Lady doctor
అప్పుడే పావుతక్కువ రెండు. ‘ఇంకా బయల్దేరలేదా?’ అంటూ ఫోనొచ్చేసింది కూడాను. గబగబా ఫోను, చార్జర్ బ్యాగ్‌లో పడేసుకుని పనమ్మాయిని పిలిచింది. చంటాడు లేస్తే అన్నం పెట్టమని, పిల్ల స్కూల్నించి రాగానే పాలు, బిస్కట్లు ఇవ్వమని చెప్పేసింది.
‘మరీ ఎక్కువ తిననివ్వకు. రాత్రి మళ్లీ అన్నం తినదది. నాలుగు బిస్కట్లు ప్లేట్లో పెట్టివ్వు చాలు. ఇంకా అడిగితే అయిపోయాయని చెప్పు!’
ఒక్కమాట కూడా మాటాడకుండా పనిచేసుకుపోతూంటుంది పనమ్మాయి. ఎర్రటి ఎండలో చలివేంద్రంలా భలే దొరికింది. ఇదేగనక లేకపోతే ఈ ఉద్యోగం ఎప్పుడో మానేసేది తను.
ఇంకేంటి? ఈయనగారు వచ్చిన వెంటనే ఎలాగూ ఫోన్ చేస్తారు ‘అదెక్కడుంది, ఇదెలా తియ్యాలి’ అంటూ. అప్పుడు మాటాడుకోవచ్చు. ఇప్పుడు చేసి ప్రయోజనం లేదు. ఎత్తడు.
అద్దం ముందు నిలబడి జుట్టంతా లాగి ముడేసి బ్యాండొకటి పెట్టేసింది. అదే హాయి డ్యూటీలో వున్నప్పుడు. కళ్లకింద నల్లగా వలయాలు. ఇక కాటుక కూడా అవసరంలేదు. విరక్తిగా అనిపించింది. కాలేజీ రోజుల్లో ఎలావుండేదాన్నసలు? ఈ పురుడు కేసులతో పడీపడీ సున్నితత్వం కాస్తా కరుడుగట్టేసిందా?
ఒక్కసారి అమ్మమ్మ గుర్తొచ్చింది. ఆవిణ్ణి కాటుక లేకుండా ఎప్పుడూ చూడలేదసలు. తాతయ్యనేవారు..‘ఇది కాటికెళ్లేవరకూ కాటుకెట్టుకుంటుందే!’ అని!
హాస్పిటల్నించి మళ్లీ ఫోను. రెండు కేసులు హేండోవరయ్యాయిట. వెళ్లిన వెంటనే సర్జరీ చేసెయ్యాలి. గబగబా బండి తీసి బటన్ నొక్కితే స్టార్టవ్వలేదు. వాచ్ మన్ కూడా లేడు సమయానికి. కిక్ కొడదామని ప్రయత్నించింది కానీ తనవల్ల కాలేదు. పదినిమిషాల తరవాత ఎవరో కుర్రాడొకడు రోడ్డుమీంచి వెళుతూ తన అవస్థ చూసి సహాయం చేసాడు.
హాస్పిటలే నిండుగర్భిణిలా వుంది. త్వరత్వరగా హ్యాండ్ బ్యాగ్ రూములో పడేసి తన సీట్లో కూలబడింది. లేబర్రూమ్ సిస్టర్ ఎనిమిది కేష్షీట్లు పట్టుకొచ్చి ముందుంచింది. తనూ అప్పుడే వచ్చిందిగా డ్యూటీకి? అందుకే ఆ లాలన. ఇంకొంతసేపు గడిస్తే అన్నీ విసరడాలే. ఇలా ఉంచడాలవీ ఉండవు. అవేవీ కావాలని చేసే అకృత్యాల్లోకి రావు. పనివత్తిడితో చిత్తడి చిత్తడిగా మారిపోతుంది మనసంతా.
ఒక పేషెంటుకి డెలివరీ తేదీ దాటిపోయి పదిరోజులవుతోంది. ‘ఏంచేస్తున్నావే ఇన్నాళ్లూ?’ అనడిగితే ‘అమాస ముందెలాగొస్తానమ్మా? మా అత్తమ్మ ఎల్లొద్దనీసింది’ అంటూ తింగరి సమాధానం ఇచ్చింది.
ఇంకొక పిల్లకి తెలుగు రాదు. హిందీ తనకి రాదు. ఒరియా ఎవరికీ రాదు. చేతిసైగలతో ఎంత సమాచారమని రాబడుతుంది తనుమాత్రం? దేవుడిదయ వుంది. ఆ పిల్ల చూస్తుండగానే ఓ ‘దార్కా’ని కనేసింది. హమ్మయ్య! ఒకటి తగ్గినా తగ్గడమే కదా?
మిగతావాటిలో నాలుగింటికి కోత కొయ్యాల్సిందే! ఇంకో రెండింటిని అర్ధరాత్రి వరకూ ఆపొచ్చు. వాళ్లిద్దరికీ డెలివరీ అవడానికి మందు పెట్టెయ్యమని నర్సుకు చెప్పేసి మత్తు వైద్యుడికి ఫోన్ చేసింది ‘నాలుగు ఆపరేషన్లున్నాయి రమ్మన’మని! అతను గంటా గంటన్నర తరవాత వస్తానని ప్రామిస్ ‘లాంటిది’ చేసాడు.
ఇక చేసేదేంలేక గదిలోకొచ్చి పడింది. కళ్లు మూసుకుంటే కావలసినంత నిద్ర రావడానికి గుమ్మంలోనే నిలబడుంది. కలలూ అవీ రావడం మానేసి చాలా ఏళ్లయింది. ఎంతసేపూ పిల్లాడు అన్నం తిన్నాడా లేదా, పిల్లకి ఇంటర్నేషనల్ బళ్లో సీటొస్తుందా రాదా, వచ్చేవారం డ్యూటీ ఎక్స్చేంజ్ దొరుకుతుందా దొరకదా....ఇవే ఆలోచనలు.
గుమ్మంలో అడ్డంగా నిలబడిన నిద్రని పక్కకు జరగమని చెప్పి ఆయా లోపలికొచ్చింది. వన్నాటెయిట్లో కేసొచ్చిందని, పేషెంట్ మన లోకంలో లేదని!
ఫిట్సొచ్చాయిట. ఆరోనెల గర్భిణీ. పరీక్షచేసి స్పెషల్ వార్డులో పడుకోబెట్టమంది. బీపీ చూస్తే రెండొందలుంది. బ్లడ్ టెస్టులవీ రాసి, మళ్లీ ఫిట్సు రాకుండా మెగ్నీషియం చెయ్యమని చెప్పి పేషెంటు వాళ్లాయనతో మాటాడబోయింది.
వాడు ‘ఈ మూర్ఛా అదీ పెళ్లికి ముందునుంచీ ఉందేమో, ఆ విషయం దాచిపెట్టి తనకి కట్టబెట్టారేమో?’ అనే అనుమానంతో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఏమడిగినా సమాధానం ఇవ్వడంలేదు. ఇహ వాడితో మాట్లాడడం, మనసు పాడుచేసుకోవడం అనవసరమని వాణ్ణి బయటికి తగిలేసింది.
ఓటీలో పనిచేసేవాళ్లు వచ్చేశామని కబురుపెట్టారు. మళ్లీ మత్తుబాబుకి ఫోన్ చేసింది. ఏ కళనున్నాడో వచ్చేస్తున్నానంటూ నెత్తినపాలు, నోట్లో పంచదార పోశాడు. చకచకా నాలుగాపరేషన్లూ చేసిపడేసినా ఎంతలేదన్నా ఎనిమిదవుతుంది. ఈలోగా ఏ కేసూ ఇబ్బంది పెట్టకుండా వుంటే ఇంటికొకసారి ఫోన్ చేసి పిల్లలిద్దరితోనూ మాటాడొచ్చు. లేకపోతే పడుకుండిపోతారు.
