Wednesday, October 1, 2025

 శ్రీ దుర్గా నమోస్తుతే!

అంతటా విస్తరించిన శక్తి తత్వాన్ని జగన్మాత ఆకృతిలో దర్శించి, ఆరాధించే సాధనా సంవిధానాలు- దేవి శరన్నవరాత్రులు. జడత్వాన్ని వీడి చేతనత్వాన్ని సంతరించుకో వాలి. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞాన వీచికల దిశగా పురోగమించాలి. కర్తవ్య దీక్షతో కార్యోన్ముఖులు కావాలి- అనే చైతన్య స్ఫూర్తిని నవరాత్రులు అందిస్తాయి. సమస్త శక్తుల సమన్వయ రూపిణిగా దుర్గాదేవి వర్ధిల్లుతోందని దేవీ భాగవతం పేర్కొంది దుర్వికారాలను ఉపశమింపజేసి, దుర్గతులను రూపుమాపే మాతృశక్తి- దుర్గ. మహాదే వుడి అమేయ శక్తి స్వరూపమే దుర్గ. ప్రతికూల భావాలను, వ్యతిరేక ధోరణులను నివారించి సానుకూల, సౌజన్యయుత అంశాలను దుర్గాశక్తి పెంపొందిస్తుంది. మంత్ర, తంత్ర, యంత్ర సమ్మిళితమైన లోకశుభంకరి- దుర్గా మహేశ్వరి!

దుర్గ, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాలు- పంచ ప్రకృతి శక్తులు. ఈ అయి దింటికి మూలకారక శక్తి దుర్గ. సకల సృష్టిలోని తేజస్సు ఆమెను ఆశ్రయించి ఉంటుం దని దుర్గాసూక్తం ప్రస్తుతించింది. అందుకే తనను సర్వప్రకాశ స్పూర్తిగా పేర్కొంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండంలో చైతన్యాన్ని దుర్గాంశగా సంభావిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మక శక్తులకు ఆలంబనగా ఆద్యశక్తి దుర్గాదేవి అలరారుతోంది. జ్ఞాన దీప్తికి సంకేత మైన వేదాలను దుర్గమాసురుడు అపహరిం చాడు. దుర్గముణ్ని సంహరించి, వేదాలను పున రుద్దరించడానికి త్రిమూర్తుల దివ్య యశస్సుతో విజయ విలాసినిగా దుర్గ సాకారమైంది. అజ్ఞా నాంధకారానికి ప్రతిబింబమైన దుర్గముడి అంతంతో, లోకంలో విజ్ఞాన కాంతులు ప్రసరిం చాయి. జీవులకు శక్తిని అందిస్తూ, వాటిని పోషిస్తూ జీవోద్దరణ చేసే మహాదేవి, దుర్గాష్టమి నాడు జగదంబగా అవతరించింది.
లోకంలో జీవత్వాన్ని, జాగృతిని నిలువరించి, జడత్వాన్ని పెంపొందించాలని అసురగణం ప్రయత్నించినప్పుడు కాలాత్మికగా, శతాక్షిగా శ్రీమాత ఆవిర్భవించింది. విశ్వ చక్రాన్ని పురోగ మింప చేయడానికి విశ్వేశ్వరిగా వ్యక్తమైంది.

'వాంçసమధికం'- అని దుర్గాదేవిని సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకరులు కీర్తిం చారు. కోరిన దానికన్నా అధికంగా వరాల సిరులను అనుగ్రహించే కల్పవల్లి- శ్రీ దుర్గ.

ప్రాణమయి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే దుర్గా నామాలకు ప్రతీకాత్మకమైన, ప్రాకృ తికపరమైన సంకేతం- బతుకమ్మ! ప్రకృతిలోని సాఫల్యతకు, సజీవత్వానికి బతుకమ్మ అద్దంపడుతుంది. ప్రాణులలోని జీవశక్తిని బతుకమ్మగా జానపదులు దర్శిస్తారు. పూల పొదరిళ్లలో పుష్ప సౌందర్యంతో బతుకమ్మ పరిమళిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు తన్మయభరితంగా ఆటపాట లతో మహిళలు బతుకమ్మను ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో నిర్వహించే శ్రీ చక్రా ర్చనకు మరో రూపమే బతుకమ్మ. చైతన్య కుసుమప్రియగా భాసిల్లే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరిట ఈ సంబురాల్లో చివరి రోజు కనువిందు చేస్తుంది. చద్ది అంటే చలువ, శీతలత్వం, క్షేమంకర భావన. పూలపుంతగా, తీరొక్క పువ్వుల దొంతరగా గోచ రమయ్యే చద్దుల బతుకమ్మ, సస్యకారక శక్తిగా ప్రకటితమవుతుంది. సమష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి, సామరస్య జీవన సంవిధానానికి ప్రతీక- బతుకమ్మ వేడుక!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్

No comments:

Post a Comment