Saturday, October 18, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-177.
186d3;1710e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣7️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                     *భగవద్గీత*
                    ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
 *శ్రీ భగవాన్ ఉవాచ:* 

*40. వ శ్లోకము:*

*పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।*
*న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ॥40॥*

”ఓ అర్జునా! పూర్తిగా సిద్ధి పొందకుండా, ఏ కారణం చేతనైనా, మధ్యలో యోగము అభ్యాసం చేయడం విరమించిన వారిని యోగభ్రష్టులు అని అంటారు. అటుంటి వారికి ఎటువంటి వినాశము అంటే నష్టము ఉండదు, మంచి పనులు చేసే వాడికి ఎప్పుడు కూడా దుర్గతి కలుగదు.”
```
అర్జునుడు అడిగిన రెండు ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యానయోగం చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం. యోగాభ్యాసము, ధ్యానము చేసే వారు మద్యలో జారి పోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలామందికి ఒక సందేహం. ఏదైనా వ్రతం కానీ, పుణ్యకార్యం కానీ, ధ్యానం కానీ మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతుంటారు. (ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, దేవుడి మీద భక్తితో చేయాలి కానీ, భయంతో కాదు).

అటువంటిది ఏమీలేదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అతడికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావము మనం ఎటువంటి పుణ్యకార్యము చేసినా దానికి తగిన ఫలం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది. అంతేకానీ ఎటువంటి చెడు ఫలితము రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది కానీ ఎటువంటి దుర్గతి కలుగదు. ఈ శ్లోకంలో కల్యాణ కృత్ అని వాడారు. అంటే మంచి పనులు. కల్యాణమైన పనులు. లోకకల్యాణము అని వాడుతూ ఉంటారు. అంటే లోకానికి మంచి చేయడం. ఇతరులకు సాయ పడటం, శాస్త్రములను చదివి ఇతరులకు బోధించడం. సమాజ సేవ చేయడం. ఉన్నదాంట్లో ఇతరులకు సాయపడటం, సాటి వారిని బాధ, హింస పెట్టకుండా, ఇతరుల క్షేమమును కోరుకోవడం. ఇవి మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంతఫలం మన కాతాకు చేరుతుంది. దానికి తగ్గఫలం ఈ లోకంలో కానీ పరలోకంలో గానీ లభిస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానం.

ఇందులో మరొక అర్థం అంతర్గతంగా దాగి ఉంది. ఎటువంటి పుణ్యకార్యములు, ధ్యానము చేయని వారికి దుర్గతులు కలుగుతాయి. వారు చేసిన పాపపు పనులకు తగిన ఫలం అనుభవిస్తారు అని భావార్ధము. పాపం చేసే వారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం ఈ జన్మలో కానీ మరుజన్మలో కానీ దక్కినట్టే, ఎంత చిన్న పాపం చేసినా దాని ఫలితం ఎప్పుడైనా అనుభవించక తప్పదు.

ఈ జన్మలో ఎవరికైనా అన్నదానం చేస్తే దానికి ఫలితం అంటే ఆ దానం చేసిన వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు, దిక్కుతోచనప్పుడు, దైవం మానుష రూపంలో వచ్చి ఆదుకుంటాడు. ఇది నా స్వానుభవం అంటే నేను స్వయంగా అనుభవించిన విషయం.```


*41. వ శ్లోకము:*

*ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।*
*శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥41 ॥*


“యోగభ్రష్టుడు అయిన వాడు ముందు పుణ్యలోకములను పొందుతాడు. పుణ్యలోకములలో చాలా కాలం నివసించిన తరువాత మరుజన్మలో శుచిమంతులు, శ్రీమంతులు అయిన వారి గృహంలో జన్మిస్తారు. అంటే మంచి జన్మలభిస్తుంది.”
```
తరువాత అర్జునుడి రెండవ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ 
ఈ విధంగా అన్నాడు. యోగమును కొంత కాలము చేసి, ఏదో కారణము చేత మాని వేసిన వాడు అంటే యోగము నుండి దిగజారిన వాడు, సరిగా యోగం పూర్తి చేయలేకపోయిన వాడు, మధ్యలో మరణం సంభవించిన వాడు, తాను ముందు జన్మలో ఎంత పుణ్యం చేసాడో అంత పుణ్యమునకు సరిపడా పుణ్యలోకాలను పొందుతాడు. అక్కడ చాలా కాలం ఉంటాడు. తాను చేసిన పుణ్యములకు తగిన సుఖములను అనుభవిస్తాడు. తరువాత మరుజన్మలో ఆచార పరులు, శుచిమంతులు అంటే సంస్కారవంతులు, పుష్కలంగా ధనం ఉన్న వారు, అయిన పుణ్యాత్ముల ఇంట్లో జన్మించి తను పూర్వజన్మలో విడిచిపెట్టిన యోగమును కొనసాగిస్తాడు. తాను చేయబోయే యోగమునకు అడ్డంకులైన దారిద్య్రము, ఈతిబాధలు, వ్యాధులు మొదలగు బాధలు లేకుండా నిరాటంకంగా తన యోగమును కొనసాగిస్తాడు.

ఇక్కడ శ్రీమంతుల ఇల్లు అంటే వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు అని కాదు, తినడానికి తిండికి లోటు లేకుండా, అవసరానికి మించి ధన సంపాదన చేయని ఇల్లు ఉన్నదానితో తృప్తిగా జీవించే వాళ్లు ఉన్న గృహము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిన ధనం ఉన్నా అతడు తన ధ్యానమును కొనసాగించలేడు. భోగలాలసలో పడిపోతాడు. అన్ని మరిచి పోతాడు. కాని ఈ యోగభ్రష్టుడు, క్రితం జన్మలో కొంత వరకు ధ్యానము మొదలగు యోగములను సాధన చేసాడు కాబట్టి భోగలాలసత్వమునకు బానిస కాకుండా, పరమాత్మవైపు తన దృష్టిని మళ్లిస్తాడు. కాబట్టి యోగభ్రష్టునకు సద్గతులే లభిస్తాయి.

ఈ శ్లోకంలో ‘శుచీనామ్, శ్రీమతామ్’ అనే పదాలు వాడారు. ఆచారవంతులు, శ్రీమంతులు అయిన గృహంలో పుడతాడు. కొంత మంది సదాచార సంపన్నులు అయి ఉంటారు. కాని దారిద్యంతో బాధపడుతుంటారు. అటువంటి ఇంట్లో జన్మిస్తే సాధకుడు తన సాధన కొనసాగించలేడు. అలాగే ధనం ఉండీ, సదాచారం లేకపోతే, అన్నిరకములైన చెడు అలవాట్లకు బానిసై ఇదివరకు చేసిన సాధన కూడా ఆవిరై పోతుంది. అందుకే శ్రీమంతులు, సదాచారసంపన్నుల గృహంలో పుడతారు అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. కాబట్టి మనం ఎంతో సాధన చేసి, మధ్యలో ఆపినా, మరలా కొనసాగించినా, మధ్యలో మరణించినా, చేసిన సాధన వృధా పోదు. చేసినంత వరకు పుణ్యలోకాలు లభిస్తాయి. తరువాతి మంచి జన్మ లభిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడు ధ్యానము చేయడం, వేదములు, శాస్త్రములు చదవడం, జ్ఞానం సంపాదించడం, నిష్కామ కర్మ, కర్తృత్వభావన లేని కర్మలు చేయడం మొదలగు యోగములను శ్రద్ధతో, భక్తితో నిరంతరం చేస్తూ ఉండాలి. మనం ఆచరించిన యోగము ఎన్నటికీ వృథా కాదు. ఇది పరమాత్మ మనకు ఇచ్చిన అభయం.✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
            🌷🙏🌷

No comments:

Post a Comment