*కర్మలు : కర్మఫలాలు*
*మానవుడు మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వతానందాన్ని పొందాలంటే కర్మబంధనాలన్నీ వదిలించుకోవాలి. ఐతే వీటిని ఎలా వదిలించుకోవాలి ? అనేది తెలుసుకుందాం.*
*మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేవరకు మనం చేసే పనులన్నీ కర్మలే. ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయేటంతవరకు కర్మలు చేస్తూనే వుంటాడు. ఇలా చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది (కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం). మనం చేసే ప్రతికర్మ కూడా ఎపుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది. అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను ౩ రకాలుగా విభజించారు.*
*అవి :-*
*1) అగామి కర్మలు*
*2)సంచిత కర్మలు మరియు*
*౩)ప్రారబ్ధ కర్మలు.*
*అగామి కర్మలు :-*
*ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి.కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొనివుంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతుంది. ఎవరినైనా కోపంతో తిడతాం. అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడతాడు. అది కర్మఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి.కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరణకు : ఎదురుగాలేని వాణ్ణి తిడతాం. వాడిమీద నిందలు వేస్తాం. కాని వాడు ఎదురుగాలేడు గనుక అప్పటికప్పుడు ఫలితం రాదు. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి కావు. మనం పరీక్షలు వ్రాస్తాం. ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితాన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి.ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.*
*సంచిత కర్మలు :-*
*ఇంతకు ముందు జన్మలో చేసి, తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదేవిదంగా అంతకుముందు జన్మలలో చేసిన కర్మఫలం నుండి ఖర్చు అయినవి పోగా, ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను 'సంచిత కర్మలు' అంటారు. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి. మనం అద్దె ఇళ్ళలో వుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా మూటగట్టుకొని వెళతామో, అలాగే జీవుడు భగవంతుడు ఇచ్చిన అద్దెయింటి లాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక అద్దెకొంపలాంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుకువెళ్ళేవే 'సంచిత కర్మలు'.*
*ప్రారబ్ధ కర్మలు :-*
*అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయాణిస్తాయని చెప్పుకున్నాం. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో , అప్పుడు అతడి ఖాతాలో వున్న సంచిత కర్మల నుండి , ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో లేక పండుతాయో, ఫలితాన్నివ్వటానికి సిద్దంగా ఉంటాయో వాటిని 'ప్రారబ్ధ కర్మలు' అంటారు. ఆ ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, తగిన శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మఫలాలను అనుభవించటం పూర్తయ్యేవరకు శరీరం వుంటుంది.*
*(మనం ఏం చేస్తున్నాము ? కాని చేయవలసింది ఏమిటి ?)*
🌺🌺🌺🙏🕉️🙏🌺🌺🌺
No comments:
Post a Comment