Saturday, September 27, 2025

 *సేతు రహస్యం - 8*
🌊

రచన:  గంగ శ్రీనివాస్


అంతర్జాతీయ పరిశోధన సంస్థల్ని కాంటాక్ట్ చేసి తమకు ఉన్న పలుకుబడి ద్వారా కావలసిన ఎక్విప్మెంట్, నిపుణులు, ఇతర సామాగ్రి సమకూర్చుకోవాలనుకున్నారు అంతా. సముద్రంలో చేయవలసిన పరిశోధనకు కావలసిన రిసెర్చ్ వెసల్ ను కూడా కనీసం మూడు నెలల సమయం కోసం హైర్ చేయాల్సి ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని, కమిటెడ్ మాన్ పవర్ ని ఉపయోగిస్తేగాని తాము చేయలనుకున్న పనిని సంతృప్తికరంగా చేయలేరు. కావలసిన అనుమతులు పొందటానికి తమిళనాడు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాంటాక్ట్ చేయాలి. లోకల్ గా ఉండే రాజకీయ శక్తులను కూడా కలుసుకుని తమ ప్రయత్నాలకు ఎటువంటి బాలారిష్టాలు కలగకుండా చూసుకుంటే మంచిదని రాజేష్ అభిప్రాయపడ్డాడు.

ఇండియాలో రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం ఏమంత సులభమైన పని కాదని, ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతారో తెలియదని సోమదేవ కామెంట్ చేశాడు. ఆ దేశం పట్ల ఉన్న ఒక రకమైన భయంతో కూడిన అనుమానా స్పద భావన ప్రతిఫలించింది అతని మాటలలో..

ఏదేమైనా కావల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ తమపై రాజకీయ ప్రతికూల వాతావరణం పడకుండా ముందే జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నారు.

ఇండియాలో ఉన్న గ్రీన్ గ్రూప్స్ ని కలిసి వారందరిలో తమకు మద్దతు నిచ్చేవారిని కూడగట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ చేయవలసింది కేట్. ఆమెకు సంబంధించిన ఈ పని పై చర్చించుకుంటూ ముందుగా ఒక ప్రెస్ కాన్ఫెరెన్స్ ఇచ్చి అందరి దృష్టి ఆకర్షించుకోవాలనుకున్నారు.

వాటికి ఇతర గ్రీన్ గ్రూప్స్ ని కూడా పిలిస్తే తమకు కూడా మీడియాలో ప్రాముఖ్యం దొరుకుతుందనే ఆశతో వారంతా పార్టిసిపేట్ చేస్తారని భావించారు. ముందుగా తమ ఉద్దేశాన్ని బయటపెట్టి తర్వాత దానికి మద్దతునిచ్చే వారిని కూడగట్టుకుంటూ సంబంధించిన వారిని చైతన్యవంతుల్ని చేయాలనుకున్నారు. అంతేగాకుండా ప్రెజర్ గ్రూప్స్ ని ఎంకరేజ్ చేసి వారి ద్వారా పాలసీమేకర్స్ పైన వత్తిడి తీసుకురావాలని కూడా అనుకున్నారు.

వాళ్ళ ప్రథమ లక్ష్యం రామసేతువు కూల్చి వేతకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయడం. అలాగే పాలసీమేకర్స్ ను తమకి అనుకూలంగా తిప్పుకోవడం. రెండవ లక్ష్యం తమిళ ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించి షిప్పింగ్ కెనాల్ ని వేరే విధంగా ఏర్పాటు చేయడానికి తగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక వాతావరణం కల్పించడం.

అది ఒక బ్రహత్పథకం. దానిలో ఉండే ఈక్వేషన్స్, కౌంటర్ ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలా పనిచేస్తాయో లేదా బెడిసికొడతాయో ఎవరికీ తెలియదు. సమస్య జటిలమవ కుండా సాధ్యమైనంతగా సింపుల్ గా చేయడానికి కావలసిన హోమ్ వర్క్ చేయాల్సి ఉంది.

