Wednesday, October 1, 2025

 *సేతు రహస్యం - 12*
🌊

రచన : గంగ శ్రీనివాస్


"కాని ఇంకో విషయం ఉంది" అన్నారు భట్టుమూర్తిగారు.

ఆయన ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూసారు.

"యోజనమంటే క్రోసుకి రెట్టింపు దూరం" అన్నారు భట్టుమూర్తిగారు.

"క్రోసుడు దూరమంటే మూడు నాలుగు కి.మీ ఉంటుంది" అన్నారు పరంధామయ్య గారు తల తడుముకుంటూ.

"మీరుండండి. అన్నీ మీకే తెలిసినట్లు మధ్యలో దూరతారు" అంది వారి సతీమణి.

“తరతరాలుగా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానం చేయటం వలన అసలు నిజం మరుగున పడిపోయింది.” అన్నారు భట్టుమూర్తిగారు. 

"అంటే, అసలు నిజం ఏమిటి" అనడిగారు పరంధామయ్యగారు.

"క్రోసు అంటే ఏమని నిర్వచించారంటే, ఒక బలమైన వ్యక్తి అర్థరాత్రి సమయంలో బిగ్గరగా అరచి చెప్పిన మాటలు స్పష్టంగా వినబడేంత దూరాన్ని క్రోసు అన్నారు. ఇక మీరే ఊహించుకోండి, క్రోసు అంటే ఎంత దూరం ఉండవచ్చో”  అన్నారు భట్టుమూర్తిగారు.

“గట్టిగా అరచి చెప్తే ఎంత దూరం వినిపిస్తుంది. రెండు మూడు వందల మీటర్ల వరకు వినిపించవచ్చు" అన్నాడు రాజేష్.

"కాని ఆ కాలంలో ఎక్కువ శక్తి కలిగి ఉండి బాగా దూరంగా వినిపించే వరకు అరచేవారేమో" అన్నాడు శ్రీధర్..

"అరచినట్లు వినిపిస్తే సరిపోదు. సీతను చూసి తిరిగి వస్తున్న హనుమంతుడు తనవారు సముద్రతీరంలో తన దృష్టికి రాగానే పెద్దగా సింహనాదం చేసాడు. అది ఒక శబ్దమే గాని మాట కాదు. కాని క్రోసు విషయానికి వస్తే మాట స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే ఇదివరకు సమాచారం అలా చెప్పుకొనేవారట." అన్నారు భట్టుమూర్తిగారు...

"అలా అయితే క్రోను అంటే అర కిలో మీటరు దూరం ఉండవచ్చు" అన్నారు పరంధామయ్యగారు..

“కరెక్ట్, నా అభిప్రాయం కూడా అదే. క్రోసు అరకిలోమీటరు అయితే, యోజనం ఒక కిలోమీటరు అవుతుంది. ఏమంటావు రాజేష్" అన్నారు భట్టుమూర్తిగారు.

భట్టుమూర్తి తన అంచనాను ఆమోదించి నందుకు మీసం మెలివేస్తు ఓరకంట భార్య వైపు చూశారు పరంధామయ్యగారు. చాల్లెండి బడాయి అన్నట్లు మూతి తిప్పుకుంది ఆవిడ.

అప్పటికే బాగా పొద్దుపోయింది. ఇంక ప్రశ్నలేవీ లేకపోవటంతో భట్టుమూర్తిగారు ఇంటికి వెళ్ళటానికి లేచారు. ఆయన వెంట నడిచిన శ్రీధర్ భట్టు మూర్తిగారిని కారెక్కించాడు. ఆకాశంలో చుక్కలు ఆనందంగా నవ్వుతున్న కన్నెపిల్లల కన్నుల్లా ఉన్నాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కార్లో కూర్చున్న భట్టుమూర్తిగారు శ్రీధర్ని దగ్గరకు పిలిచి "నాయనా పోను పోను నీకొక దేవరహస్యం తెలుస్తుంది. దానిని మారుతి నీకు తెలియజేస్తాడు" అని చెప్పారు. కారు వెళ్ళిపోయింది. శ్రీధర్ ఆరుబయట నిలబడి కారు వైపే చూస్తూ నిలుచుండిపోయాడు.
📖

*అసలైన ప్రేమ చిహ్నాం*

డా॥ సోమదేవ ఢిల్లీ యూనివర్శిటీ విసి ని కలిసి తనకు కావలసిన సహకారం అర్థించాడు. యూనివర్శిటీతో ఒక ఎమ్ ఒ యు తయారు చేసుకోవడానికి కావలసిన వివరాలు చర్చించాడు. భారతదేశ భూ భాగంలో, హిందూ మహాసముద్రంలోని భారత్ సరిహద్దులలో ఉన్న సముద్రజలాల ఆర్కియలాజికల్ త్రవ్వకాలు చేయడానికి ఒక జాయింటు ప్రాజెక్టుని ప్రతిపాదించాడు. ఈ జాయింటు ప్రాజెక్టులో ఢిల్లీ యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్, అలాగే అట్లాంటా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్ కలసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కావలసిన ఫండ్ అంతా వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ భరిస్తుంది.

ప్రాజెక్టు ముఖ్యంగా అకడెమిక్ గా ఉంటుంది. వారి పరిశోధనా వివరాలపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా పూర్తి సమాచారం ఉంటుంది. అంతేగాక ఏ ఎస్ ఐ కు యూనివర్శిటీలు చేసే పరిశోధనలో పాలు పంచుకునే హక్కు కూడా ఉంటుంది. ఎమ్ ఓ యులో పూర్తి అధికారాలు యూనివర్సిటీలకే కట్టబెట్టారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదుపాజ్ఞలు కూడా అన్వయించే లాగా రూలు పెట్టారు. ఎలా చూసిన అది ఢిల్లీ యూనివర్సిటీ, ఎఎస్ఐ కలసి చేసే ప్రాజెక్ట్ గా ఉంటుంది. అట్లాంటా యూనివర్శిటీ పాలు పంచుకుంటున్న విదేశీ యూనివర్సిటీ కాబట్టి వారికి ఎక్కువ అధికారాలు లేకుండా నిబంధనలు తయారు చేశారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
డ్రాఫ్ట్ ఎమ్ ఓ యు తయారయ్యాక దానిని మోడికి మెయిల్ చేశాడు సోమదేవ. అక్కడ వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు దానిని పరిశీలించి, అటార్నీల న్యాయపరమైన అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత మోడి తమ అంగీకారాన్ని డా॥ సోమదేవకు తెలియ చేసాడు. వారి అంగీకారం పొందాక విసితో మరొకసారి కలిసి ఎమ్ఐయు గురించి చర్చించాడు. వారిద్దరూ అంగీకారానికి వచ్చాక ఎమ్ ఒ యు సంతకం అయిపోయింది. అట్లాంటా యూనివర్సిటీ తరుపున డా॥ సోమదేవను ఆథరైజ్ చేయించాడు మోడి. అలాగే తమ తరుపున శ్రీధరు ఆథరైజ్ చేసాడు. విసి, డా॥ సోమదేవ సంతకం పెట్టాక శ్రీధర్ సంతకం కోసం పేపర్స్ ఒకరోజు వెయిట్ చేయాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి తిరిగి వచ్చాక ఎమ్ ఒ యు సంతకం పెట్టి, డా॥సోమదేవతో పాటు డైరెక్టర్ జనరల్ని కలవడానికి శ్రీధర్ కూడా వెళ్ళాడు.

డైరెక్టర్ జనరల్ ను అంతకుముందే గుప్తా ప్రిపేర్ చేసి ఉంచడం వలన ఆయనతో మీటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది. గుప్తా, డా॥సోమదేవ, విసి, శ్రీధర్లు డైరెక్టర్ జనరల్ తో సమావేశమై ఫార్మల్ గా అనుమతులను అభ్యర్థిస్తూ తమ లెటర్స్ అందించారు. దానితో పాటు ఎమ్ ఒ యు కూడా ఆయనకు ఇచ్చి దాని వివరాలను చెప్పారు.

డైరెక్టర్ జనరల్ చాలా సానుకూలంగా స్పందించాడు. కావలసిన అనుమతులు శీఘ్రంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు. గుప్తా కూడా అదే పనిలో ఉంటానని హామి ఇచ్చాడు..

శ్రీధర్ తాను ఎక్సకవేషన్ టీమ్స్ ని తయారు చేసే ప్రయత్నంలో పూర్తిగా బిజిగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు రాజమండ్రిలో భట్టు మూర్తిగారు చెప్పిన వివరాలు అతని మస్తిష్కాన్ని మధిస్తూనే ఉన్నాయి. ఆయన సూచించిన దేవ రహస్యం తనకు ఎలా, ఎప్పుడు ప్రకటించ
బడుతుందో అర్ధంకాక చాలా చికాకు కలుగుతుండేది. కేట్ తో మాట్లాడి తన సమస్యను చెప్పుకుందామంటే తను ఈ మధ్య రాజేష్ తో ఎక్కువగా బిజీగా మాట్లాడుతుంది. చేతిలో ఇంగ్లీషు రామాయణం పట్టుకొని అది చదువుతూనే కనిపిస్తుంది ఎప్పుడూ. తను వెళ్ళినప్పుడ ల్లా పుస్తకం పక్కన పెట్టి హాయిగా నవ్వుతుంది. తనతో పాటు ఆలోచించి తన సమస్యను అర్థంచేసుకొని పరిష్కార మార్గాలను సూచిస్తుందనే ఆలోచన పేరాశగా మిగిలింది శ్రీధర్ కి.
📖

డా|| సోమదేవ, గుప్తాను వదలకుండా కలు స్తున్నాడు. దాదాపుగా ప్రతిరోజు అతనిని కలసి, డిన్నర్లకు తీసుకెళ్తూ, డైరెక్టర్ జనరల్ ను మంచి చేసుకుంటూ..తన లాబీయింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.

