🔔 *అనగనగా...* 🔔
కాశ్మీర రాజ్యంలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ విద్యానందస్వామి అనే గురువు తన శిష్యులతో వుండేవాడు.
ఒక రోజు విద్యానందస్వామి తన శిష్యులంద రినీ తన దగ్గరకు పిలిచి, "వచ్చేవారంలో వస్తున్న నా పుట్టిన రోజును జరుపుకోవాలను కుంటున్నాను. కానీ నా పుట్టిన రోజును జరుపుకోడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు” అన్నాడు.
ఇది విన్న కొంతమంది శిష్యులు "గురువర్యా, మేము మా తల్లిదండ్రులను డబ్బు అడిగి తెస్తాము, మీరు పుట్టిన రోజును జరుపుకోండి!" అని అన్నారు.
కానీ అందుకు విద్యానందస్వామి సమ్మతించ క, "మిమ్మల్ని డబ్బు అడిగితే నేను పిసినారిని అవడంచేత మిమ్మల్ని డబ్బు అడుగుతున్నా ను అని మీ తల్లిదండ్రులు అనుకుంటారు. వారు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు!" అని అన్నాడు విద్యానందస్వామి తన శిష్యులతో.
గురువుగారు చెప్పింది విన్న శిష్యులు మౌనంగా వుండిపోయారు. కొంతసేపైన తర్వాత విద్యానందస్వామి ఆలోచించి, తన శిష్యులతో "మీరందరూ డబ్బు తీసుకురండి. కానీ మీ తల్లిదండ్రులను అడిగి తీసుకుని రాకండి, ఎవరికీ తెలీకుండా దొంగతనంగా తీసుకురండి!" అని చెప్పాడు.
గురువుగారు చెప్పినట్లు శిష్యులందరూ తాము దొంగిలించి తెచ్చిన డబ్బును గురువు గారికి సమర్పించసాగారు. ఆ డబ్బును గురువు గారు స్వీకరించారు.
కానీ, విద్యానందస్వామికి ఒకే ఒక శిష్యుడు తన తండ్రి ధనవంతుడైనను వట్టి చేతులతో రావడం కనిపించింది.
విద్యానందస్వామి ఆ శిష్యుడిని దగ్గరికి పిలిచి కోపంతో "నువ్వు నీ గురువుగారికి డబ్బు తేలేదా?" అని అడిగాడు.
తేలేదని తల ఊపాడు- ఆ శిష్యుడు మౌనంగా.
విద్యానందస్వామి ఆ శిష్యుని మీద కోపంతో "గురువు మాటను కూడా నువ్వు వినలేదన్న మాట!" అని అన్నాడు.
"లేదు గురువర్యా, మీరు చెప్పినట్లు నేను మీకు డబ్బును తెచ్చివ్వలేకపోయినందుకు నన్ను క్షమించండి, 'మరలా, తమరు నన్ను దొంగిలించమని చెప్పరని అనుకుంటున్నాను! మీరే నాకు ఎన్నోసార్లు "దొంగలించరాదు, దొంగతనం చేయడం పాపం" అని చెప్పారు. చివరికి మీరే దొంగలించమని చెప్పి పంపడం అన్యాయం కాదా? అందుకు నా మనసు
అంగీకరించలేదు, మీ పుట్టిన రోజుకు, మా తలిదండ్రులను అడిగి తీసుకుమ్మని చెప్పి వుంటే, గౌరవ మర్యాదలతో విలువైన కానుకలు తెచ్చి సమర్పించుకొనేవాడ్ని" అంటూ విద్యానంద స్వామి కాళ్ల మీద పడ్డాడు ఆ శిష్యుడు.
శిష్యుడు చెప్పింది విన్న విద్యానందస్వామి తన శిష్యుడిని లేవనెత్తి కౌగిలించుకుని, “నువ్వే నా నిజమైన శిష్యుడివి. నేను చెప్పినా నువ్వు పాప మార్గాన్ని అనుసరించలేదు” అని అక్కడ వున్న ఆ శిష్యుల వంక చూసి,
“శిష్యులారా! నా నిజమైన శిష్యుడ్ని ఎన్నుకోడానికే, నా పుట్టిన రోజని మీకు అబద్దం చెప్పాను. అంతేకానీ, నాకు డబ్బుతో అవసరం లేనేలేదు. మీరు తెచ్చిన డబ్బును మీరు తీసుకుపోండి. నాకు నిజమైన శిష్యుడిని ఎన్నుకోవాలని వుంది. ఇప్పుడు నాకు నిజమైన శిష్యుడు దొరికిపోయాడు!" అని విద్యానందస్వామి చెప్పడంతో, అక్కడ వున్న శిష్యులందరూ సిగ్గుతో తలలు దించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment