*సహనం*
రచన : కోడూరి తిరుమల మాధవి :
(స్వీయ రచన)
ఉదయం పది కావస్తోంది, ఎప్పటిలాగే ఆ రోజు పనులన్నీ ముగించుకుని, ఆఫీసు రూమ్ లోకి వెళ్ళి మరునాడు నేను కోర్టులో వాదించబోయే ఫైల్ పేపర్స్ స్టడీ చేస్తున్నాను. ఒక పది నిముషాలు గడిచాక
లోపలికి రావచ్చా మేడం ఆన్న పిలుపుతో తల పైకి ఎత్తి చూసాను తలుపు దగ్గర యాభై యేండ్ల పైన వయసు వున్న మహిళ నిలుచుని వున్నారు. రండమ్మా అని పిలిచాను తను లోపలికి వచ్చి కూర్చున్నారు, ఎవరు మీరు ఎందుకు వచ్చారు ? అని అడిగాను, ఆవిడ నా పేరు సుశీల నా వయసు యాభై అయిదు నాకు మా వారితో విడాకులు కావాలి అని అడిగింది,
నేను ఒక్కక్షణం ఆశ్చర్య పోయాను. నేను ఏమైనా తప్పుగా విన్నానా! ఆన్న సందేహం వచ్చి మళ్ళీ అడిగాను ఏమన్నారు ? అని, మీరు సరిగానే విన్నారు నాకు మా వారితో విడాకులు కావాలి అని అడిగింది.
నేను ఆవిడతో అసలు విషయం ఏమిటి ? ఈ వయసులో మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు ? అని అడిగాను, ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలు పెట్టారు, మేడం నాకు పెళ్ళై ముప్పై సంవత్సరాలు కావస్తోంది. ఈ ముప్పై యేండ్ల జీవితంలో చాలా విసిగిపోయాను. ఓపిక చచ్చిపోయింది. ఇంక ఓర్చుకోలేను అనగానే వివరంగా చెప్పమని అడిగాను. వంట చేయడమే నాకు జీవితంలో పెద్ద సమస్యగా మారిపోయింది. మావారు వంట విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. రకరకాల వంటలు చేసి పెట్టాలి, ఉదయం టిఫెన్ ఇడ్లీ, దోశ ఏదైనా సరే రెండు రకాల చట్నీలు చేయాలి అవి కూడా మిక్సీలో రుబ్బకూడదు. రోటిలోనే రుబ్బాలి, పచ్చడులు, దోశ పిండి, ఇడ్లీ పిండి ఏదైనా సరే రోటిలోనే రుబ్బాలి. మిక్సీలో, గ్రైండర్ లో రుబ్బితే వొప్పుకొరు. ఇంక మధ్యాహ్నం లంచ్ కి
ప్రతిరోజు ఒక కూర, పప్పు, పులుసు, చారు, పచ్చడి, పెరుగు ఇలా ఐదారు ఐటమ్స్ వుండాల్సిందే ఇందులో ఏది తగ్గినా ఒప్పుకోరు, పైగా నంచుకోవడానికి అప్పడాలు, వడియాలు వుండాల్సిందే
సాయంత్రం ఇంటికి రాగానే కాఫీతో పాటు ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి, ఇంక రాత్రికి ఉదయం చేసినవి ఏవీ తినరు, మళ్ళీ వేరే చేయాలి, పైగా ఒకరోజు చేసిన రకం మరునాడు చేయకూడదు. ఇడ్లీ పిండి, దోశ పిండి కొంచెం పులిసినా ఒప్పుకోరు, బయట ఎక్కడా తినరు. రోజూ ఇంటినుండే కెరియర్ తీసుకుని వెళతారు,