రాజేష్ శ్రీధర్ కి కేట్ కి కావలసిన సహకారం ఇస్తూ జాలీగా ఉన్నాడు. తాను కేట్ తో ఎక్కువ మాట్లాడటం శ్రీధర్ కి నచ్చటం లేదనే విషయం గ్రహించినా దానిని పెద్దగా పట్టించుకోలేదు. తను మాత్రం అందరి తోనూ మామూలుగానే ఉన్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కేట్ రాజేష్ ను తనకు రామాయణంలో వచ్చిన ప్రతి సందేహాన్ని వివరించమని అడిగేది. ఆమెకు రామాయణంలోని అన్ని రసాలు అద్భుతంగా తోచాయి. కేట్ కి రామాయణం గురించి తెలసుకోవడం అదే మొదటిసారి. అయినా ఆ కావ్యం తనకు సుపరిచితమన్నట్లు చదువుతున్న విషయాలు అంతకుముందే ఒకసారి చదివినట్లు అనిపిస్తుండేది ఆమెకు.

రాముడు సీత కోసం పరితపిస్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగేది. విరహ వేదనను అనుభవిస్తూ శ్రీరాముడు చెట్లని పుట్లని సీత జాడ చెప్పమని వేడుకుంటూ ఉంటే ఆమె కళ్ళు సుజలాలయ్యేవి. తన ప్రేయసి గురించి అంతలా విలపించే మగవాడు ఉంటాడా అని ఆమెకు సందేహం కలిగేది. సీతారాములు ఎలా కలుసుకొంటారో అనే ఉత్కంఠతో ఆమెకు రామాయణం చదవటమే ఒక ముఖ్యమైన పనిగా మారింది.

గ్రీన్ గ్రూప్స్ సభ్యులు ఆమెను కలుసుకొని ప్రజలను చైతన్యపరచడానికి వారు తయారు చేసిన కార్యక్రమాల బ్లూప్రింట్స్ చూపిస్తూంటే ఆమె ఒక కామెంట్ చేసింది.

"తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా ప్రపంచమంతటా పేరు పొందింది. ఈమధ్య ప్రపంచపు ఏడు వింతలలో ఒకటిగా అందరూ ఎన్నుకొన్నారు కూడా, కాని రామాయణం చదివితే నాకు అంతకంటే ముఖ్యమైన నిర్వచనం లభించింది. నిజమైన ప్రేమకు అపురూపమైన నిర్మాణం సీతను అందుకోవటానికి రాముడు నిర్మించిన సేతువు. అందుకే రామసేతువు ని గొప్ప ప్రేమ చిహ్నంగా అందరూ ప్రచారం చేయాలి".

"యుగయుగాలగా ఏక పత్నీవ్రతం పాటించిన శ్రీరాముడే ప్రేమకు అసలైన నిర్వచనం. రామ సేతువే ప్రేమచిహ్నం".

“ఈ కాన్సెప్ట్ ను ఎలా డెవలప్ చేయాలో అందరూ ఆలోచించండి. రామసేతువు ప్రేమ చిహ్నంగా అన్ని మతాలకు అతీతంగా యువతీ యువకులు అందరూ భావించేలా ఏదైనా కొత్తగా చేయండి" అని మాట్లాడింది.

ఆమె మాటలు విన్న గ్రీన్ గ్రూప్ సభ్యులు చిత్తరువులయిపోయారు. వేరే దేశం నుంచి వచ్చినా భారతీయ సంస్కృతి పట్ల అద్భుతమైన తాదాత్మ్యతను ప్రదర్శిస్తున్న కేట్ ను అభినందిస్తు అందరూ లేచి చప్పట్లు కొట్టారు.

వారితో పాటు రాజేష్, సోమదేవలు కూడా ఉన్నారు. శ్రీధర్ కేట్ కి దగ్గరగా వచ్చి “ఎంత బాగా చెప్పావు కేట్ నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను” అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. మృదువుగా అతని చేతని నొక్కి తన చేతిని వెనుకకు తీసుకొని అందరికి ప్రణామం చేసింది కేట్.

"ఈ స్పూర్తి నాకిచ్చినది ఈ రామాయణ గ్రంథమే. రామకథ చదివితే నిజంగా మనసు ప్రశాంతమవుతుంది. మనిషి మహాత్ముడవుతాడు" అంది కేట్.
🌊
*సశేషం*
 ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment