Friday, January 10, 2025

 ఫాతిమాషేక్’ 
ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ఒక ప్రముఖమైన పేరు. 

ఆధునిక భారతదేశ తొలి టీచర్ సావిత్రిబాయి ఫూలేతో కలిసి ఉపాధ్యాయురాలిగా, సంస్కర్తగా ఆమె పని చేశారు. 

*******

ఒక్క ఫాతిమాషేక్ ని మాత్రమే 
కాదు 

సామాజికంగా అనేక ఉద్యమాలు, సంస్కరణల్లో పాటుపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ మహిళలను చరిత్రలో కనుమరుగు చేశారు. 

అందువల్ల భారత సమాజానికి వారి వీరోచిత పోరాటాలు, త్యాగాలు, బలాలు, చైతన్యాలు భావి తరాలకు తెలియకుండా పోయాయి. 

అట్లా పోవడానికి ఆధిపత్య కుల, ఆధిపత్య మత వివక్షలే కారణం. 

వారి చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాల్లో, స్థానిక భాషల్లో, స్థానిక చరిత్రల్లో, మట్టి పొరల్లో తవ్వి తీస్తే దొరుకుతున్నాయి.

***********

ఫాతిమాషేక్ 
ఆధునిక భారతదేశ తొలి ముస్లిం టీచర్ 

ఈ విషయం సావిత్రిబాయి ఫూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలేకి రాసిన లేఖలో బయటపడింది. 

ఆ లేఖను ఆసరాగా చేసుకుని బ్రిటీష్ మిషనరీ లేఖలు, రిపోర్టులు, వ్యాసాలు, ఉర్దూ పుస్తకాలు, మరాఠి పుస్తకాలు, పత్రికలు, హిందీ పుస్తకాలు, సాహిత్యాలు, పుణె నగర స్థానిక మౌఖిక సమాచారాన్ని బట్టి జరిగిన పరిశోధనల్లో ఫాతిమాషేక్ కుటుంబానికి సంబంధించిన సమాచారం తెలియవచ్చినా ఆమె గురించిన సమాచారం లభ్యం కాలేదు. 

పుణె బుధవార్‌పేట్‌లో మౌఖికంగా చాలా సమాచారం ప్రచారంలో ఉందనీ, దీని ఆధారంగా ఫాతిమాషేక్ మీద విస్తృత సాహిత్యం వచ్చిందనీ పరిశోధక విశ్లేషణ.

******

భారతదేశం భిన్న సమాజాల అస్తిత్వ దేశం. దేశానికి అన్ని సమాజాల, సమూహాల సేవ, చైతన్యాల చరిత్రలు స్ఫూర్తి కావాలి. 

కుల, మత, జెండర్ సామాజిక అస్తిత్వాల చరిత్రలు తెలిసినపుడే ఆయా సమూహాల మధ్య పరస్పర గౌరవం, సామరస్య, మానవీయ స్నేహాలకు బలమైన పునాదులు ఏర్పడతాయి.

స్థానిక మౌఖిక సమాచారం విస్తృత వ్యాప్తిలో ఉన్నందువల్ల మహారాష్ట్ర బహుజన కులాల ఉద్యమకారులు, రచయితలు, చరిత్రకారులు, పరిశోధకులు, కళాకారులు ఎక్కడ, ఏ ఉద్యమం చేసినా సావిత్రిబాయి, జ్యోతిరావ్ ఫూలేలతో పాటు ఫాతిమాషేక్ స్మరణను ప్రస్తావించడం భాగమైనందువల్ల ఆ ఉదాత్తురాలి గురించి విశాల దేశానికి వెల్లడి అయింది. 

విద్యారంగంలో విస్మరించలేని కృషి చేసినందువల్లే ఫాతిమా చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠ్య పుస్తకం రెండవ తరగతి బాలభారతిగా పెట్టడం అనివార్యమైంది. 

కానీ ఫాతిమా ఒక్క ఉర్దూ వాళ్ళకే పాఠాలు చెప్పలేదు. అన్ని కులాల, మతాల వాళ్లను, మహిళలను విద్యావంతులను చేసిన గొప్ప సామాజిక అధ్యాపకురాలు. అట్లాంటి అధ్యాపకురాలిని ఉర్దూ పాఠం వరకే కుదించడం ఆమె విశాల మానవీయ చరిత్రకు అన్యాయం చేసినట్లే అవుతుంది. ఆమె చరిత్రను మరాఠీ పాఠ్యాంశాల్లోనే కాక మొత్తం భారతీయ భాషల్లోకి కూడా తేవాల్సి ఉంది.

******

ఫాతిమాషేక్ పుణెలోని గంజిపేట్ నివాసి. 

ఆమె జననం జనవరి 9, 1831. 

వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి గంజిపేట్‌లో స్థిరపడిన చేనేత వస్త్ర వ్యాపారులు. 

చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అన్న ఉస్మాన్ షేక్ ఆలనలో పెరిగింది. 

అణగారిన కులాలకు, మహిళలకు పాఠశాలలు పెట్టేందుకు, కులవివక్షను వ్యతిరేకిస్తున్న ఫూలే దంపతులను జ్యోతిబా తండ్రి బైటకు వెళ్లగొట్టినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వడమే గాక తమ ఇంటిలోని ఒక భాగాన్ని పాఠశాలగా ఇచ్చిన ఉదాత్తుడు ఉస్మాన్‌ షేక్‌.


ఎన్నో నిషేధాల్ని ధిక్కరించి బడుగువర్గాలవారి కోసం విద్యావ్యవస్థల్ని ఏర్పాటు చేసే గొప్ప లక్ష్యాలున్న ఫూలే దంపతులకు అండగా నిలిచారు ఫాతిమా, ఆమె సోదరుడు ఉస్మాన్. 

అట్లనే జ్యోతిరావ్ ఫూలే చదువు మధ్యలో ఆగిపోతే, తిరిగి జ్యోతిరావ్‌ను పాఠశాలకు పంపాలని ఆయన తండ్రిని ఒప్పించి, చివరికి ఒక మంచి మిషనరీ స్కూల్లో చేర్పించిన పండితుడు, బహుభాషాకోవిదుడు గంజిపేట్ నివాసి మున్షీ గఫార్‌బేగ్. 

తల్లిదండ్రుల్లేని ఫాతిమా ఆమె అన్న ఉస్మాన్‌కి కూడా ఆయనే పెద్దదిక్కు. ఈయన సహకారంతోనే ఫాతిమా కుటుంబం గంజిపేటలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నది. 

అట్లా జ్యోతిరావ్‌కు ముస్లిం సమాజాలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సంబంధాల వల్లనే ఆయన ‘మానవ మహమ్మద్’ అనే స్తుతి గీతం రాశారు.

ఫాతిమాషేక్‌కి మరాఠి, ఇంగ్లీషు విద్యలతో పాటు విద్యాబోధన శిక్షణ కూడా ఫూలే దంపతులే అందించారు. 

ఫాతిమాషేక్, సావిత్రిబాయి ఫూలేలు కలిసి అహ్మద్‌నగర్‌లో టీచర్ ట్రైనింగ్ కోర్సు ఫూర్తి చేసి బాలికా పాఠశాలల్ని గొప్పగా తీర్చిదిద్దారు. 

ఫూలే దంపతులు బాలికలకు ప్రత్యేక పాఠశాలలను 1848లోనే పెట్టి ఇంకా అనేక పాఠశాలల్ని నడిపారు. ఆ పాఠశాలలకు అధ్యాపకులుగా ఫూలే దంపతులు ఎక్కువగా బహుజన కులాల విద్యావంతులను ప్రోత్సహించారు.

బాలికల పాఠశాలలకు మగ టీచర్లుంటే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని పంపేవారు కాదు. అసలు ఆడపిల్లలకు ‘చదువు చెరుపు’ అనే భావనలో ఉండేవారు. 

మహిళా టీచర్లు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి చదువుకొని వారికి పాఠాలు చెప్పింది. ఆమె ఆదర్శంగా ఫాతిమా కూడా ఫూలే పాఠశాలలో చదువుకొని పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చింది. 

వీరిద్దరూ అహ్మద్‌నగర్‌లోని ‘మేడమ్ సింథియా ఫెరారె’ మిషినరీలో ఫూర్తిస్థాయి ఉపాధ్యాయులుగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలో టీచర్ ట్రైనింగ్ చేసిన తొలి మహిళా అధ్యాపకులుగా సర్టిఫికెట్‌ పొందారు. అట్లా ఉపాధ్యాయ వృత్తివిద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ ఫాతిమాషేక్.

పాఠశాలకు తమ ఆడపిల్లల్ని పంపని ఇండ్లకు పోయి బాలికా విద్య ప్రాముఖ్యత, అవసరాన్ని చెప్పి, తిరిగి బాలికలను పాఠశాలకు రప్పించేవారు సావిత్రిబాయి, ఫాతిమా. 

దీనిని ముస్లిం సమాజాలు, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించేవారు, దాడులు చేసేవారు. పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు కాదు. 

ఇంకో వైపు హిందూ అగ్రవర్ణాల నుంచి కూడా దాడులు, వ్యతిరేకతలు, అడ్డంకులెదురయ్యేవి. 

వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నది ఫాతిమాషేక్. పరదా చాటు ఇంటి నుంచి బైటకొచ్చి ఇల్లిల్లూ తిరిగి ఇతర బాలికలతో పాటు ముస్లిం బాలికలను కూడా పాఠశాలలో చేర్పించడం ఒక ముస్లిం మహిళగా పెద్ద సాహసమే. 

ఎన్ని కష్టాలెదురైనా బాలికా పాఠశాలలను ధైర్యంగా కర్తవ్య దీక్షతో ఉపాధ్యాయినిగా ముందుకు నడిపారు. 

సావిత్రిబాయి ఆరోగ్యం బాగోలేక పుట్టింటికి పోయినపుడు... ఫాతిమా సేవలుండగా పాఠశాలలకు లోటు రాదు, ఆమెకు ఎక్కువ శ్రమ ఇస్తున్నానని జ్యోతిరావు ఫూలేకి రాసిన ఉత్తరాన్ని బట్టి ఫాతిమాషేక్ వారికి ఎంత ప్రథమురాలో అర్థం అవుతుంది. 

ఇదే ఫాతిమాషేక్ చరిత్రకు ఆయువు పట్టు.

ఫూలే పాఠశాల నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అణగారిన కులాలకు, మతాల సమాజాలకు ఉపాధ్యాయినిగా, సామాజిక కార్యకర్తగా, సంఘసంస్కర్తగా, సావిత్రిబాయి ఫూలే సహచరిణిగా ఫాతిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటారు. 

ఆధునిక భారతదేశ మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమాషేక్‌ గురించి సమగ్రంగా తెలుగు ప్రజలకు తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు.

సుభద్ర జె.

(నేడు ఫాతిమాషేక్ జయంతి)

No comments:

Post a Comment