ఒకవేళ కుదరకపోతే నోట్లో ముద్ద దిగదు. డాక్టర్లు ఇలా సెన్సిటివ్‌గా వుండకూడదు, నిజమేకానీ తల్లులుండొచ్చు కదా?
మొదటి కేసిలా అయిపోతుందనగా రెండోదానికి మత్తిచ్చేశాడు. ఇట్నించి అటెళ్లి గబగబా చేసేద్దామనే అనుకుంది. కానీ అది రెండో ఆపరేషన్ కేసు. మొదటిసారి జరిగిన సర్జరీ వలన లోపలంతా అతుకులు ఏర్పడిపోయాయి. పేగుల్ని, గర్భసంచిని జాగ్రత్తగా విడదీసి, బ్లీడింగ్ అదీ గమనించుకుంటూ పూర్తిచేసేటప్పటికి గంటన్నర దాటేసింది.
ఈలోగా మత్తుబాబు సన్నగా సంగీతం మొదలెట్టాడు. ‘మిగతావి రెండూ అంత ఎమర్జెన్సీలు కాకపోతే వదిలెయ్యొచ్చు కదా?’ అని! అతన్నిప్పుడు వదిల్తే పట్టుకోవడం మళ్లీ కష్టం. ఎలాగోలా పూర్తిచేసేసి పంపిస్తేనే మంచిది.
మిగతావి రెండూ పెద్దగా ఏ ఇబ్బందీ పెట్టకుండానే పూర్తయిపోయాయి.
ఎనిమిదిన్నర!
గబగబా గదిలోకొచ్చి ఇలా ఫోన్ తీసిందోలేదో, వార్డునుంచి కబురు. ఒక పేషెంటుకి బెడ్ మీదనే డెలివరీ అయిపోయిందని. పరుగు పరుగున వెళ్లారందరూ!
అంతలా పరుగెత్తడానికి రెండు కారణాలుంటాయి. ఒకటేమో బిడ్డతో పాటు మాయ వెంటనే వచ్చేసిందో లేదో అనే భయం, ఒకవేళ వచ్చేసినా ఎంత రక్తం పోయిందో అన్న టెన్షన్.
ఇక రెండోది. ఇది చాలా అమానవీయమైనది. నిజానికి అంత రద్దీగా వుండే హాస్పిటళ్లలో పేషెంట్ల సహాయసహకారాలు చాలా అవసరం. కొంతమంది నొప్పులొస్తున్నా సరిగా చెప్పిచావరు. బాత్రూముకెడితే భళ్లున పురుడైపోయిన యవ్వారాలు కూడా వుంటాయి. అయితే భయమేమిటంటే...
మర్నాడు పేపర్లో రాబోయే వార్త చాలా కసాయిదనాన్ని నింపుకుని వుంటుంది.
‘వార్డులోనే పురుడా?
ఇదేమి చోద్యం?
ఇదేనా వైద్యం?’
ఇక ఆ తరవాత ఎంక్వైరీలు, మహిళా సమాజ సభ్యులు, కులసంఘాల ప్రతినిధులు, టెంటులు, నినాదాలు.
ఆ పేషెంటుకి అవసరమైన వైద్యం అందించి గదిలోకొచ్చేసరికి పది. ఆయనగారసలు ఫోనైనా చెయ్యలేదు. కోపంగా డయల్ చేసింది. రింగవుతోంది.
‘హాయ్, బిజీగా వుండుంటావని చెయ్యలేదు. వాళ్లిద్దరూ పడుకున్నారు!’
‘........’
‘బాబా? తిన్నట్టున్నాడు. ఉండు చూస్తాను. గిన్నెలో కలిపిచ్చేసాను. టీవీ దగ్గర కూర్చుని తింటానన్నాడు. అయ్యో, అంతా ఇందులోనేవుందే? వదిలేసినట్టున్నాడు. నేనూ చూసుకోలేదు. ఒకవేళ లేస్తే బిస్కెట్లు పెడతాలే!’
‘.......’
‘ఆకలా? ఏదో ఒక్కసారి ఇలా అయిందని ప్రతిసారీ ఇలానే చేసినట్టు మాటాడతావేంటి? అలాగే! గ్యాస్ కట్టేసే వుందో లేదో చూడాలి, ఆలవుట్ ఆన్ చెయ్యాలి, ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు...అంతేనా ఇంకేమన్నా అప్పగింతలున్నాయా?’
నవ్వుతూ మాటాడేసి సంభాషణని లైటర్ వెయిన్లోకి లాగేద్దామని చూస్తున్నాడు. తనకిమాత్రం కళ్లమ్మట నీళ్లొస్తున్నాయి. ఏం అనకుండా ఫోన్ పెట్టేసింది. ఆకలేసినట్టుంటే బాక్స్ వైపు చూసింది. కానీ తినాలన్న ఆశలేదు.
నైట్ డ్యూటీ సిస్టర్స్ మారారు. ఈ షిఫ్టులో పిల్లకి తనంటే చాలాయిష్టం. తను ఫోన్లో మాటాడినవన్నీ వింటుందేమోనని అనిపిస్తుందొక్కోసారి. అలాగని ఎవరితోనూ ఇంకొకరి వ్యవహారాలు చర్చించదు.
మెల్లిగా గదిలోకొచ్చి నిన్న వాళ్లమ్మాయి బర్త్ డే కోసం తను చేశానని, టేస్ట్ చూసి చెప్పమని కేక్ పట్టుకొచ్చి బలవంతంగా తినిపించింది. అదంతా అబద్ధమని, తననలా ఖాళీ కడుపుతో ఉంచడం ఇష్టం లేకనే అలా చెప్పిందని తెలిసిన తరవాత కళ్లలో నీళ్లు రాకుండా ఎలా వుంటాయి?
ఏవో కబుర్లు చెప్పుకుంటూ మొత్తం కేకంతా తినేశాక తెలిసింది తనెంత అలిసిపోయి వుందో? శరీరానికీ, మనసుకీ ఊరట లభిస్తే ఇంకేం కావాలిట? ఇక ఈ రాత్రంతా మెలకువగా వుండి పురుళ్లు పొయ్యమన్నా పోసేస్తుంది తను!
చున్నీని నడుముకి బిగించి ‘పద మేరీ, రౌండ్స్ వేసొద్దాం! ఆ ప్రీటెర్మ్ కేసొకటి ఏడిపిస్తోంది. చేసిపడేద్దామనుకున్నా ఇందాకనే! కానీ చిన్న బేబీయే కదా నార్మల్ డెలివరీ అయిపోతుందేమోనని చూస్తున్నాను!’ అంటూ ఉత్సాహంగా లేచి నిలబడ్డ మేడమ్‌ని చూసి మేరీకి కూడా కళ్లు చెమర్చాయి. కానీ బయటపడలేదంతే!
నిశ్శబ్దంగా స్టెతస్కోప్, ఫీటోస్కోప్ పట్టుకుని మేడమ్ వెనకాలే వెళిపోయింది.
ఆ రాత్రే కాదు. దాదాపుగా అన్ని రాత్రులూ అలానే వుంటాయి. కష్టాలు, ఇష్టాలు మారొచ్చు. వైద్యులు, రోగులూ మారొచ్చు. కానీ ప్రసవ వేదనలు, ప్రచ్ఛన్న రోదనలు ఆ నాలుగు గోడలకూ ప్రతినిత్యం వినబడుతూనే వుంటాయి.
.........జగదీశ్ కొచ్చెర్లకోట
No comments:
Post a Comment