Friday, July 25, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
          *అంతా గడిచిపోయాక*

*పెద్దలు మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలను, జీవిత పాఠాలను అతి మామూలు మాటల్లో సామెతలు, నానుడుల రూపంలో చెప్పారు. వాటిని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే జీవితంలో పశ్చాత్తాపం చెందాల్సిన పరిస్థితులు రావు. అలాంటి కొన్ని సందర్భాలు... ఏదైనా గడిచిపోయిన, జరిగిపోయిన, జారిపోయిన, కోల్పోయిన తరువాత ఏమనుకున్నా, ఏం చేసినా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పరిస్థితినే 'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు' అనే సామెతలో చెబుతారు. అలాంటి పరిస్థితిలో పరిష్కారం కోసం వెతికేకన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ విషయాన్ని శ్రీమద్భాగవతం ఒక శ్లోకంలో చెబుతుంది. 'ఇతర ప్రాణులకు హాని కలగకుండా, పడరాని చోట పడకుండా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. అనారోగ్యం కలగ కుండా ఉండేందుకు* *నీటిని వడపోసి తాగాలి.*

*మాట్లాడే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. మనసును శుద్ధి చేసుకుని మంచి మనసుతో పనులు చెయ్యాలి' అని. ఇలా చేస్తే ఇబ్బందులు రావు, వచ్చినా అధిగమించడం తేలిక. 'కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసు కోలేం' అంటుంది మరో నానుడి. అనాలోచితంగా మాట్లాడితే అనేక అనర్థాలు కలుగుతాయని దానికి అర్థం. ఈ విషయాన్ని భారతంలో విదురుడి నోట చెప్పించాడు వ్యాస మహర్షి. 'శరీరంలో విరిగిన ఎన్ని బాణాలనైనా ఏదో ఒక ఉపాయంతో తీసేయవచ్చు. కానీ నిష్టురంగా ఎదుటి వారి మనసులో నాటుకున్న కఠినమైన మాటలను ఎన్ని ఉపాయాలతోనైనా తొలగించలేం' అంటాడు విదురుడు. డబ్బో వస్తువో కోల్పోతే ఏదోలా సంపాదించుకోగలం. కానీ మన పట్ల ఇతరులకున్న నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదైనా అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. దాన్ని ఒడిసిపట్టుకుని పైకెదగాలి. ఆ అవకాశం తప్పిపోయిన తరవాత దాని గురించి ఎంత వగచినా, ప్రయోజనం ఉండదు. అవకాశం వచ్చినప్పుడు తెగువ, చొరవ లాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వినియోగం చేసుకోవాలి. కాలం ఎవరి కోసము ఆగదు. దాంతోపాటే మనమూ పయనిస్తూ వచ్చే మార్పులకు అనుగుణంగా నడచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రవాహం వచ్చి, చేయాల్సిన నష్టం అంతా చేసి వెళ్లిపోయాక వంతెన కట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. దీన్నే 'గతజల సేతు బంధనం' అంటారు.*

*అలాంటి పరిస్థితి కలగకుండా ముందుగానే జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకోవాలనే బోధన ఉందీ నానుడిలో ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు-మాపు అని వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించమని చెబుతుంది 'శుభస్య శీఘ్రం' అనేమాట. 'ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొకటి. చదువు కునే వయసులో చదువు, తగిన వయసులో వివాహం... ఇలా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగితేనే అందం... ఆనందం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴

No comments:

Post a Comment