5️⃣5️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*అర్జున ఉవాచ:*
*1. జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దనl*
*తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవll*
ఓ కేశవా! నీవు చెప్పిన దానిని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనేది నీ మతం అని తెలుసుకున్నాను. అలాగైతే నన్ను ఈ భయంకరమైన, హింసతో కూడిన, సర్వనాశన హేతువైన, ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? అని అడిగాడు అర్జునుడు.
ఇప్పటి దాకా పరమాత్మ జ్ఞాన యోగం గురించి చెప్పాడు. అదే మంచిది అని అభిప్రాయపడ్డాడు. కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు నియోగిస్తున్నాడు అని అర్జునుని సందేహము.
అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేస్తాడు అని అనుకోలేదు కృష్ణుడు. ఇప్పటి దాకా కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వము, జ్ఞానబోధ గురించి చెబుతూ, అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పాడు. అంటే అటు ఇటు జ్ఞానము మధ్యలో కర్మ గురించి చెప్పాడు. అర్జునుడికి కాస్త అర్థం అయి ఉంటుంది అని అనుకొని కొంచెం ఊపిరి తీసుకుందాము అని అనుకునే లోపల అర్జునుడు బాణం లాంటి ప్రశ్న సంధించాడు. కృష్ణుడు ఇంత విశధంగా, వివరంగా, చెప్పినా అర్జునుడికి ఇటువంటి సందేహం తలెత్తింది అంటే అర్జునుడు సరిగా వినలేదు. ఒకవేళ విన్నా దానిని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకోవచ్చు. లేకపోతే కృష్ణుడు చెప్పిన కర్మ సంబంధమైన విషయాలు అర్జునుడికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడెప్పుడు యుద్ధం చేయడం మానేద్దామా అని ఆలోచిస్తున్నాడు. అటువంటప్పుడు యుద్ధం చెయ్యి అన్న కృష్ణుడి మాటలు అర్జునుడి చెవికి ఎక్కలేదు. అందుకని జ్ఞాన యోగమును, కర్మను ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు.
రెండు వస్తువులను పోల్చాలంటే ఆ రెండు వస్తువులు సమాన ధర్మములు కలిగి ఉండాలి. ఇక్కడ జ్ఞానము వేరు కర్మ వేరు. కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలను ఆచరించడం జ్ఞానం సంపాదించడానికి తొలిమెట్టు. ఇది సరిగా అర్ధం చేసుకోలేదు అర్జునుడు
జనార్ధనా! అంటే సమస్త జనులు తమ కోరికలు తీరడానికి ఎవరిని ఆశ్రయిస్తారో, యాచిస్తారో, ప్రార్థిస్తారో, అతనే జనార్దనుడు.
రెండవ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి అద్భుతంగా చెప్పాడు. స్థితప్రజ్ఞుడి గురించి కూడా చెప్పాడు అటువంటి వాడు తుదకు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అనికూడా అన్నాడు. అంతే కాదు జ్ఞానం కలిగి ఉండటమే అన్ని దుఃఖములకు అంతము అనీ, జ్ఞానం ఉంటే దుఃఖము ఉండదు అనీ, జ్ఞానమే అన్ని దుఃఖములకు పరిష్కారము అనీ, అన్నాడు. మధ్యలో ఒక సారి కర్మను గురించి కర్మ నిష్టను గురించి చెప్పాడు. అంటే ఈ కర్మ యోగము మధ్యలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా అనే సందేహం కలిగింది అర్జునుడికి. ఎటూ యుద్ధం చేయడం అర్జునుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాకుతో తప్పించుకోవచ్చని ఈ ప్రశ్న అడిగాడు.
కృష్ణా! నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒక పక్క జ్ఞానం అన్నిటి కన్నా గొప్పది అని చెప్పి మరలా ఈ పాపపు కర్మ అయిన యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు. ఇదేం బాగాలేదు అని అన్నాడు. నిజానికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాని అర్జునుడి మనసులో యుద్ధం వలన అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి యుద్ధం మానెయ్యాలని ఉంది. అందుకే తనకు అనుకూలమైన జ్ఞానయోగం మాత్రమే తీసుకున్నాడు. అందుకనే ఈ ప్రశ్నవేసాడు.
కృష్ణుడు చెప్పింది ఏమిటంటే జ్ఞానయోగం పొందడానికి కర్మయోగము ఒక సాధనము అని చెప్పాడు కానీ ఒకదానితో ఒకటి పోల్చలేదు. ఇక్కడ అర్జునుడు జ్ఞాన యోగము కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. అదీ అర్జునుడు చేస్తున్న పొరపాటు. ఒక వస్తువు మరొక వస్తువును కంపేర్ చెయ్యాలంటే రెండు వస్తువులకు కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఇక్కడ జ్ఞానం వేరు కర్మ వేరు. ఎలా పోలుస్తాడు. అది అర్జునుడికి అర్థం కాలేదు. కృష్ణుడు చెప్పింది ఏమిటంటే... 'బాబూ ముందు నువ్వు నిష్కామ కర్మ చేయడం అలవాటు చేసుకో దానితో మనస్సు, ఇంద్రియములు నీ అధీనంలో ఉంటాయి. చిత్త శుద్ధి వస్తుంది. తరువాత జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి అవుతావు' అని చెప్పాడు. ఇది అర్థం కాక అర్జునుడు ఈ సందేహం లేవదీసాడు.
ఈ లక్షణం మనలో చాలా మందికి ఉంది. అర్జునుడు రెండింటినీ ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు. ఉదాహరణకు చెయ్యి కడుక్కొని భోజనం చేయి అన్నామనుకోండి. చెయ్యికడుక్కోవడం, భోజనం చేయడం ఒకటి కాదు. రెండింటినీ ఒకదానితో ఒకలి పోల్చకూడదు. చెయ్యి కడుక్కుంటే చేతులు శుభ్రపడతాయి. అప్పుడు భోజనం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే కర్మల వలన మనసు నిర్మలం అవుతుంది. అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత వస్తుంది. ఇదీ కృష్ణుడు చెప్పింది. ఇది సరిగా అర్ధం చేసుకోలేని అర్జునుడు ఈ సందేహము లేవనెత్తాడు.
సాధారణంగా మనము మన మనసుకు ఏది నచ్చుతుందో దానినే వింటాము. దానిని మనకు అన్వయంచుకుంటాము. ఇతరములు మంచివి అయినా వాటి గురించి పట్టించుకోము. అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అన్నిటినీ సమబుద్ధితో స్వీకరించాలి. అని అంటారు. మనకు అనుకూలమైన మాటలు విని, దానికి మన అరకొర జ్ఞానమును జోడించి దానిని మనకు అన్వయించుకుంటే అది దుష్పరిణామాలకు దారి తీస్తుంది.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P142
No comments:
Post a Comment