుల పరువు తీస్తున్నాయి. ‘బస్సులో వస్తూ రాసాను, రైల్లో ప్రయాణం చేస్తూ రాసాను’ అని అంటారు చాలామంది. కవిత్వం రాయడమంటే చూచికాపీ రాయడం కాదు. ప్రతిభ వుండాలి, నిరంతర సాధన వుండాలి. అప్పుడు కవికీ, కవిత్వానికీ గుర్తింపు వస్తుంది. ఈ కథలో ఒక ఉద్యోగి రిటైర్ అయ్యాక కవిత్వం రాయడం మొదలు పెడతాడు. వాట్సప్ గ్రూపులలో పంపించి, పేరు పొందుతాడు. సన్మానాలు చేస్తారు. బిరుదులు పొందుతాడు. అలా ఒక కవి దుర్బేధ్యగా ఎదిగిపోతాడు.
ఈ సంపుటిలోని కథలన్నీ వర్తమాన జీవితాన్ని నిశితంగా పరిశీలించి రాసినవే. ఈ కథల్లోని పాత్రలు మన ఇరుగు పొరుగువారే కాదు, మనం కూడా. ప్రజలను పట్టించుకోకుండా, వారి మధ్య మత విద్వేషాలు రగుల్కొలిపే రాజకీయ నాయకుల దుష్టత్వం, పర్యావరణ విధ్వంసానికి మానవుడు ఎలా కారకుడవుతున్నాడు, విద్యావ్యవస్థలోని లోపాలను, మరుగున పడిన మానవత్వం గురించి చెప్పిన ఈ కథలన్నీ పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
(ఆలీబాబా అనేక దొంగలు –దేశరాజు, వెల: రూ. 200/-, పుటలు: 120, ప్రతులకు: 9948680009)
No comments:
Post a Comment