ఎక్కడికయినా ప్రయాణాలు చేసినప్పుడు కూడా అన్నీ ఇంట్లో చేసుకుని బయలుదేరాలి, నా బ్రతుకంతా వంట ఇంటిలోనే గడిచిపోతోంది, ఈ చాకిరీ బయట ఎక్కడైనా చేసి వుంటే ఈ పాటికి ఎంతో కొంత సంపాదించి వుండేదాన్ని, సంపాదన లేదు సరి కదా నా శ్రమకు విలువ కూడా వుండడం లేదని ఎంతో అవేదనగా చెప్పేసరికి వింటున్న నాకు కళ్ళు తిరిగాయి. అయినా తమాయించుకుని సరే అయినా ఇన్ని ఏండ్లు ఇంత ఓపికగా చాకిరీ చేసిన మీరు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి ? అని అడిగాను. ఏం చెప్పమంటారు మేడం మా ఆయన ఇంకో వారం రోజుల్లో రిటైర్ అవుతున్నారు. ఇన్నాళ్ళు కనీసం ఆయన ఆఫీసులో వున్న సమయంలో అయినా కాస్త ప్రశాంతంగా వుండేదాన్ని ఇప్పుడు ఇంక ఆ ఆశ కూడా లేదు ఇకపై ఆయన ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే వుంటారు, ఇది ఇలా చేయి, అది అలా చేయి, ఈరోజు ఇది వండు, రేపు అది
వండు అని మొదలు పెడతారు. అది తలుచుకుంటేనే భయంగా వుంది. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి మేడం అని అడగగానే నాకు ఏం మాట్లాడాలో తోచలేదు. ఆవిడని చూస్తే జాలి కలిగింది. మీకు ఎంతమంది పిల్లలు ? అని అడిగాను. దానికి ఆవిడ మాకు ఒక్కతే అమ్మాయి పెళ్ళి అయింది ఇదే వూరిలో వుంటుంది అని చెప్పగానే మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి నంబర్ తీసుకుని తనతో మాట్లాడాను, సుశీలగారు చెప్పిన విషయాలు అన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం, మా అమ్మ చాలా పాపం మేడం ఇన్నిరోజులు అసలు ఇంత ఓపికగా ఎలా వుందో ? ఏమిటో ? ఎవరు ఎన్ని చెప్పినా మా నాన్నగారు వినరు, మారరు అనగానే తననుండి సుశీలగారి భర్త నంబర్ తీసుకొన్నాను.
తరవాత సుశీలగారితో సరే సుశీలగారు మీరు వెళ్ళి రండి, నేను పిలిచినప్పుడు రండి అని చెప్పి పంపించి ఆవిడ వెళ్ళినవైపే చూస్తూ వుండి పోయాను. ఆలోచిస్తే అందరు ఇల్లాళ్ళ పరిస్థితి ఇదేనేమో అనిపించింది. జీవితాంతం వండి వార్చాల్సిందేగా. మూడువందల అరవై అయిదు రోజులు ఒకే పని. నో శాలరీ, నో పెన్షన్, నో రిటైర్మెంట్, నో అవార్డ్స్. ఇంక పండగ పబ్బాలు, చుట్టాలు, సెలవులలో అదనపు పని, ఇంక ఉద్యోగాలు చేసే ఆడవారి సంగతి చెప్పనే అక్కర్లేదు వారి పరిస్థితి ఇంకా దయనీయం. వారు ఇంటాబయటా కూడా చాకిరీ చేయాలి, ఆడవాళ్ళు ఇంత చేస్తున్నా వారిని ప్రశంసించకపోగా వారి శ్రమను గుర్తించడం కూడా లేదు, నిజం చెప్పాలి అంటే ప్రతి ఇల్లాలికి పద్మశ్రీ, పద్మ విభూషణ్ ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తూ మెదడు వేడెక్కడంతో కాస్త టీ తాగి, ఫోన్ తీసుకుని సుశీలగారి భర్త నంబర్ కి డయల్ చేసాను అవతలి నుండి హల్లో అనగానే రామారావు గారేనా నేను లాయర్ కీర్తిని మాట్లాడుతున్నాను, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి
సాయంత్రం నాలుగు గంటలకు మా ఆఫీసుకి రండి అని అడ్రెస్స్ చెప్పి ఫోన్ పెట్టేసాను.
సాయంత్రం రామారావుగారు వస్తారా ? రారా ? అని అనుకుంటూ వుండగా సరిగ్గా సమయం నాలుగు అవుతుండగా తలుపు దగ్గర లోపలికి రావచ్చా మేడం ఆన్న పిలుపుతో అటువైపు చూసాను, రామారావు గారే అనుకుంటా రండి అన్నాను. కాస్త కంగారు పడుతూనే వచ్చి ఎదురుగా కూర్చున్నా రు. చెప్పండి మేడం ఉదయం ఏ విషయం చెప్పకుండా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసారు
అనగానే, సుశీలగారు మీ ఆవిడే కదా సార్ అని అడిగాను ఆయన అవును అన్నట్లు తల వూపారు. ఆవిడ ఉదయం ఇక్కడికి వచ్చారు విడాకులు కావాలి అని అడిగారు అని చెప్పగానే నావైపు నమ్మలేనట్లుగా చూసారు. నేను ఉదయం సుశీలగారు నాతో చెప్పిన అన్ని విషయాలు చెప్తుంటే మౌనంగా వింటూ కూర్చున్నారు, చూడండి రామారావుగారు హింస అంటే కేవలం కొట్టడం, తిట్టడం మాత్రమే కాదు. ఇది కూడా ఒకరకమైన మానసిక హింస కిందికే వస్తుంది. ఆవిడ ఎంత విసిగిపోయి వుండక పోతే ఈ నిర్ణయానికి వస్తారు చెప్పండి. మీరు చేసిన సర్వీసుకు గుర్తుగా మీకు మాల వేసి పార్టీ ఇచ్చి, మీరు చేసిన సేవలను పొగిడి గౌరవంగా ఇంటికి పంపిస్తున్నారు, పెన్షన్ కూడా ఇస్తారు, మరి ఇన్ని ఏండ్లుగా మీ ఆవిడ చేస్తున్న సేవలకు మీరు ఏమి ఇవ్వకపోగా ఆమెను ఇంకా విసిగిస్తున్నారు, ఆవిడ ఇన్ని ఏండ్లుగా మీకు చేసిన పనులు ఒక్క వారం మీరు ఆమెకు చేస్తే తెలుస్తుంది ఆమె ఇన్ని ఏండ్లుగా ఎంత కష్టపడిందో, మీలాగే ఆవిడకు వయసు పెరుగుతోంది. ఓపిక తగ్గుతోంది, ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు అనగానే ఆవిడ సంతోషించడానికి బదులు ఇంకెంత చాకిరీ చేయాలో దేవుడా! అని భయపడుతున్నారు అనగానే, దగ్ధమైన స్వరంతో నేను నా ప్రవర్తనకి చాలా సిగ్గు పడుతున్నాను మేడం,
నా భార్యని నేను ఇంతగా ఇబ్బంది పెట్టాను అని ఏనాడూ ఊహించలేదు. ఎంత పెద్ద తప్పు చేసానో మీరు చెప్పిన మాటలు విన్నాక అర్థం అవుతోంది అనగానే, పరవాలేదు
ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఇప్పటికైనా మీ అలవాట్లు మార్చుకుని ఆవిడకు కాస్త విశ్రాంతి కలిగిస్తే మీ సుశీల మీతో వుంటారు. లేకపోతే ఈసారి ఆవిడ వచ్చి విడాకులు కావాలి అని అడిగితే మాత్రం నేను కేసు ఫైల్ చేయాల్సి వుంటుంది అని చెప్పగానే, అలాగే మేడం అని చెప్పి వెళ్ళి పోయారు.
నాలుగు రోజులు గడిచి పోయాయి. ఒకరోజు సాయంత్రం అయిదు అవుతుండగా సుశీలగారు, రామారావుగారు ఇద్దరూ నా ఆఫీస్ కి వచ్చారు. సుశీలగారి మొహం సంతోషంగా వుండడం గమనించాను.
మేడం మీతో మాట్లాడాక నా తప్పు నేను తెలుసుకున్నాను, నా భార్యపట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం అయింది. ఇకమీదట నా భార్యను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను. తను ఏది చేసి పెట్టినా తింటాను, తనకి సహాయంగా ఒక పని మనిషిని కూడా ఏర్పాటు చేశాను. ఇంక మీదట తను ఏది అడిగితే అది చేయడానికి సిద్దంగా వున్నాను, నా భార్య లేకుండా నేను ఉండలేను అని చెప్పగానే చాలా సంతోషం రామారావు గారు, మీరు ఇద్దరూ ఇలాగే ఎప్పుడూ సంతోషంగా కలిసి వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాను,
ఆ దంపతులు ఇద్దరూ నాకు ధన్యవాదాలు తెలిపి ఒకరి చేయి ఒకరు పట్టుకుని బయటకు వెళుతుంటే
తృప్తిగా చూస్తూ వుండి పోయాను.
🌹సమాప్తం🌹
No comments:
Post a Comment