Tuesday, April 16, 2024

✨ఆలోచనలే మన జీవితం

 *✨ఆలోచనలే మన జీవితం* 
   🕉️🌞🌎🏵️🌼🚩

 *మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది. మన ఆలోచ నల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. మనకు విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని తీర్చిదిద్దుకోగల స్వేచ్ఛ మనకు ఉంది. ఆలోచనలు లేని మనిషంటూ ఉండడు.* 

 *టీవీకి రిమోటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఛానల్ మార్చాలంటే రిమోట్ ఉపయోగిస్తాం. అంటే, మనం మార్చిన ఛానల్ మనకు కావాల్సిన ప్రోగ్రాం ఇస్తుంది. అలాగే మనిషి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విషయం, మరొక ఆలో చనకు మారినప్పుడు మరొక విషయం మెదులుతాయి. వ్యతిరేక, ప్రతికూల భావనలను ఛానల్ మార్చినట్టుగా మార్చి అనుకూల భావనల ఛానల్ ప్రసారాలు చూడాలంటే మనసు అనే రిమోట్ను మనం ఉపయోగించాలి.* 

 *మనకు అక్కర లేని అంశాలు, భయం కలిగించే విషయాల మీద, బాధ కలిగించే వాటి పైన ఆలోచన లను కేంద్రీకరించడం మాని, కావాల్సిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది. అందుకే ఆలోచ నల పై జీవితం ఆధారపడి ఉంది. ఎక్కువ కాలం వ్యతిరేక ఆలోచనలు చేస్తుంటే మనసు మరింతగా ఆందోళనకు గురవు తుంది. మంచి ఆలోచనలు భావన చేస్తే అవి ఎక్కువ శక్తినిస్తాయి.* 

 *మనలోని మంచి ఆలోచనలు శక్తిగా మారి సాకారం కాకపోతే, ఆశించినవి జరగక పోతే అదీ మంచికే అని అనుకోవాలి. మన ఆలోచన లను పునఃపరిశీలన చేసు కొని లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. జీవితాన్ని సృష్టించుకోగల శక్తి ఈ 'క్షణానికి' మాత్రమే ఉంది. యద్భావం తద్భవతి. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను మనం అదుపు చేయలేం. రోజుకు దాదాపు అరవై వేల ఆలోచనలు మనసులోకి వస్తాయన్నది పరిశోధకుల మాట.* 

 *మనకు బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనలో ప్రతికూల భావనలను దూరం చేసుకోవాలి. లేకుంటే, మరింత వేదన తప్పదు. పదేపదే ప్రతికూల భావనల గురించి ఆలోచించడమంటే- నేను మరింత బాధపడే పరిస్థితి తీసుకురా అని మన మనసుకు స్వయంగా చెప్పడమే! నచ్చని ఛానల్ మార్చినట్లే, దుఃఖ భావనల ఛానల్ మార్చుకోవాలి. మనసు రిమోట్కు అలా శిక్షణ ఇవ్వాలి. మనసుకు అటువంటి శిక్షణ ఇవ్వాలంటే ధ్యానం, క్రమశిక్షణాయుత జీవనం, నిర్మలమైన భావనలు అవసరం. ధ్యానం మనిషి అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మానసిక బలం పెంచుతుంది. మనల్ని మనం కొత్త రూపంలోకి మార్చుకునేందుకు అవసరమైన జ్ఞానం అందిస్తుంది.* 

 *'నా ఆలోచనలపై నాదే అధికారం' అని మనం తరచూ అనుకోవాలి. మన ఆలోచనల మంచి చెడులకు పూర్తి బాధ్యులం మనమేనని నిత్యం భావించాలి. అసలు ముందుగా మనం ఏం చేయాలో, ఏం కావాలో నిశ్చయించుకోవాలి. దాని ప్రకారమే పనిచేయాలి. అప్పుడు ఆలోచనలే మన జీవితంగా రూపుదాలుస్తాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, మన దృష్టిని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తామో... అదే మన జీవితం!* 

 *🎣సేకరణ* 

🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment