వాగ్దేవికి వందనం
సరస్వతీ దేవి విద్యాధిదేవత. చదువుల తల్లి. విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు. మనిషి రెండు కళ్లతో ప్రపంచాన్ని చూడగలిగితే, 'విద్య' అనే మూడో కంటితో లోకంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ముందుకెళ్లాలన్నదే దానికి అర్థం. సరస్వతిని జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవతగా కొలుస్తారు. జ్ఞానం, వివేకం ఈ రెండిం టినీ అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష, భగవతి, భారతి ఇత్యాది పేర్లతో పిలుచు కుంటాం. విద్యాప్రదాత్రి అయిన ఆమె అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తిలోనూ జ్ఞానదీపం వెలగదు. ఆమె కృపకు పాత్రులైనవారు మాత్రమే ఆ అవకాశాన్ని అందుకోగలరు. విద్య, విజ్ఞానం, వివేకం ఈ మూడింటి వికాసానికి అమ్మ దయ అవసరం. వీణాపాణి, పుస్తకధారిణి అయిన వాణిని భక్తి ప్రపత్తులతో కొలిచే వారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నాడు. అక్షరమ్ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసుగా తీర్చిదిద్దింది ఆ జ్ఞాన స్వరూపిణి. 'ప్రణోదేవీ సరస్వతీ... అంటూ విద్యాధిదేవతను కీర్తించింది రుగ్వేదం. ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం. అంతేకాదు, వేదం- వాగ్దేవిని అన్నప్రదా యినిగా అభివర్ణిస్తూ ధనదాయినిగా కూడా కీర్తించింది. చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారిచూపుతుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. నీరు జీవశక్తికి సంకేతం. సర్వ జీవ రాశికీ ప్రాణాధారం. ఇలా జల రూపంతో సైతం సరస్వతీదేవి మానవాళి మనుగడకు ఆధారమవుతూ నదీమ తల్లిగా నమస్కారాలు అందుకుంటోంది.. పూజాదికాలలో కలశపూజ చేసేటప్పుడు సరస్వతీ నది పేరును ఉచ్చరించడం తెలిసిందే.
మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి అని పూజించుకునే ముగ్గురమ్మల్లో సరస్వతీ దేవి బాలచంద్రుణ్ని సిగలో పూవుగా ధరించి ఉంటుంది. తక్కిన దేవతల్లాగ ఈమె చేతిలో ఏ ఆయుధమూ ఉండదు. బ్రహ్మవైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు నాయి కగా పేర్కొని సర్వశుక్లాం, శుద్ద రూపాం అని స్తుతించింది. ధవళమూర్తిగా మందస్మిత వదనంతో పద్మంపై ఆశీనురాలై ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంటుంది.
బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలూ నాలుగు వేదాలు. వేదాలకు జీవం వాక్కు. ఆ వాక్కే బ్రహ్మముఖంలో నివసించే భారతి అని శాస్త్రవచనం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సరస్వతీ దేవి నిలయాలు. ఆమె వాహనం హంస. జగత్తులో విజ్ఞాన సత్తును ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంస ధర్మం కలవాడవుతాడ న్నది జ్ఞానుల వివరణ. విద్యార్థులు అందరూ ఆ తల్లికి శరణాగతులై ఉండాలి. ఏ ఇంట వాగ్దేవిని పూజిస్తారో ఆ ఇల్లు సిరిసంపదలకు, శాంతికి నిలయమవుతుంది. అందుకే 'విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే!' అని మనసారా ప్రార్థిద్దాం. ఆ తల్లి ఆశీస్సులు పొందుదాం.
యం.సి.శివశంకరశాస్త్రి
No comments:
Post a Comment