*****
*అనుమానం మొగుడు*
===============
(క్రైమ్ స్టోరీ)
(నేను రాసిన ఈ కథ సహరి అంతర్జాల వారపత్రిక నిర్వహించిన క్రైం కథల పోటీలో తృతీయ బహుమతి పొంది, ది 02.08.2024న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
ఉదయం స్టేషన్ కు వచ్చిన ఇనస్పెక్టర్ స్వరూపరాణికి , రాత్రి చిత్రాడలో ఓ మధ్య వయస్కుని హత్య జరిగింది అన్న విషయం తెలియగానే, తన సిబ్బందితో ఆ ఘటనాస్థలానికి బయలుదేరింది.
***** ***** ***** *****
అక్కడికి చేరుకున్న ఎస్సై స్వరూపరాణి ఆ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించసాగింది.
రెండు గదుల ఆ పాతకాలపు పెంకుటింట్లో మొదటి గదిలో పడి ఉంది సుమారు ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి మృతదేహం. అతని కడుపులో, మరణానికి కారణమైన పదునైన కత్తి దిగబడిఉంది. ఆ గది అంతా ఎవరో కడిగేసినట్టు శుభ్రంగా ఉంది. కొంచెం దూరంలో ఓ ముప్పై ఏళ్ల మహిళను, ఎవరో ఇద్దరు వ్యక్తులు రెండు చేతులూ పెడవిరిచి పట్టుకున్నారు. మృతదేహం పక్కనే కూర్చుని రోదిస్తోంది ఓ వృద్ధురాలు.
ఇనస్పెక్టర్ ను చూసిన ఆ ముసలామె,
"అమ్మా! వీడు నా కొడుకమ్మా. ఆ ముదనష్టపుది నా కోడలు మంగ. ఎవరితోనో తిరుగుతోంది. నా కొడుకును దారుణంగా చంపేసింది. పారిపోబోతూంటే వీళ్ళకి అనుమానం వచ్చి పట్టుకున్నారు........" ఏడుస్తూ చెప్పింది ఆ వృద్ధురాలు, ఆ మహిళను చూపిస్తూ.
ఆ మహిళ వద్దకు వెళ్ళి,
"ఏయ్! మీరు ఆమెను వదలండి" అని వారికి చెప్పి, "నువ్వేనా ఇతడిని హత్య చేసింది" మంగను అడిగింది ఇనస్పెక్టర్ స్వరూపరాణి.
"ఔను మేడమ్! నేనే చంపేసాను" బెదురులేకుండా చెప్పింది మంగ.
"ఏయ్, లేడీ కానిస్టేబుల్స్! ఈమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకుని రండి. మిగలిన వాళ్లు పోస్ట్ మార్టం, వేలు ముద్రలు, ఫొటోల ఏర్పాట్లు చూడండి. అలాగే ఆధారాలు కూడా సేకరించండి" అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది ఇనస్పెక్టర్ స్వరూపరాణి.
జీపు ఎక్కబోతున్న ఆమె వద్దకు వచ్చి,
"మేడమ్! నా పేరు సరోజ. నేను మంగ వాళ్ళ అక్కను. వాడు వట్టి అనుమానం మొగుడమ్మా! వాడు పెట్టే బాధలు పడలేకే మా చెల్లి వాడిని చంపింది. కావాలంటే దాని ఒంటిమీద ఆ గాయాలు చూడండి. కనికరించి శిక్ష నుంచి బయటపడేలా సహాయం చేయండి" అంటూ ఎస్సైని వేడుకుంది మంగ వాళ్ళ అక్క.
"ఔను మేడమ్! వాడు ఆమెకు నరకం చూపించాడు. పాపం ఆమెకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదు. ఉట్టి అనుమానపు మొగుడు. ఏమాత్రం వీలున్నా, శిక్ష తగ్గించే మార్గం చూడండి" భార్యకు వంతపాడాడు సరోజ భర్త గుర్నాధం.
***** ***** ***** *****
ఆ రోజు మధ్యాహ్నం నిందితురాలు మంగ చేసిన హత్య గురించి, మహిళామండలి సభ్యులు మరియు విలేకరులతో, సమావేశం ఏర్పాటు చేసింది ఎస్సై స్వరూపరాణి.
"చూడు మంగా! అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. దానిని బట్టి నీ శిక్ష ఖరారు అవుతుంది" చెప్పింది ఎస్సై స్వరూపరాణి.
"నా భర్త చంద్రంతో నాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు ఔతోంది మేడమ్. మొదట్లో నన్ను బాగానే చూసుకునేవాడు. కానీ ఈ మధ్య నా శీలాన్ని అనుమానించడం మొదలు పెట్టాడు. నాకు చాలా మందితో అక్రమ సంబంధం ఉందని పిచ్చి వాగుడు వాగుతూ నన్ను హింసించేవాడు. రోజూ పీకలదాకా తాగి రావడం, వాంతులు చేసుకోవడం, చేతికందిన వస్తువులతో చావబాదడం, అలసిపోయి పడుకోవడం. రోజూ ఇదే వాడి బాగోతం. చూడండి ఒళ్ళంతా ఎలా గాయాలు చేసాడో" అంటూ ఒంటిమీద గాయాలు చూపించింది.
"నిన్న రాత్రి కూడా ఇలాగే ఫుల్ గా తాగేసి వచ్చి, ఏదో వాగుతూ బల్లమీద ఉన్న కత్తి తీసుకుని నన్ను పొడవబోయి, పట్టు తప్పి, భళ్లున వాంతి చేసుకుని కింద పడి నిద్రపోయాడు. ఆ పరిసరాలను శుభ్రం చేసి నేను కూడా నిద్ర పోయాను. తెల్లవారు జామున నిద్ర లేచిన నేను, వీడు మళ్లీ లేస్తే దెబ్బలు తినాలి. ఎన్నాళ్లు ఇలా ? అనుకుని విసుగెత్తిపోయి, ఆ కత్తితో వాడి పొట్టలో పొడిచి చంపేసాను. మీ స్టేషన్ కు వచ్చి లొంగిపోదామనుకుని బయలుదేరాను. ఈ లోగా రక్తంతో ఉన్న నా చీరను చూసి అనుమానించిన మా పక్క వాటాల్లో ఉన్న వాళ్ళు నన్ను బంధించి మీకు ఫోన్ చేసారు" జరిగింది చెప్పింది మంగ.
"విన్నారు కదా, ఆమె చెప్పింది. అన్ని ఆధారాలు సేకరించి ఆమె మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని చెప్పి ఆ సమావేశాన్ని ముగించింది ఇనస్పెక్టర్ స్వరూప రాణి.
***** ***** ***** *****
ఆ రోజు సాయంత్రం హెడ్ కానిస్టేబుల్ హేమలత తీసుకుని వచ్చిన ఆధారాలు, పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టులు చూసిన తరువాత, ఎస్సై స్వరూప రాణి తమ ఆధీనంలో ఉన్న మంగ వద్దకు వచ్చి,
"ఈ చేతిరాత మీ ఆయనదేనా?" అడిగింది ఓ కాగితం చూపిస్తూ.
"ఔను మేడమ్! ఈ రాత, సంతకం కూడా వాడిదే! ఎటొచ్చీ మందుమీద ఉన్నప్పుడు రాసి ఉంటాడు. అందుకే కొంచెం వంకరటింకరగా రాసాడు. ఇంతకీ ఏముంది మేడమ్ అందులో?" ఆశ్చర్యంగా అడిగింది మంగ.
"తరువాత చెబుతాను" అంటూ అక్కడ నుంచి బయలుదేరింది ఎస్సై స్వరూపరాణి.
***** ***** ***** *****
ఆ మర్నాడు ఉదయం, విలేకరుల సమక్షంలో వారాంతపు క్రైమ్ సమీక్ష నిర్వహిస్తోంది ఇనస్పెక్టర్. కాసేపటికి
"మేడమ్! ఆ చంద్రం మర్డర్ కేసు పురోగతి ఏమిటి? మంగను హంతకురాలిగా నిర్ధారించినట్లేనా?" అడిగాడు ఓ విలేఖరి.
"అదే చెబుదాం అనుకుంటున్నా. చంద్రానిది హత్య కాదు, ఆత్మహత్య. మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం రిపోర్టులో, విషం తాలూకు అవశేషాలు కడుపులో ఉన్నాయనీ అలాగే మరణానికి కారణం కడుపులో గుచ్చుకున్న కత్తి కాదనీ, స్పష్టంగా ఉంది" చెప్పింది ఎస్సై.
"అతనిది ఆత్మహత్య అని ఎలా నిర్ధారణ చేసారు మేడమ్?" అనుమానంగా అడిగాడు మరో విలేఖరి.
"గుడ్ క్వశ్చన్. నిన్న సాయంత్రం హతుని పర్స్ లో ఓ లెటర్ దొరికింది మా వాళ్లకు. అందులో ...'తను అప్పులు తీర్చలేక మరియు తన భార్య చెడుతిరుగుళ్లుతో విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని" స్పష్టంగా రాసి ఉంది. ఆ చేతివ్రాత తన భర్త చంద్రానిదే అని మంగ, అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అందువలన కొన్ని షరతులు మీద ఈరోజు మంగను విడుదల చేస్తున్నాము" అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది ఎస్సై స్వరూపరాణి.
***** ***** ***** *****
కాసేపటి తరువాత స్టేషన్ లోని సెల్ నుంచి విడుదలైన మంగ, ఎస్సై స్వరూపరాణి వద్దకు వచ్చి,
"మేడమ్! మీరు చెప్పిన షరతులు ప్రకారం నేను నడుచుకుంటాను.కానీ, ఇక్కడ మీకు ఓ చిన్న విషయం చెప్పాలి. అది ........................" అంటూ నెమ్మదిగా ఎస్సైకి చెప్పింది మంగ.
"ఔనా? సరే నువ్వు వెళ్లు. ఆ విషయం నేను చూసుకుంటాను" అని మంగను పంపించింది ఇనస్పెక్టర్ స్వరూపరాణి.
***** ***** ***** *****
ఓ నాలుగు రోజుల తర్వాత విలేకరుల సమావేశంలో...
"మిమ్మల్ని సమావేశ పరచడానికి కారణం, ఈ రోజుతో చంద్రం హత్య కేసు క్లోజ్ చేస్తున్నాము. ఆధారాలన్నీ సేకరించాం.."
చెబుతున్న ఎస్సై స్వరూపరాణితో
"ఏంటి మేడమ్! మళ్ళీ హత్య అంటున్నారు. మొన్న ఆత్మహత్య అన్నారు కదా? పేపర్లో కూడా అలాగే రాసేసాము. మళ్లీ ఇదేం ట్విస్ట్ ?" ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఔత్సాహిక విలేఖరి.
"అది చెబుదామనే మిమ్మల్ని రమ్మన్నాను. మొన్న మంగ, స్టేషన్ నుంచి బయటకు వెళ్తూ ....
'తన భర్త ఆత్మహత్య చేసుకొనేటంత పిరికి వాడు కాదనీ, దేనికీ భయపడేవాడు కూడా కాదనీ, అలాగే తనకు తెలిసి ఒక్క ఆటో ఫైనాన్స్ తప్ప అప్పులు కూడా ఏమీ లేవనీ, అందువలన తనకు ఏదో అనుమానంగా ఉందనీ' చెప్పడంతో మళ్ళీ హత్య కోణంలో పరిశోధన కొనసాగించాం" ఆగింది ఎస్సై స్వరూపరాణి.
"అయితే ఈ హత్యలో మంగకు ఎటువంటి ప్రమేయం లేదంటారా? మరి హత్య చేసింది ఎవరు మేడమ్?" అడిగాడు మరో విలేఖరి.
"ఔను. అనుమానితురాలు మంగ విషయంలో మా న్యాయవాదుల సలహా తీసుకుంటాం. ఇక చంద్రం హత్య పరిశోధనలో భాగంగా మేము అన్ని లిక్కర్ షాపుల సీసీ ఫుటేజీలు పరిశీలించాము. కానీ అందులో చంద్రం తప్ప ఎవరూ కనపడలేదు. ఇక పోస్ట్ మార్టం రిపోర్టులో అతని మరణానికి కారణం ఎండ్రిన్ లాంటి పురుగుల మందు అని ఉండడంతో ఆ షాపుల సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తే, అందులో ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చి, అతని మీద నిఘా పెట్టాము. అయితే హంతకుడిని పట్టించింది మటుకు చంద్రం జేబులోని ఉత్తరం. ఆ కాగితం ఆధారంగా పరిశోధిస్తే అక్కడ కూడా మళ్ళీ అదే వ్యక్తి అనుమానితుడు కావడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, ముందు బుకాయించాడు కానీ మా పద్దతిలో విచారిస్తే తప్పు ఒప్పుకున్నాడు" మధ్యలో ఆగి, పోలీసుల వైపు తిరిగి ఏదో సౌంజ్ఞ చేసింది స్వరూపరాణి. వారు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి నిలబెట్టారు.
"ఎవరు మేడమ్, ఈయన?" విలేకరులు అడిగారు ముక్తకంఠంతో.
