Sunday, July 27, 2025

 *కాలాలు* 

 *లక్ష్మి*మదన్* 

🌹🌹🌹🌹🌹🌹🌹

వేసవి వేడిని అనుభవించి కాస్త సేదతీరుదామని అనుకునే జనులంతా మృగశిర కార్తి వచ్చిన వెంటనే చినుకుల కోసం ఎదురుచూస్తారు ..🌧️నాడు మొత్తం పంచాంగం ఆధారంగానే ప్రతి విషయాన్ని నమ్ముకునేవారు అలాగే జరిగేది.

అలా మెల్లగా ఋతుపవనాలు స్పృశించడం చల్లని గాలి వీచడం, వేడి గాలులు ఎవరో తరుముతున్నట్టు మెల్లిగా వెళ్లిపోవడం, భూమి చల్లబడడం జరిగేది.

మొదటిసారి చినుకులు రాలగానే💧🫧 భూమంతా దానిలోని వేడిని వెళ్లగక్కీ, కాస్త సేద తీరుతుంది. ఇంటి ముందున్న నడిమి వాకిలి వరండాలో కూర్చుని రాలుతున్న చినుకులను చూసుకుంటూ తన్వయత్వం పొంది తీరాల్సిందే. వాకిట్లో పందిరిపై పాకిన రాధా మాధవ చెట్టుమీద రాలిన చినుకులు ఒక్కటి ఒక్కటి కిందికి రాలుతుంటే, ఆ చెట్టు సంతోషంతో పరవశిస్తున్నట్లు తోచేది. విచ్చుకున్న రాధా మాధవ పువ్వులు మరింత నవ్వుతున్నట్లుగా వాటి సౌరభాన్ని వెదజల్లుతూ గాలిని పరిమళభరితంగా మార్చేసేవి .🥀🌸ఎంత బాగుండేదని! ఎంత వర్ణించినా ఆ భావాన్ని మాటల్లో చెప్పలేము.

చిన్నప్పుడు నేను అనుకునే దాన్ని. వర్షం ఇంటిపై కప్పులో ఉన్న పెంకుల ద్వారా కురుస్తుందని. ఎందుకంటే వర్షపు నీళ్లు పెంకుల ద్వారా ధారగా కురిసేది. కొన్ని రోజుల తర్వాత ఆకాశం కేసి చూస్తుంటే చినుకుల రూపంలో కనిపించే నీళ్లను చూసి అప్పుడు ఓహో ఇది మేఘమాలికలు ☁️ ఆప్యాయంగా పుడమిని తడిపే భావననా ! అని అనుకున్నాను.   

అప్పట్లో ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఒదిగిపోయి ఉండేవాళ్లు. చలిని, ఎండని, వానని ఒక్కతీరిగానే చూసేవాళ్ళము. చలికాలం వస్తే పొద్దున కాస్త నీరు ఎండకు కూర్చోవడం 🌝💥 రాత్రిళ్ళు చలిమంట కాచుకోవడం. అలా సరదా సరదాగా ఆ కాలాన్ని స్వాగతించే వాళ్ళము.

ఎండాకాలం అయితే ఎండలో తిరిగితే ఎప్పుడో ఒకసారి గొడుగు☂️ పట్టుకోవడం, సాయంత్రం వాకిళ్లలో నీళ్లు చల్లుకోవడం, ఎక్కువగా ఇంటి వసారాలు, వాకిళ్లలో నిద్రపోవడం చేసేవాళ్లం. 

అప్పటి ఇళ్ళు కూడా ఎత్తుగా ఉండేవి ఇంట్లోకి కూడా గాలి చక్కగా వచ్చేది. ఇంటి వెనకాల ఉన్న చెట్లు 🌳ఇంటికి చల్లదనాన్ని ఇచ్చేవి. అందువల్ల ఇబ్బందులు తెలిసేవి కావు. ఇంకా వర్షాకాలం అయితే ముందు జాగ్రత్తగా పొయ్యిలోకి కట్టెలు ఎండబెట్టి, ఇంట్లో దాచి పెట్టుకోవడం, ఇల్లు కురుస్తుందని ముందే బాగు చేయించుకోవడం, అప్పడాలు వడియాలు లాంటివి ఎండాకాలంలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవడం, విత్తనాలు తయారుగా పెట్టుకోవడం ఇవన్నీ చేసుకునేవాళ్లు. 

వర్షం పడగానే వ్యవసాయం పనులు మొదలయ్యేవి. వ్యవసాయం పనుల కోసం నాగళ్ళు బాగు చేయించుకోవడం, విత్తనాలు తయారుగా పెట్టుకోవడం చేసుకునేవారు. ఇళ్లల్లో పెరళ్లు శుభ్రపరిచి సొరకాయ🍐 బీరకాయ వంకాయ🍆 చిక్కుడుకాయ విత్తనాలు నాటి, పాదులు చేసి పందిళ్లు కట్టుకునేవారు. బంతి 🌻 పట్నం బంతి ఇంకా గోర్మెంట్ విత్తనాలు ఇవన్నీ నాటేవాళ్ళు🌺🌸🌹. రంగురంగుల పూలతో నెల లోపలే శోభాయమానంగా కనిపించేది. ఇంటి లోగిళ్లన్నీ కళకళలాడేవి.

దీపావళి పండగకి🪄 ఇంట్లో పూసిన బంతిపూలతోనే తోరణాలు కట్టుకొని సంబర పడేవాళ్ళం. ఇంకా ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళు మొక్కజొన్న🌽 లాంటివి ఇంటి పెరట్ల వేసుకునే వాళ్ళు.

దసరా పండుగ టైంకి చక్కగా కంకులు కాసేవి. దసరా సెలవుల్లో బతుకమ్మ పండుగ వస్తుంది కదా! అప్పుడు పిల్లలందరికీ ఇంట్లో పెద్దవాళ్లు మాకైతే మా నాయనమ్మ చక్కగా కంకులు విరుచుకొచ్చి, బొగ్గుల పొయ్యిమీద కాల్చి, కంకి ఆకుమీద వెన్న పచ్చిమిరపకాయ కారం కలిపి ఇచ్చేది. అసలు ఆ రుచి ఇప్పుడు రానే రాదు. అది కంకులకున్న రుచా! లేదా స్వచ్ఛంగా పెరిగిన పంటలదా తెలియదు 😋 మరి!

బతుకమ్మ ప్రసాదం కోసం కూడా ఒక్కొక్కసారి మొక్కజొన్న కంకులు కాల్చి, వలుచుకొని అందులో నెయ్యి బెల్లం కలిపి తీసుకెళ్లే వాళ్ళం.

ఏది ఏమైనా ఇలా వర్షం కురుస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే రోజులైతే మరీ గుర్తొస్తున్నాయి. తడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళిన రోజులు. అంత వర్షంలో వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి మళ్లీ స్కూల్ సెలవు ప్రకటించింది అని తెలిసి మళ్ళీ అదే వర్షంలో తడుసుకుంటూ ఇంటికి రావడం అదొక సరదా.

అన్ని కాలాలను సంతోషంగా స్వాగతించి దానికి అనుగుణంగా మసులుకున్నాము. నాకైతే చలికాలంలో స్వెటర్ వేసుకున్న జ్ఞాపకమే లేదు. అంటే నాటి తరాలు ఆ వాతావరణం ఆస్వాదించి, అనుభవించి శరీరాన్ని దానికి అనుగుణంగా మలుచుకున్నారు. కాబట్టి శరీరం కూడా దృఢంగానే ఉండేది. కొంచెం గాలి సోకినా జలుబు, జ్వరాలు రాకుండా గట్టిగానే ఉండేవాళ్ళము.

 ఏది ఏమైనా ప్రకృతే మనం మనమే ప్రకృతి. ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ మన శరీరంలో ఉంటాయి. కాబట్టి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ప్రకృతిని పరిరక్షించి ప్రేమిద్దాం!

🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment