Saturday, October 18, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-178.
196d3;1810e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣8️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                 *భగవద్గీత*
                 ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*42. వ శ్లోకము:*

*”అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।*
*ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ “ ॥ 42 ॥*

“పైన చెప్పిన వారే కాకుండా, ఇంకా ఎక్కువ యోగం చేసిన వారు, ఉత్తమ తరగతి యోగులు అయిన వాళ్లు, అర్ధాంతరంగా మరణిస్తే, అటువంటి వారు, వారి వారి పుణ్యఫలములను బట్టి, సంస్కారవంతులు, ధనవంతులు, శుచిమంతులు అయిన గృహాలలోనే కాదు, మంచి యోగము చేసిన వారు, జ్ఞానవంతులు, అయిన గృహములలో కూడా జన్మిస్తారు. కాని అటువంటి గృహములలో పుట్టడం చాలా కష్టం.”
```
ఇప్పటి దాకా పరమాత్మ 
యోగము నుండి జారిన వాళ్ల గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో ఎవరైతే ప్రాపంచిక విషయముల వంక చూడకుండా, బాగా సాధన చేసి, సాధన పూర్తి కాకుండా మరణించిన వాళ్ల గురించి చెబుతున్నాడు. అటువంటి వారు ధీమంతులు, యోగులు పుట్టిన కులంలో జన్మిస్తారు. అటువంటిజన్మ సామాన్యులకు చాలా కష్టము. ఇటువంటి జన్మ సులభంగా లభించదు. యోగులు, జ్ఞానుల ఇంట్లో పుట్టడం చాలా అరుదుగా లభిస్తుంది. ఇటువంటి గృహములలో ధనమునకు ప్రాధాన్యత ఉండదు. అటువంటి వారు ధనమును ఐశ్వర్యమును లెక్కచేయరు. వారి జ్ఞానమే వారికి ధనము, శుచి శుభ్రత సంస్కారము వారికి పుట్టుక నుండే అబ్బుతాయి. కాబట్టి, అటువంటి వారి ఇంట్లో జన్మించి యోగులు తమ సాధన కొనసాగిస్తారు.

అంటే ఈ జన్మలో నూటికి 80 మార్కులు తెచ్చుకొని మరుజన్మలో మిగిలిన 20 కొరకు ఇంప్రూవ్ మెంట్ రాస్తారనమాట. ఆ ఇంట్లో వారికి వంశపారంపర్య సంస్కారము, అనుభవము లభిస్తుంది. మంచి మార్గదర్శకత్వము దొరుకుతుంది. పుట్టుక నుండి జ్ఞాన, వైరాగ్యములు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజూ దేవతార్చన, దీపారాధన, సంధ్యావందనము జరుగుతాయి కాబట్టి వాటికి అలవాటు పడతాడు. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మ విచారణ, యోగసాధన, నియమ నిష్టలు, మంచి గ్రంథములు చదవడం అబ్బుతాయి. కాబట్టి క్రితం జన్మలో ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడినుండి సాధన మొదలుపెడతాడు.

లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు. సంస్కారవంతులుగా పుట్టడమే గొప్ప. ధీమంతులు అయిన యోగుల జన్మ గొప్పది. అది సామాన్యులకు లభ్యం కాదు. అటువంటి జన్మ చాలా అరుదు అని ఎందుకు అన్నారంటే, లోకంలో జ్ఞానులు ఉండటమే అరుదు. జ్ఞానులు అయిన వాళ్లు సాధారణంగా గృహస్థాశ్రమము స్వీకరించరు. యోగులలో గృహస్థాశ్రమము స్వీకరించే వాళ్లు చాలా అరుదు. కాబట్టి అటువంటి యోగుల గృహములలో పుట్టడం చాలా చాలా అరుదు. కష్టము. అందుకే "ఏ తద్ది దుర్లభతరం" అని వాడారు వ్యాసుల వారు.```


*43. వ శ్లోకము:*

*”తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।”*
*యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ॥ 43 ॥”*

“పూర్వజన్మలో యోగమును పూర్తిగా అభ్యసించకుండా, ఏ కొంచెమో మిగిలిపోతే, తిరిగి మరుజన్మలో యోగుల ఇంట్లో జన్మించిన వాడు, తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగమును కొనసాగిస్తాడు. 
ఆ ప్రకారంగా అతడు మోక్షమును పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు.
```
ముందు జన్మలో యోగమును అభ్యసించి మధ్యలో మరణించిన వారు మరుజన్మలో శుచి మంతులు, శ్రీమంతులు, జ్ఞానవంతులు, యోగులు అయిన వారి గృహములలో పుడతారు. అని చెప్పిన తరువాత, అలా పుట్టిన వారు ఏం చేస్తారు. మరలా ఒకటో క్లాసు నుండి మొదలు పెడతారా! లేక చదువు ఎక్కడ ఆపారో అక్కడి నుండి మొదలు పెడతారా! అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు పరమాత్మ.

ఓ అర్జునా! మధ్యలో యోగాభ్యాసము ఆపిన యోగి మరుజన్మలో శ్రీమంతులు, శుచిమంతులు, జ్ఞానులు, యోగుల ఇంట్లోపుడతాడు అని చెప్పాము కదా. అటువంటి జన్మపొందిన తరువాత, అతడు, కిందటి జన్మలో, తాను ఎక్కడ యోగాధ్యానము ఆపాడో అక్కడి నుండి మొదలుపెడతాడు. ఎందుకంటే అతని వెంట అతని వాసనలు అంటే బుద్ధి, సంస్కారము అతని వెంటే వస్తాయి. అంతకు ముందు జన్మలో ధ్యానం అభ్యాసము చేసాడు కాబట్టి మరు జన్మలో కూడా అదే ధ్యానము కొనసాగిస్తాడు. జ్ఞాన సిద్ధికి, యోగం సంపూర్ణంగా సిద్ధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సంసిద్ధౌ అని వాడారు. సంసిద్ధుడు అవుతాడు. యోగుల వంశంలో జన్మించడం వలన అతని చుట్టు ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.

కాబట్టి మనం ఈ జన్మలోనే ధ్యాన యోగము అవలంబించాలి. ఎంత వరకు చేయగలమో అంతవరకు అభ్యాసము చేయాలి. ఆ అభ్యాసము మరు జన్మకు క్యారీ ఫార్వర్డు అవుతుంది. మంచి జన్మ లభిస్తుంది. ఆధ్యాత్మిక బుద్ధి పుడుతుంది. మనం ధరించినది స్థూల దేహము అయితే మనలో ఉన్న మనోబుద్ధి అహంకారములు సూక్ష్మదేహము. మనం చేసే పాపపుణ్యాలు ఈ సూక్ష్మదేహమును అంటి పెట్టుకొని ఉంటాయి. స్థూల దేహము మరణించిన తరువాత, ఈ సూక్ష్మదేహం, ఆ జన్మలవాసనలను తనతో కూడా అంటి పెట్టుకొని వెళుతుంది. మరుజన్మలో తన అభ్యాసమును కొనసాగిస్తుంది అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు.

కాబట్టి మనము మరణించిన తరువాత మనతోబాటు వచ్చేవి మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యముల ఫలములు, పాపం చేస్తే ఆ పాపఫలములు. అంతేకానీ, మనం సంపాదించిన ధనం, ఆస్తులు, బంధుమిత్రులు మన వెంట రారు. అన్నదమ్ములు, సంతానము, బంధువులు మనం సంపాదించిన ధనం, ఆస్తి కోసం కొట్లాడుకుంటారే కానీ, మన గురించి పట్టించుకోరు. మరణించిన తరువాత, అప్పటి వరకు సంపాదించిన ధనం బాంకులో కానీ, అటక మీద బస్తాలలో కానీ మూలుగుతుంటుంది. పొలాలు, ఇళ్లస్థలాలు, ఇళ్లు ఉన్నచోటనే ఉంటాయి. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు. తరువాత చేయాల్సింది ఒంటరి ప్రయాణం. అప్పుడు సూక్ష్మ రూపంలో అంటే వాసనల రూపంలో మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యం లేక పాపం.

కాబట్టి ప్రతి వాడూ బంధువుల మీద, ఆస్తి, ధనము మీద మమకారం తగ్గించుకోవాలి. ఈ ప్రపంచమే సర్వస్వము, సుఖమయము అనే అజ్ఞానమును వదిలిపెట్టి నేను వేరు ఈ దేహము వేరు అనే భావన కలిగి ఉండాలి. ఆత్మను గురించిన జ్ఞానమును పెంపొందించుకోవాలి. ధ్యానము, భగవన్నామస్మరణ, శాస్త్ర పఠనము చేయాలి. పరోపకారము చేయాలి. సమాజసేవ చేయాలి. మనం ఎంత చేస్తే అంత పుణ్యము మనకు వస్తుంది. అది మరుజన్మకు కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అంతా చేయగలమా లేదా అనే సంశయం వదిలిపెట్టి, చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రతి మానవుని కర్తవ్యం.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏

No comments:

Post a Comment