"ఇతను గుర్నాధం. మంగ వాళ్ళ అక్క భర్త. ఇతనికి ఓ యాభై వేలు అప్పు ఇచ్చాడు చంద్రం. ఈ విషయం ఇద్దరి ఇళ్లల్లోనూ కూడా ఎవరికీ తెలియదు. అది తీర్చమని రోజూ గొడవ చేస్తూండడంతో ఇదిగో ఈ ఆత్మహత్య డ్రామా రూపొందించాడు. తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పు" అని గుర్నాధం వైపు చూసింది స్వరూపరాణి.
"ఆరోజు హత్య చేయాలని నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. నేను తిమ్మాపురం రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో ఉండి, మద్యం తీసుకురమ్మని చంద్రానికి పురమాయించాను. తర్వాత అతని చేత బాగా తాగించి, మత్తులో ఉండగా అతని చేత్తోనే ఆత్మహత్య లెటర్ తయారు చేయించి పర్స్ లో పెట్టాను. తరువాత విషం కలిపిన మద్యం బలవంతంగా తాగించి, అతడిని వాళ్లింటి ముందు దిగబెట్టి ఇంటికి వెళ్లి పోయాను. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గొడవ ఉండేది కాదు. కానీ మంగ కత్తితో పొడిచి, చుట్టు పక్కల వారికి దొరకడంతో నా ప్లాన్ రివర్స్ అయ్యింది" చెబుతూ తల వంచుకున్నాడు గుర్నాధం.
"మిగతాది నేను చెబుతాను. ఇతడిని లోపలికి తీసుకుని వెళ్ళండి" అంటూ చెప్పసాగింది ఎస్సై స్వరూపరాణి.
"ఆ తరువాత, కేవలం యాభైవేలకే తోడల్లుడ్ని హత్య చేస్తాడా? ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా? అన్న అనుమానం మాకు వచ్చింది. తర్వాత మా పద్ధతిలో అతడిని విచారణ చేస్తే తెలిసింది ఏమిటంటే, ఇతను తప్పనిసరి పరిస్థితుల్లో సరోజను పెళ్లి చేసుకున్నాడు కానీ ఇతనికి మంగ అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే మంగకు అక్రమ సంబంధాలు ఉన్నాయిని ఊర్లో పుకార్లు వచ్చేలా చేసి, చంద్రానికి అనుమానం వచ్చేలా చేసింది ఇతనే. అలాగే అతనికి మద్యం అలవాటు చేసింది కూడా ఈ గుర్నాధమే. కానీ చంద్రంతో మటుకు ఆమె అలాంటిది కాదని చెబుతూ తన మీద అనుమానం రాకుండా చూసుకొనేవాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, చంద్రం చనిపోగానే మంగను తన ఆధీనంలోకి తెచ్చుకుందాం అనుకున్నాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట. కానీ తప్పు చేసినవాడు ఎప్పటికైనా చట్టానికి దొరక్కపోడు. ఎనీ డౌట్స్ ? " అడిగింది ఎస్సై స్వరూపరాణి.
"మేడమ్! సీసీ ఫుటేజీలు వరకూ ఓకే. కానీ ఆ ఆత్మహత్య ఉత్తరం నిందితుడ్ని ఎలా పట్టించింది?" అడిగాడు ఓ క్రైమ్ రిపోర్టర్.
"ఆ సూసైడ్ లెటర్ తీసుకుని మొదట మంగను అడిగాను. ఆ చేతివ్రాత తన భర్తదే కానీ, ఆ కాగితం తన ఇంట్లోది కాదని చెప్పింది. ఆ కాగితం జాగ్రత్తగా పరిశీలించిన మాకు, అందులో అస్పష్టంగా వాటర్ మార్కుతో ఉన్న ఓ కాన్వెంట్ స్కూల్ ఎంబ్లమ్ కనబడింది. ఆ స్కూలుకు కాకినాడ టౌన్ లో ఉన్న మూడు బ్రాంచీలలోనూ ఎంక్వయిరీ చేస్తే ఓ బ్రాంచిలో ఈ గుర్నాధం కొడుకు చదువుతున్నాడని తెలిసింది. అయితే తన కుర్రాడి నోటు బుక్ లోంచి చింపిన ఆ కాగితమే తనని పట్టిస్తుందని పాపం గుర్నాధం అనుకోలేదు. ఆ పురుగుల మందు డబ్బాతో సహా హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాము. ఇంక అతడిని బోనులో నిలబెట్టడమే తరువాయి. థాంక్యూ.." అంటూ మీటింగ్ ముగించి, ఠీవిగా నడుచుకుంటూ వెళ్లింది ఇనస్పెక్టర్ స్వరూపరాణి.
***** **సమాప్తము** *****
No comments:
Post a Comment