Sunday, September 28, 2025

 234 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయం 18 
శ్లోకం 22 

అసంసారస్య తు క్వా  తు న హర్షో న విషాదతా|
స శీతలమనా నిత్య విదేహ ఇవ రాజతే||

బాహ్య ప్రాపంచిక అనుభవాల నిధిగమించిన స్థితిలో జీవించే వానికి సుఖదుఃఖాలు ఉండవు. శాంతపూర్ణమైన మనసుతో దేహము లేని వానివలె అతడు జీవిస్తాడు.

అహంకారాన్ని అధిగమించగానే మన శరీరాలతో తాదాత్మ్యం అంతరిస్తుంది .సుఖదుఃఖ భావనలు మనసులోనే అనుభవింపబడుతాయి. మనసు యొక్క పరిణామాలే ఈ భావనలు. కోరిన కోరిక సమకూరినప్పుడు మాత్రమే ఈ సుఖదుఃఖానుభవాలు మనసును వశపరచుకొని, అలజడిని కలిగిస్తాయి .జీవన్ముక్తునిలో అహంకారముతో  తాదాత్మ్యం తత్ఫలితమైన కోరికలు ఉండవు. కాబట్టి అతని మనసు సదా శాంతంగా ఉంటుంది. ఆలోచనల అలజడి ఆ మనసులో జనించదు.

దివ్యమైన ఈ అంతరంగ శాంతిని సదా అనుభవిస్తూ తన్ను తాను అనంత చైతన్య స్వరూపంగా తెలుసుకుంటూ జ్ఞాని జీవిస్తాడు. అతని శరీరం శేషించిన 
ప్రారబ్ధాగుణంగా ఇదివరకు వర్ణింపబడినట్టుగా కోరికల రూపమైన అశాంతి లేకుండా సర్వజనసయోదాయకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. అహంకారం అతనిలో ఉండదు. కాబట్టి తరచుగా అతని శరీరం పట్ల అతనికి గల నిర్లక్ష్య భావము గోచరిస్తూ ఉంటుంది .అందుకే అష్టావక్ర మహర్షి "విదేహం ఇవ"... దేహమే లేనట్టుగా సంచరిస్తూ ఉంటాడు అని  జ్ఞానిని వర్ణించారు.

మహోన్నతమైన ఈ స్థితిని వర్ణిస్తూ యోగ వాశిష్టం ఇలా అంటుంది. 
పరమ పావనము అజము అయిన ఆ స్థితిని చేరుకున్న అతని శాంత పూర్ణ మనసు ఎంతటి మహా ఆపదలు వచ్చినా వీసమంతైన చలించదు.🙏🙏🙏

No comments:

Post a Comment