*నమ్మకం కోల్పోకు - ఈ ఆదివారం వెలుగు పత్రికలో వచ్చిన బాలల కథ - డా.ఎం.హరికిషన్*-9441032212
**************************
ఒక ఊరిలో పదో తరగతి చదివే ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. బడి ఒక్కరోజు కూడా ఎగ్గొట్టకుండా పాఠాలు వినేవాడు. చక్కగా ఇంటి వద్ద చదువుకునేవాడు. పరీక్షలు దగ్గర పడ్డాయి. వాళ్ల ఉపాధ్యాయుడు అందరినీ ఫీజు తెమ్మన్నాడు. ఆ పిల్లోడు వాళ్ళ నాయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు. భద్రంగా నిక్కరు జేబులో పెట్టుకున్నాడు. బడికి వెళ్లి ఫీజు కడదామని చూస్తే ఆరోజు ఫీజు వసూలు చేసే ఉపాధ్యాయుడు రాలేదు. దాంతో తర్వాతరోజు ఇద్దాంలే అనుకున్నాడు. ఇక ఆ డబ్బుల సంగతి మరిచిపోయాడు. అందరితోపాటు బాగా ఆటలు ఆడాడు. ఎగిరాడు. దుంకాడు.
తర్వాతరోజు ఫీజు కడదామని జేబులో చేయి పెడితే ఇంకేముంది డబ్బులు లేవు. బడంతా వెతికాడు. కనబడిన వాళ్లందరినీ అడిగాడు. కానీ ఎవరు చూసినా నాకు తెలియదంటే నాకు తెలియదన్నారు గానీ దొరికిందని గానీ చూసినామనీ గాని చెప్పలేదు. దాంతో ఆ పిల్లోడు భయంతో వణికిపోయాడు. పది కాదు ఇరవై కాదు. రెండువందల రూపాయలు. కట్టకపోతే పరీక్షలు రాయనివ్వరు. ఇంట్లో చెబితే తిడతారు తంతారు. ఏం చేయాలో తోచక ఒక్కడే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఒకటే ఆందోళన. బడిలో దాదాపు అందరూ ఫీజు కట్టేశారు తాను ఒక్కడు తప్ప. ఏం చేయాలా అని ఆలోచించసాగాడు.
ఆ పిల్లోనికి ఒక స్నేహితుడు వున్నాడు. వానికి విషయమంతా వివరించాడు. వాడు ఆలోచించి "అంత డబ్బు ఎవరినని అడుగుతాం. ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో కొట్టేయొచ్చు గదా" అన్నాడు. "దొంగతనమా అన్నాడు" ఆ పిల్లోడు భయంతో చిన్నగా వణుకుతూ. "చూడు ఇక వేరే దారి లేదు. నీ ఇష్టం ఆలోచించుకో" అన్నాడు.
ఆ పిల్లోడు ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చాడు.
వాళ్ళ నాన్న సాయంకాలం ఇంటికి రాగానే అంగీ విప్పి గోడకున్న మేకుకు తగిలించి స్నానానికి పోతాడు. తర్వాతరోజు మరలా బయటకు పోయేంతవరకు అది అక్కడే వేలాడబడి ఉంటుంది. దాంతో ఆ పిల్లోని కన్ను ఆ అంగీ మీద పడింది. గదిలో ఎవరూ లేని సమయంలో నెమ్మదిగా లోపలికి పోయి గబగబా జోబులో చేయి పెట్టాడు. రెండు వందల రూపాయల నోటు తగిలింది. మెల్లగా దాన్ని తీసి తన నిక్కరు జేబులో దాచి పెట్టుకున్నాడు. గుండె దడదడా కొట్టుకోసాగింది. ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. నోరు తడారి పోసాగింది. ఎవరైనా గమనిస్తున్నారేమో అని బెదురుచూపులు చూస్తూ బయటకు వచ్చాడు. ఎవరికీ కనబడకుండా సంచిలో దాచిపెట్టాడు.
కానీ అన్నం తిన బుద్ధి కావడం లేదు. ఎవరితో మాట్లాడ బుద్ధి కావడం లేదు. చదవబుద్ధి కావడం లేదు. గబగబా కొంచెం తిని, నీళ్లు తాగి దుప్పటి కప్పుకున్నాడు. పడుకున్నా సరే పదేపదే ఆ రెండు వందల రూపాయల నోటే కళ్ళ ముందు మెదలసాగింది. అమ్మానాన్నల ముందు ఇంతవరకు ఎప్పుడూ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. తల వంచుకునే పని ఎప్పుడూ చేయలేదు. ఈరోజు ఏకంగా ఇంత పెద్ద దొంగతనం చేశాడు. తప్పు చేశాననే బాధ వెంటాడసాగింది. ఇంట్లో డబ్బులు ఎక్కడా దాచిపెట్టరు. తాళాలు వేసి భద్రం చేయరు. పిల్లల మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని దెబ్బ కొడుతున్నాడు. విషయం తెలిస్తే ఇకపై తాను వాళ్ల ముందు తలెత్తుకొని తిరగగలడా. ఛ... తప్పు చేశాను అనిపించింది. నెమ్మదిగా లేచాడు. సంచిలోంచి రెండు వందలు తీసి జేబులో పెట్టుకున్నాడు. నీళ్లు తాగడానికని లోపలికి పోయి ఎవరూ చూడకుండా మౌనంగా ఆ నోటును తిరిగి వాళ్ళ నాన్న జేబులో పెట్టేశాడు.
తర్వాతరోజు మిత్రునికి జరిగిందంతా చెప్పి "నేను దొంగతనం చేయలేను. వేరే దారి ఇంకేదన్నా వుందా" అని అడిగాడు. మిత్రుడు ఆలోచించి "ఆదివారం నా వెంబడి రా. నాకు తెలిసినా పొలం ఉంది. కూలికి పోతే రెండు వందలు ఇస్తారు. ఇద్దరం పోదాం. ఆ డబ్బులతో నీవు ఫీజు కట్టేయొచ్చు" అన్నాడు. తర్వాతరోజు ఆదివారం లెక్కల సారు రమ్మన్నాడని చెప్పి బడికి పోయాడు. ఇద్దరు పత్తి చేనుకు పోయారు. సాయంకాలం వరకు పని చేశారు. డబ్బులు తీసుకుని సోమవారం ఆనందంగా బడికి పోయాడు. సారు ముందు డబ్బులు ఉంచాడు. అది చూసి సారు "మొన్న సాయంత్రం గ్రౌండ్ లో ముల్లకంపల వద్ద నీవు పోగొట్టుకున్న రెండు వందల రూపాయల నోటు ఒక ముసలాయనకు దొరికింది. పిల్లలు ఎవరన్నా పోగొట్టుకొని ఉంటారేమో అని తెచ్చి ఇచ్చాడు. దాంతో నీ ఫీజు కట్టేశాను" అని చెప్పాడు.
ఆ పిల్లోడు సంతోషంగా ఇంటికి వచ్చాడు. అమ్మకు జరిగిందంతా చెప్పి చేతిలో డబ్బులు పెట్టాడు. అమ్మ నవ్వి "కన్నా ఇది నీ తొలి సంపాదన. నిజాయితీగా కష్టపడి సంపాదించావు. దీనితో నీకు కావలసినవి ఏవన్నా కొనుక్కో" అని చెప్పింది.
తర్వాతరోజు బడికి పోయాక స్నేహితుడికి విషయమంతా చెప్పాడు. అదంతా విన్న స్నేహితుడు "నీకు ఒక నిజం చెబుతా విను. నువ్వు పోగొట్టుకున్న రెండువందలు ఏ ముసలాయనకు దొరకలేదు. సారుకు తెచ్చి ఇవ్వలేదు. అదంతా అబద్ధం. మొన్న సాయంత్రం బడి విడిచి మనమందరం వెళ్ళిపోయాక మీ నాన్న బడికి వచ్చాడట. డబ్బులు పోగొట్టుకున్న విషయం తెలుసుకొని ఫీజు కట్టి ఆ విషయం నీకు చెప్పవద్దని వెళ్లిపోయాడట. తెలుగుసారు హెడ్మాస్టర్ కి ఈ విషయం చెబుతావుంటే అప్పుడే చాక్ పీస్ కోసం వెళ్ళిన నాకు వినబడింది" అని చెప్పాడు.
ఆ పిల్లోనికి నాన్న ఆకాశమంత ఎత్తులో కనపడ్డాడు. కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నాడు. సాయంకాలం ఇంటికి పోగానే కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న నాన్న కనపడ్డాడు. "నాన్నా తప్పయింది. క్షమించు" అంటూ కాళ్ళ మీద తలవాల్చాడు. నాన్న చిరునవ్వు నవ్వి "నువ్వేమీ కావాలని పారవేయలేదు కదా... పొరపాటున ఎక్కడో పడిపోయింది. అలాంటప్పుడు మొదట అమ్మానాన్నలకు చెప్పాలి. కోపంతో వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా, తిట్టినా పట్టించుకోకూడదు. నువ్వు ఎక్కడ దొంగతనం చేస్తావో అని భయపడ్డాను. కానీ తిరిగి ఆ డబ్బు జేబులో పెట్టేసి కష్టపడి సంపాదించావు చూడు అది అద్భుతం. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. జీవితాంతం ఇలాగే తప్పు చేయకుండా బతుకు" అని దీవించాడు.
***************************
డా.ఎం.హరికిషన్-94410 32212-కర్నూలు
***************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment