*శ్రీ శివ మహా పురాణం*
*385.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-నాలుగో అధ్యాయం*
*సత్రయాగమునకు వాయుదేవుడు విచ్చేయుట*
*సూతుడు ఇట్లు పలికెను:*
మహాత్ములు, కొనియాడబడే వ్రతము గలవారు అగు మునులు అపుడు ఆ స్థానము నందు మహాదేవుని పూజిస్తూ సత్రయాగమునారంభించిరి. అచట పూర్వము జగత్తును సృష్టించగోరిన ప్రజాపతుల సత్రయాగము వలెనే, సర్వులకు ఆశ్చర్యమును కలిగించే మహర్షుల సత్రయాగము కూడ ఆరంభమయ్యెను. తరువాత కొంత కాలమునకు అధికమగు దక్షిణలు ఈయబడిన ఆ సత్రయాగము పూర్తి అయ్యెను. అపుడు అచటకు బ్రహ్మగారి ఆదేశముచే వాయువు స్వయముగా విచ్చేసెను. బ్రహ్మగారి శిష్యుడు, సర్వమును ప్రత్యక్షముగా దర్శించువాడు, స్వతంత్రుడు అగు వాయుదేవుని ఆజ్ఞను నలభై తొమ్మిది మంది మరుత్తులు పాలించుచుందురు. ఆయన సర్వకాలములలో తన ప్రాణాపానాదివృత్తులతో అవయవములకు కదిలే శక్తిని ఇస్తూ, సర్వప్రాణుల శరీరములను నిలబెట్టుచున్నాడు. అణిమ (తేలికగా అయ్యే సిద్ధి) మొదలగు ఎనిమిది సిద్ధులతో కూడియున్న ఆయన పవిత్రము చేసే గాలులను భూమికి సమాంతరముగా వీచి, లోకములను నిలబెట్టుచున్నాడు. ఆకాశమునుండి పుట్టినవాడు, శబ్దము మరియు స్పర్శ అనే రెండు గుణములు ఉండుటచే ఆకాశము కంటె రెట్టింపు గుణములు గలవాడు అగు వాయువు అగ్నికి కారణమని తత్త్వములను వర్ణించే విద్వాంసులు చెప్పెదరు. ఆశ్రమమునకు విచ్చేసిన ఆ వాయువును చూచి దీర్ఘమగు సత్రయాగమును చేసియున్న మునులు బ్రహ్మగారి మాటలను గుర్తు చేసుకొని, సాటి లేని హర్షమును పొందిరి. అపుడు వారందరు లేచి నిలబడి, ఆకాశపుత్రుడగు వాయువునకు నమస్కరించి, ఆయన కొరకు బంగరు ఆసనమును ఏర్పాటు చేసిరి. ఆయన దానియందు కూర్చుండి మునులచే పూజింబపడినవాడై, వారిని అభినందించి, తరువాత వారిని అందరినీ కుశల ప్రశ్నలను వేసెను.
*వాయువు ఇట్లు పలికెను:*
ఓ బ్రాహ్మణులారా ! ఈ గొప్ప యజ్ఞము కొనసాగుచుండగా మీరు ఇచట క్షేమముగా నుంటిరా ? యజ్ఞములను చెడగొట్టే రాక్షసులు మిమ్ములను బాధించలేదు గదా? ప్రాయశ్చిత్తము గాని, ఆపద గాని ఏదీ సంభవించలేదు గదా ? స్తోత్రములతో, సూక్తములతో, గ్రహములతో (సోమరసమును గ్రహించే పాత్రలు) దేవతలను మరియు పితృకర్మలతో పితృదేవతలను మీరు యథావిధిగా పూజించి, కర్మకాండను చక్కగా అనుష్ఠించినారా? ఈ గొప్ప సత్రయాగము పూర్తి అయిన తరువాత మీరు ఏమి చేయగోరుచున్నారు? శివుని ధ్యానించే వాయువు ఇట్లు పలుకగా, మునులందరు సంతోషముతో నిండిన మనస్సులు గలవారై, వాయువుయొక్క దర్శనముచే పవిత్రులై, వినయముతో కూడినవారై ఇట్లు పలికిరి.
*మునులు ఇట్లు పలికిరి:*
ఈనాడు మాకు సర్వము కుశలము. ఈనాడు మా తపస్సు బాగుగా నున్నది. ఏలయనగా, మాశ్రేయస్సును అభివృద్ధి చేయుట కొరకై నీవు ఇచటకు విచ్చేసితివి. నీవీ పూర్వవృత్తాంతమును వినుము. అజ్ఞానముచే ఆక్రమించబడిన మనస్సులు గల మేము పూర్వము జ్ఞానము కొరకై బ్రహ్మగారిని ఉపాసించితిమి. శరణాగతవత్సలుడగు ఆయన శరణుజొచ్చిన మమ్ములను అనుగ్రహించి, ఇట్లు పలికెను : ఓ బ్రాహ్మణులారా! సర్వకారణకారణుడగు రుద్రుడు అందరి కంటె అధికుడు. తర్కమునకు అందని ఆయన యొక్క స్వరూపమును భక్తి గలవాడు మాత్రమే చూడగల్గును. శివుని అనుగ్రహము వలన భక్తి కలుగును. అనుగ్రహము వలన మాత్రమే మోక్షము కలుగును. కావున, పరమకారణుడగు రుద్రుని అనుగ్రహము కొరకై నైమిషారణ్యములో దీర్ఘకాలము సాగే సత్రయాగమును సాధనముగా చేసుకొని ఆయనను ఆరాధించుడు. సత్రయాగము పూర్తి అయిన పిదప, ఆయన యొక్క అనుగ్రహముచే అచటకు వాయుదేవుడు రాగలడు. అపుడు ఆయన ముఖము నుండి మీకు జ్ఞానము లభించి, శ్రేయస్సు కలుగగలదు. బ్రహ్మగారు ఈ విధముగా ఆదేశించి మమ్ములను అందరినీ పంపివేసెను. ఓ మహాత్మా! మేమీ స్థానములో నీ రాకకొరకు ఎదురు చూచుచున్నాము. మేము వేయి దివ్యసంవత్సరముల కాలము కొనసాగే దీర్ఘసత్రయాగమును చేయుచున్నాము. కావున, నీ రాకను మించి మరియొక దానిని మేము కోరుట లేదు. దీర్ఘమగు సత్రయాగమును చేయుచున్న మునులయొక్క ఈ పూర్వవృత్తాంతమును విని, మునులచే చుట్టువార బడియున్న వాయువు మనస్సులో సంతోషించి, అక్కడ ఉండెను. అపుడా మునులు భక్తి వర్ధిల్లుట కొరకై ఆయనను ప్రశ్నించగా, ఆ ప్రభుడు శివుని యొక్క సృష్టి మొదలగు ఈశ్వరభావమును గురించి సంగ్రహముగా చెప్పెను.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయొక్క పూర్వభాగమునందు వాయుదేవుడు సత్రయాగమునకు విచ్చేయుటను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment