Sunday, July 27, 2025

 స్త్రీవాదన్ని సాహిత్యంలో చర్చించేటప్పుడు చాలా గంభీరంగా, విషాదంగా, కోపంగా, వాదిస్తూ విశ్లేషిస్తూ కథనాన్ని నడిపించడం చాలా మంది రచయితల శైలి. ఇది చాలా సందర్భాలలో అత్యవసరం కూడా. అయితే దాన్ని హాస్యంగా, సున్నితమైన భాషలోనే కాని  దృఢంగా చర్చకు పెట్టడం మృణాళిని గారి శైలి. ప్రస్తుతం తెలుగులో రచయిత్రులు వారి రచనలపై నేను నా తదుపరి పుస్తకం కోసం అధ్యయనం చేస్తున్నాను. తెలుగులో ముందు తరం రచయితల పుస్తకాలను మనం మలి తరానికి అందించట్లేదన్నది నా అభిప్రాయం.

 70s, 80s 90s లలో నవలలకు జనజీవనంలో చాలా ప్రాముఖ్యత ఉండేది. కాని ఇప్పుడు ఆ నాటి రచనలను నేటి ఆధునిక రచయితలు ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఇది తరువాత తరానికి సాహిత్యాన్ని దూరం చేస్తుంది. చదివితే చలం, కోకో, శ్రీ శ్రీ, లేదంటే ఇప్పటి తరంలో వస్తున్న పుస్తకాలు. ఇవి తప్ప మధ్య కాలంలో వచ్చిన సాహిత్యం యువతకు చేరట్లేదు. రచయితలలో చదివేవారు తగ్గిపోవడం. ఉన్నా ఇతర రచయిత్రుల పుస్తకాలను ప్రస్తావించాలంటే వారి గొంతుకకు ఏదో అడ్డం పడడం కారణం కావచ్చు. కాని దీని వల్ల తెలుగు పాఠకలోకంలో అతి పెద్ద గాప్ వస్తుంది. దీన్ని ఎవరూ గమనించకపోవడం, గమనించినా ఆ గాప్ తగ్గించడానికి ప్రయత్నించకపోవడం బాధాకరం.   

అందుకే నా ప్రయత్నంలో భాగంగా అలనాటి రచయితలను, వారి పుస్తకలను ప్రస్తావించాలన్న భాద్యతతో నేను తెలుగు సాహిత్యాన్ని వీలైనంత లోతుగా పరిశీలించాలని చేస్తున్న ప్రయత్నంలో చాలా మంచి పుస్తకలను సేకరించగలిగాను.  మృణాళిని గారి “కోమలి గాంధారం” అలా నా చేతికి చిక్కింది. నేను నవలల పై శ్రద్ద పెడుతున్న క్రమంలో ఎవరో చెప్పగా ఆసక్తి కలిగి తీసుకున్న పుస్తకం ఇది. కాని ఇది నవల కాదు. అయినా ప్రస్తుతం దీనితో పని లేదు కదా అని పక్కన పెట్టేయలేక పోయాను. ఈ మధ్య మృణాళిని గారితో జరిపిన సంభాషణలు వారి పుస్తకాలను చదవాలనే కోర్కెను కలిగించడంతో పుస్తకాలు కొనుక్కున్నాను. ‘కోమలి గాంధారం’లో కోమలి నాకు బాగా నచ్చింది. 

కుటుంబ వ్యవస్థ పితృస్వామ్యంతోనే నిర్మించబడింది. ఈ వ్యవస్థలోని లోపాలను గుర్తించిన  స్త్రీ దగ్గర రెండు ప్రత్యాయమానాలుంటాయి. ఆ వ్యవస్థలో ఉంటూ దాన్ని ప్రశ్నిస్తూ పోవడం. అందులోనించి బైట పడి తమ జీవితాలను పునఃనిర్మించుకోవడం. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో అందరు స్త్రీలకు ఒకే రకమైన బాధలుండవు. కొందరికి లభించిన కుటుంబాల ఆలోచనలలో మార్పు ప్రయత్నిస్తే తీసుకురావచ్చు.. వ్యవస్థలో భాగంగా జీవించే క్రమంలో స్త్రీని అవి ఇబ్బంది పెడతాయి తప్ప దోపిడి మాత్రమే ఉద్దేశంగా ఆ కుటుంబ జీవనం ఉండదు. అలాంటి కుటుంబాలకు కోమలి ఓ చక్కని జవాబు. ఈమె చదువుకున్నది, తెలివైనది, విజ్ఞత కలది. తన హక్కులతో పాటు బాధ్యతల పట్ల కూడా అవగాహన ఉన్న స్త్రీ. అందుకే ఆమెలోని సంయమనం మనకు నచ్చుతుంది. ఎక్కడ ప్రశ్నించాలో ఆమెకు తెలుసు. 

ముగ్గులు పెట్టడం ఆడపుటుక పుట్టినవారందరికీ అబ్బే సుగుణం అన్న అత్తగారితోనే ఆమెకు ఆ సుగుణం లేదని తోటికోడలి నైపుణ్యం మీద ఉన్న అక్కసే  కోడలిని జడ్జ్ చేయడానికి కారణం అని మొదటికథలోనే ఎంతో గడుసుగా కనిపెడుతుంది కోమలి. ఆదర్శ దంపతుల పట్ల సమాజంలో ఉన్న భావజాలం, పిల్లల కోసం నోములు నోచుకునే వారి అమాయకత్వం, పెళ్లి కుదిరాక ప్రేమతో చంపే కాబోయే పెళ్లి కోడుకుల పిచ్చి వదల్చడానికి పెళ్ళే మందని తేల్చుకోవడం, ఇంటిల్లిపాది అవసరాలను అనవసరపు బాధ్యతలుగా నెత్తికి తగిలించుకుని విక్టింగా బతికే భార్యల అవస్థ, భర్తల చేతకానితనాన్ని అమాయకంగా మోసే భార్యలకు కోమలి పెట్టే చురకలు ఎన్నో గంభీరమైన విషయాలను చర్చకు పెడతాయి. సమాజంలో మార్పు ఎంత అవసరమో చర్చిస్తాయి. భార్యా భర్తల మధ్య వాదులాటల అవసరాన్ని ఓ సైకాలజిస్ట్ గా ఆమె వివరిస్తుంటే నవ్వకుండా ఉండలేం. స్వేచ్చ పేరుతో జరుగుతున్న రచ్చను అద్భుతంగా వర్ణించారు రచయిత్రి. ఏది స్వేచ్చో ఏది పలాయనవాదమో అర్ధం చేసుకోలేని వారికి ఇదో గొప్ప చురక. స్త్రీ వాద సాహిత్యంలోని కథా వస్తువు పై కూడా మంచి చురకలే తగిలించారు. 

కాస్త ఆరోగ్యం బాలేకపోతే హడావిడి చేసే భర్తలను, వారికి సేవలు చేసే భార్యల స్థితిని రచయిత్రి రాసిన పద్దతి చాలా బావుంది. తమతో మర్యాదగా సంభాషించమని భార్యలు కోరితే అలా ఉండలేక మౌనంలోకి వెళ్ళిపోయిన భర్తలు, ఆ తరువాత భార్యలకు వారు కోరిన బహుమతులను ఇస్తూ తిరిగి తమ పాత ధోరణిలో వారితో సంబాషించడం చేస్తారి. దానికి బాధపడక, తాము అందుకున్న బహుమతులను చూసి అనందిస్తున్న భార్యలను చూస్తే మొత్తం వ్యవస్థలో స్త్రీల బలహీనతలను చూసి వారిపై జాలి కలుగుతుంది. ప్రాక్టికల్ గా ఉన్న భార్యను విమర్శించే భర్తకు కోమలి అవకాశం చూసుకుని ఇచ్చే సమాధానం ఆనందం కలిగిస్తుంది. భార్య వంటని విమర్శించే భర్తకు తాను ఉద్యోగం సంపాదించుకుని జవాబు చెపుతుంది కోమలి. “నేను మా ఆవిడకు ఆస్తినే గాని నాకు మా ఆవిడ మాత్రమే ఆస్తి కాదు” అనే భర్తగారి ఆలోచన, ఉద్యోగస్తురాలిగా, రచయిత్రిగా పేరు సంపాదించుకున్న భార్య విషయంలో  భర్త ప్రవర్తించే విధానం, భార్యను పుట్టింటికి పంపించి స్వేచ్చను అనుభవించాలనుకునే భర్తకు కోమలి ఇచ్చిన జవాబు, డైటింగ్ పేరుతో ఇంట్లో జరిగే చర్చ, భార్య ఇంటి విషయాలు పట్టించుకోకపోతే ఇల్లు ఉండే స్థితి, భార్య వియోగం పేరుతో భర్తలు ఆడే నాటకాలు ఇవన్నీ ఆలోచనను కలిగిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి.  

ఉద్యోగం చేసే చోట సాంస్కృతిక కార్యక్రమాలలో స్త్రీలను పాటలకే పరిమితం చేసి మిగతా కార్యక్రమాలను పురుషులు పంచుకొవడాన్ని కోమలి ఖండించే విధానం చదివి తీరాల్సిందే. తోటి మగ లెక్చరర్ల అధికారాన్ని కోమలి తిప్పి కొట్టే విధానం చాలా బావుంటుంది. సాయంత్రం ఇంటికి భర్త వస్తే భార్య చక్కగా అలంకరించుకుని నవ్వుతూ ఎదురు రావాలనే మగవారి కోరికను “వస్తున్నది ఇంట్లోకేగా, ముత్తయిదువు శకునమెందుకు” అని ఆమె ప్రశ్నించే కోమలి ఎవరికి నచ్చదు? 

కోమలి పాత్ర నాకు బాగా నచ్చడానికి కారణం “నాకు సౌందర్య పోషణలో ఒకటే తెలుసు. మొహం చిట్లించుకోకుండా, ఎవర్నో చూసి ఏడవకుండా ఉంటే అందరూ బాగానే ఉంటారని” అని ఆమె చెప్పే విధానం. అద్భుతమైన కాన్పిడెన్స్ ఉంటుంది ఆమెలో. “అసలు నాకు ఈ విశాల ప్రపంచంలో ఎన్ని రకాల డ్రెస్సులున్నాయో తెలీదు. ఎన్ని రంగుల చీరెలుంటాయో రాయగలనంతే” అని చెప్పిన కోమలిని నేను ఇష్టపడకుండా ఎలా ఉండగలను? “మగసిరికి మొహమెందుకు చూడ్డం? జేబు చూపించండి” అని ధైర్యంగా అనగలదు కోమలి. తనను సినిమా తారలతో భార్య పోల్చట్లేదని అలిగిన భర్తకు “అందరిలా మీరున్నారని అనాలా లేక ఎవరో ఒకరిలా ఉన్నారంటే చాలా” అని ప్రశ్నించిన ఆమె లౌక్యం ఆకట్టుకుంటుంది. భార్యను ఎవరో చూస్తున్నారని అతన్ని భార్య ఏమీ అనట్లేదని భర్త విమర్శిస్తే “వాడు నన్ను స్టేర్ చెయడం నచ్చనిది మీకు, మీరే అనొచ్చుగా. పైగా భర్తగా ఆ హక్కులు మీకున్నాయి” అని ఎదురు ప్రశిస్తుంది కోమలి. 

తమ భార్యలను తోటి ఉద్యోగస్తుల దగ్గల చులకనగా మాట్లాడే మగ కొలిగ్స్ కు ఆమె బుద్ది చెప్పిన విధానం చాలా బావుంటుంది. 
చాలా కుటుంబ కథల్లో అత్తగారి పాత్రను చెడ్డగా చూపిస్తారు. కాని కోమలి అత్తగారిలో అమాయకత్వం, కాస్త చాదస్తంతో పాటు కోడలి పట్ల అపారమైన ప్రేమానురాగాలు కనిపిస్తాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరు మరొకరితో విభేదిస్తూ కనిపిస్తారు. కాని అది వారి బంధాన్ని పలచన చేయదు. “పరిపూర్ణత్వం అంటే ఆడపిల్ల సర్దుకుపోవడమా” అని కోమలి భర్తని ప్రశ్నించ
గలుగుతుంది. చిక్కనైన ప్రేమాభిమానాల మధ్య కూడా కుటుంబంలో తొంగి చూసే స్త్రీ వివక్షను కోమలి ఎదుర్కోవడానికి సందేహించదు. అది అత్తయినా మామయినా భర్తయినా, ఉద్యోగం చేసే చోట అధికారులయినా, కొలిగ్స్ అయినా అందరికీ తన శైలిలో జవాబులు చెబుతుంది. తానుగా జీవిస్తుంది. ఎక్కడా ఏ సందర్భంలోనూ తన ఆత్మాభిమానాన్ని కుదవ పెట్టుకోదు.

లౌక్యం, ఆలోచన, బాధ్యత సమపాళ్లలో ఉన్న స్త్రీ కోమలి. అందుకే ఆమె జీవితాన్ని ఎదుర్కున్న విధానం నచ్చుతుంది. చాలా సరదాగా హాయిగా చదువుకుని ఆ సమస్యలలోని మూలాలను వాటి కారణాలను వెతకడంలోనూ ఈ పుస్తకం సహాయపడుతుంది. “కోమలి గాంధారం” ఇచ్చే అనుభవం బావుంటుంది.

Smt. P. Jyothi.

No comments:

Post a Comment