Tuesday, July 29, 2025

 🤷‍♂️🌻🤷‍♂️🌻🤷‍♂️🌻🤷‍♂️🌻🤷‍♂️

*🌷జీవితంలో పరీక్షలు🌷*

జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. 
జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం. 

పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? 
ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి? 

పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.
బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.

బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.

చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. 
పక్షికి తుపాను పరీక్ష..! 
పాముకు గద్ద పరీక్ష..!

*‘నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’* 
అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. 
పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. 
కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. 

పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.

పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. 

అదేమిటి- పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.

మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.

ధర్మరాజు.. జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు.

పాండవులు.. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. 

కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.

జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.

కుంతీదేవి.. ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది. 

మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. 
నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. 
నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.

ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి. ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది?! 

🙏 *సర్వేజనా సుఖినోభవంతు*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment