🍁మనిషికి ప్రార్ధన ఒక వరం.. అదో అపూర్వ ఆధ్యాత్మిక ద్వారం.. ఒక ధైర్యం! వెరసి ప్రార్ధన ఒక గొప్ప ఆత్మానుభూతి: ప్రార్ధన శక్తిమంతమైన సాధనమని విజ్ఞులు చెబుతారు. తాము విశ్వసించే భగవత్ స్వరూపాన్ని మనసావాచా కర్మణా అర్థించడం... తమను తాము పూర్తిగా అర్పించుకోవడమే ప్రార్ధన.
🍁రావే ఈశ్వర, కావవే వరద.. అంటూ గజరాజు మొరపెట్టుకోగానే ఆ విష్ణువు ఉన్నవాడు ఉన్నట్లే పరిగెత్తుకుని వచ్చాడని పోతనామాత్యుడు హృద్యంగా వర్ణించాడు. తన శక్తి మీద నమ్మకం ఉన్నంతవరకు పోరాడిన గజేంద్రుడు.. ఆపై పూర్తిగా తనను తాను సమర్పించుకుంటూ భగవంతునికి చేసుకున్న విన్నపం వెంటనే ఫలితాన్నిచ్చింది. మన ప్రయత్నం మనం శాయశక్తులా చేసి, ఆ తర్వాత భగవంతుడిపై భారం వేయాలి. అదే నిజమైన భక్తుల లక్షణం! కొంతమంది దైవ ప్రార్ధనకు కూర్చుని, మధ్యలో అత్యల్పమైన ప్రాపంచిక విషయాలపైకి దృష్టిని మరల్చుతూ ఉంటారు. అలాంటి వారిని చూసే 'భక్తి ఒకచోట చిత్తం మరొకచోట' అంటారు.
🍁 దేవుడు ప్రేమ స్వరూపుడు. రాగద్వేషాలకతీతంగా సాటిమనుషులని ప్రేమించే వ్యక్తి దేవుణ్ని చక్కగా ప్రార్దించగలడని, అతడు సమస్త జీవరాశులని ప్రేమిస్తాడని జీసస్ అంటారు. 'నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, దాన్ని నేను ప్రార్ధనలో చెప్పుకుంటాను, చక్కని పరిష్కారం దొరుకుతుంది.. అని అన్నారు మహాత్మాగాంధీ. ప్రజల జీవితాలను శాంతియుత మార్గంలో నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గమే ప్రార్ధన అని మతప్రబోధకులు చెబుతారు. 'ప్రార్ధన నా జీవన ధార్మిక కర్మలలో ఒక భాగం. నన్ను నిత్యం నడిపించే, నాపై ప్రసరించే అమ్మవారి అనురాగం...' అన్నది రామకృష్ణ పరమహంస మాట. ఇంకా ఎంతోమంది మహానుభావులు ప్రార్ధనతో ప్రభావితులయ్యారు.
🍁వేదాలలో ప్రార్థనలు మంత్రాల రూపంలో ఉంటాయి. మంత్రాలలో శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది. శబ్దానికి వాక్కుకు వేదాలలో కొన్ని ఆచారకర్మలు ఉన్నాయి! యోగులు వాక్కును దైవరూపంగా భావిస్తారు. అది దేవదేవుని అనుగ్రహం పొందటానికి ఉపకరిస్తుందని వారి భావన. వ్యక్తిగత ప్రయోజనానికే కాదు.. కొన్ని ప్రార్ధనలు లోకశాంతి కోసం, పరిపూర్ణత కోసం, ఆత్మప్రక్షాళన కోసం జరుగుతాయి. ఒక్కో ప్రార్ధన ఒక్కో అవసరానికి నిర్దిష్టమైన ఫలితాలను ఆశించి చేస్తారు. ప్రార్థించే పద్ధతులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. 'నీ దాసులం' అని దేవుడి ముందు మోకరిల్లితే చాలదు, ఆయన పట్ల అపారమైన ప్రేమ పెంచుకోగలగాలి. బంధువులతో స్నేహితులతో ఆత్మీయులతో మాట్లాడినట్లు మాట్లాడుకోగలగాలి. ఏ షరతులు లేకుండా ఆ దేవదేవుడిని ప్రార్థించాలి.
🍁పంచేంద్రియాల కన్నా మన మనసే ఈ విషయాన్ని గ్రహించగలదు. 'నీవే తప్ప ఇతః పరం బెరుగ అనే భావం హృదయాంతరాళంలోంచి పెల్లుబకాలి.
అప్పుడే భక్తి భావం అంతర్యామిలో ఐక్యమవుతుంది. అపూర్వమైన ఆత్మానుభూతిని కలిగిస్తుంది. అదే నిజమైన ప్రార్ధన..!🙏
No comments:
Post a Comment