కేట్ పైన మతపరమైన ఆరోపణలు రాకపో వచ్చు. అది కొంతవరకు నయమే. కాని ఎప్పుడు పరిస్థితి ఎటు మారుతుందో ఊహించలేమని వాళ్ళకు తెలుసు.

టెక్నికల్ పనికి సంబంధించి పరిస్థితిలో స్పష్టత ఉంది గాని కేట్ కి సంబంధించిన ప్రణాళికలో ఎటువంటి స్పష్టత లేదు. ఆలోచించే కొలది రకరకాల కోణాలలో సమస్యలు ఎదురయే అవకాశాలు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి.

పూర్తిగా ఆశావాదాన్ని ఆశ్రయించక, అలాగని నిరాశా వాదంలోను కూరుకు పోకుండా ఆచితూచి వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ తమ ప్రణాళికను తరచుగా మార్చుకోవలసి వస్తుందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కేట్ మీడియాను హేండిల్ చేయగలదని వాళ్ళందరికి తెలుసు. అది ఒక ప్లస్ పాయింట్. అవసరమైతే కష్టాల్లోంచి బయటపడటానికి మీడియాను ఆశ్రయించాలని కేట్ భావించింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇండియాలో రాజకీయాల గురించి ఎలా అనిశ్చిత పరిస్థితి ఉంటుందో అలానే మీడియా కూడా ఏ పరిస్థితికి ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసుకోలేమని తక్కినవారు కేట్ కి చెప్పారు. మీడియాతో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని ఆమెకు నూరిపోసారు.
📖

కేట్ మిగిలిన వారిని రాముడి కథ చదివారా అని అడిగింది. రాజేష్, శ్రీధర్ తెలుసని చెప్పారు గాని చదవలేదన్నారు. సోమదేవ కూడ రామాయణం చదవలేదని అన్నాడు. కేట్ రామాయణం గురించి సరైన నాలెడ్జి ఉండటం తాము చేసేపనికి ఉపయోగపడుతుందని భావించింది.

రామసేతువు గురించి ఒక ముఖ్యమైన పరిశోధన చేస్తూ రామాయణం గురించి, కనీసం రామసేతువుకి సంబంధించిన వరకైనా ఆథెంటిక్ గా తెలుసుకోవడం చాలా ముఖ్యమని వాదించింది.

ఆమె చెప్పింది విని అంతా ఆలోచించారు. తను చెప్పినది నిజమేననిపించింది. రామసేతువు గురించి తాము స్వయంగా చదవలేకున్నా ఆథెంటిక్ గా తమకు ఆ విషయాన్ని వివరించి చెప్పగల వారినైనా కలుసుకొని తెలుసుకోవాలనుకున్నారు.
అది ఒక ముఖ్యమైన పనిగా గుర్తుంచుకొని ఇండియాలో దిగగానే అందుకు ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నారు.

రామాయణాలు అనేకంగా రచించబడ్డాయి. వాటిలో కవులు తమకు నచ్చిన అనేక అంశాలను చేర్చడమో, మార్చడమో చేసారు. అయితే వాల్మీకి రామాయణమొక్కటే ఆథెంటిక్ గా భావించవలసివస్తుంది. రామసేతువు లాంటి ఒక బ్రహ్మాండమైన నిర్మాణాన్ని కట్టించిన వివరాలు రామాయణంలో తప్పక పొందుపరచబడి ఉంటాయని వాళ్ళకు గట్టిగా అనిపించింది..

సీతమ్మను అన్వేషిస్తూ వెళ్ళిన బృందాల్లో హనుమంతుని బృందం రామకథను ఒక మలుపు తిప్పింది. అలాగే సేతు బంధనం కూడా రామాయణంలోని అతి ముఖ్య సంఘటన. రామాయణంలోని క్లైమాక్స్ అనదగిన రావణవధ అనే అంశానికి రామ సేతువు నిర్మించబడటమే తొలి అడుగుగా భావించవచ్చు. అందువలన రామసేతువు కి సంబంధించిన అసలు విషయాన్ని, ఆ వివరాలను వాల్మీకి రామాయణంలోనివి ఉన్నవి ఉన్నట్లుగా తమకు వివరించగలిగే వారికోసం ఇండియాలో దిగగానే ప్రయత్నించాలని అనుకున్నారు.

రామసేతువుకి సంబంధించిన అసలు విషయాలతో పాటు హృద్యమంగా అనిపించేవి, అద్భుతంగా అనిపించేవి అనేక కల్పిత విషయాలు తర్వాత వచ్చిన రామాయణాలలో చేరి ఉండవచ్చని, అందువలన వాల్మీకి రామాయణాన్ని మాత్రమే తాము ప్రమాణంగా తీసుకోవాలని అనుకున్నారు..

ఈ సంభాషణలో పడి సమయం ఎంతైందో కూడా గమనించలేదు. లంచ్ అవగానే మొదలైన చర్చలు, డిన్నర్ టైమ్ కావచ్చే వరకు కొనసాగాయి. సీరియస్ డిస్కషన్స్ ను పక్కన పెట్టి డిన్నర్ తీసుకొని విశ్రమించడానికి ఉద్యుక్తులయ్యారు.

కేట్ కి శ్రీధర్ పైన బాగా చనువు ఏర్పడి
పోయింది. అతను తను ఎప్పటి నుంచో ఒకరినొకరు తెలుసుకొని కలసి ఉండే వాళ్ళమన్నట్లు ఫీలయింది. తన చిన్ననాటి విషయాలన్నీ అతనికి చెబుతూ అతని విషయాలు వింటూ మైమరచిపోయింది. అలా కబుర్లు చెబుతూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది, అతని భుజాన్నే తన తలదిండుగా చేసుకొని.

శ్రీధర్ కి చాలాసేపు నిద్రపట్టలేదు. తను చేయబోయే పనులను గురించి ఆలోచనల తో మస్తిష్కం వేడెక్కిపోయింది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది తమ ఎసైన్మెంట్. కొన్నిసార్లు ప్రిమానిషన్ లాగా తాను చేయబోతున్న పనులు సాఫల్యం పొందుతాయో లేదో ముందే తెలుస్తూ ఉంటుంది శ్రీధర్ కి. అతనికి గట్టిగా అనిపించింది తమను ఏదో శక్తి ముందుకు నడిపిస్తున్నదని, తాము తప్పక సక్సెస్ అవుతామని.

జరగబోయేది రామకార్యం. ఆనాడు హనుమంతుడు ముందుండి నిర్మింపచేసిన రామసేతువుకి సంబంధించిన ఆనవాళ్ళని అందరికీ నమ్మకం కలిగించేలా శాస్త్ర సమ్మతంగా తెలియచేయగలమని అతనికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తాము చేస్తున్న పనిలో జయం పొందగలమనే విశ్వాసం ఉండటం శుభసూచకం. అది చాలా అవసరం కూడా, లేదంటే మధ్యలో నే నిరాశకు లొంగి సంపూర్ణ ప్రయత్నం చేయక దారి నుంచి తప్పుకుంటారు.

కేట్ తమకొక ఎసెట్. ఆమె ఆలోచనలు చాలా స్పష్టతను కలిగి ఉన్నాయి. అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండటం, పరిశోధనలో చాలా ఉపయోగపడుతుంది. అదీగాక ఆమె తన మనసులో టైరా చేసిన గాయాన్ని మాన్చి ఆ వెలితిని నింపి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని కలిగించింది. అది కూడా కేవలం తన ప్రెజన్స్ తోనే. అంతటి అద్భుతం అతను అంతకు ముందు ఊహించలేదు. ఎవరైనా చెప్పినా నమ్మేవాడు కాదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
రామాయణం గురించి కేట్ చేసిన ఆర్గ్యుమెంట్ అతని మనసులో మెదిలింది. అద్భుతంగా వాదించింది. అంతటి ముఖ్యమైన విషయాన్ని తాము విస్మరించటం చాలా ఆశ్చర్యంగా ఉంది. తమ పరిశోధనకు అవధులు ఏర్పరుచు కోవడం సాధ్యం కాదనిపించింది శ్రీధర్ కి. రామసేతువు పరిశోధన తాము అనుకున్న స్థలాలకే కాక ఇంకా వేరే చోట్లకు కూడా పాకవచ్చని అతనికి గట్టిగా అనిపించింది. అది నిజం కాబోతుందని అప్పటికింకా శ్రీధర్ కి తెలియదు. ఊహించని ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని కూడా అతనికి తెలియదు.

ఆలోచనల మధ్య చాలాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు శ్రీధర్ కూడా. నిద్రలో ఒక్కసారి కూడా కదలలేదు, కేట్ కి నిద్రా భంగం కాకూడదని. పసిపాపలా నిశ్చితం గా నిద్రపోయింది కేట్.
📖

పాలం ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని లగేజి కలెక్ట్ చేసుకొని తమను రిసీవ్ చేసుకోవడానికి మోడి ఏర్పాటు చేసిన వారితో కలసి హోటల్ కి వెళ్ళిపోయారు. ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళి విశ్రమించారు. బ్రేక్ ఫాస్ట్ లేట్ గా చేసి బద్దకంగా తయారై అందరూ కేట్ రూమ్ లో సమావేశమయ్యారు. ఢిల్లీలో మోడి ఆర్గనైజ్ చేసిన వ్యక్తి పేరు దీన్ దయాళ్ శర్మ. అతనికి ప్రభుత్వ వర్గాల్లో మంచి పలుకుబడి ఉంది. కేట్ కలవవలసిన గ్రీన్ గ్రూప్స్ ని కూడా అతను అప్పటికే అలర్ట్ చేసి ఉంచాడు.

దీనదయాళ్ శర్మతో మాట్లాడి అక్కడి విషయాలు తెలుసుకున్నారు శ్రీధర్ తదితరులు. డా|| సోమదేవ ఆరోజే వెళ్ళి ఆర్కియాలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీట్ అవుతానని అన్నాడు. రాజేష్ సైట్ సీయింగ్ కి వెళ్తానన్నాడు. కేట్, శ్రీధర్ లు గ్రీన్ గ్రూప్ వారితో మాట్లాడడానికి, ఎక్సకవేషన్ టీమ్ లను, రిసెర్చ్ వెసల్ ను హైర్ చేయటానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడానికి నిశ్చయించుకున్నారు.

డా॥ సోమదేవ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్ కి వెళ్ళి అక్కడి డైరెక్టర్ గుప్తాని కలిసాడు. గుప్తాతో సోమ దేవకు చాలా స్నేహం ఉంది. అందువలన సోమదేవను గుప్తా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు.

సోమదేవ క్లుప్తంగా తను వచ్చిన పని గురించి వివరించాడు. గుప్తా అంతా ఆసక్తిగా విన్నాడు. సోమదేవ అడిగిన పర్మిషన్స్ గురించి విని పెద్దగా నవ్వుతూ "నువ్వేమైనా కలకంటున్నావా? ఆర్కియా లాజికల్ సైట్స్ ని ఇంకా ప్రైవటైజ్ చేయలేదు అని తెలియదా?" అన్నాడు.

"ప్రైవటైజేషన్ ప్రసక్తి తీసుకురాకు. మేము చేయాలనుకున్నది రీసెర్చి. ఒక పరిశోధన కు, ప్రైవటైజ్ చేయడానికి తేడా లేదంటావా?"

"ఎందుకు లేదూ, తేడా ఉంది. కానీ భారత భూభాగంలో విస్తృతంగా మీరు చేయాలని అనుకున్న పరిశోధనను ప్రభుత్వం అంత సానుకూలంగా చూడదు.”

"ఏం ఎందుకని! మేమేమి ఇక్కడి బంగారం తవ్వి పరదేశాలకు తీసుకుపోవటం లేదు కదా”..

"ఏం అలా ఎందుకు జరగకూడదు. మీరు తవ్విన సైట్స్ లో బంగారం జాడ దొరికితే దాని పైన మీరు అధికారం కోసం ప్రయత్నిస్తే అలాగే ఇంకా ఏవైనా విలువైన సమాచారం లేదా సంపద బయటపడి, అది మా చేయి జారిపోతే”.

"కూల్ గుప్తా, అంతదూరం ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఈ పని చేయడం వలన అన్ని లాభాలు మీకు మాత్రమే లభించేలా కండిషన్ పెట్టుకోండి. మాకేమి అభ్యంతరం లేదు. డబ్బు మాది. రీసెర్చి మాది. ఫలితాలు మీవే. కావాలంటే జాయింట్ ఎక్సర్ సైజ్ లాగా చేద్దాం. ఏమంటావ్" అన్నాడు సోమదేవ.

"అవన్నీ వీలుపడవు. రామసేతువు ఇష్యూ చాలా సెన్సిటివ్. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి చేయి కాల్చుకుంది. 'ఒన్సు బిట్టెన్ ట్వైస్ పై' అన్నట్లు ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారం దొరకదు. జాయింట్ ఎక్సర్సైజ్ గురించి నువ్వు మాట్లాడకపోవటమే మంచిది.”
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"మరి మార్గమేమిటో చెప్పు మిత్రమా" ఇక తనవల్ల కాలేదని చేతులెత్తేశాడు సోమదేవ.

"డైరెక్టర్ జనరల్ తో మాట్లాడాలి. ఇక్కడ లోకల్ యూనివర్సిటీల ప్రమేయంతో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలి. దానికి ఫారెన్ ఫండ్స్ లభిస్తాయి. కావల్సినంత మనీ, ఫారెన్ ట్రిప్పులు ఉంటాయి. డబ్బుకి డబ్బు పేరుకి పేరు” అన్నాడు గుప్తా ఆలోచిస్తూ.

"అంటే లంచమా” వెక్కిరింపుగా అడిగాడు సోమదేవ.

"లేదు మైడియర్, లంచం గురించి మాట్లాడటం లేదు. ఫైనాన్స్ ఒక అవరోధం కాకపోతే మా యూనివర్సిటీలు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాయి. అందులోనూ మా రిసెర్చ్ స్కాలర్స్ సెకండ్ టు నన్. వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ కి అవకాశం వస్తుంది. ఇటువంటి అవకాశాలు తేలికగా
వదులుకోరు" అన్నాడు గుప్తా.

“థాంక్స్ మంచి దారి చూపించావు. అలాగే ఆ యూనివర్సిటీ కూడా నువ్వే ఆర్గనైజ్ చేయి, మాకు చాలా శ్రమ తప్పుతుంది. నీ రిఫరెన్స్ తీసుకొని వాళ్ళను కాంటాక్ట్ చేస్తాను" అన్నాడు సోమదేవ సంతోషంగా.

ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తో మాట్లాడి అపాయింట్ మెంట్ తీసుకున్నాడు గుప్తా. సోమదేవతో కూడా మాట్లాడించి వారికి ఫోన్ లోనే పరిచయం చేసాడు.

యూనివర్సిటీతో మెమొరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ చేసుకొన్న తర్వాత వి సి తో కలిసి డైరక్టర్ జనరల్ ని కలవమని సజెస్ట్ చేసాడు.
📖

రాజేష్ శ్రీధర్ ను కేట్ తో ఒంటరిగా వదలటానికి సైట్ సీయింగ్ అని చెప్పాడు కాని అతని అసలు ఉద్దేశం వేరు. తిన్నగా ఆంధ్రలోని తమ బంధువులను కాంటాక్ట్ చేసాడు. రాజేష్ ఢిల్లీ వచ్చిన విషయం తెలిసి "హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా” అని అడిగారు వాళ్ళు. వీలు చూసుకొని వస్తానని చెప్పి తనకు రామాయణం పైన అథారిటీగా కామెంట్ చేయగల వ్యక్తితో అవసరం కలిగిందని చెప్పాడు.

ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట కూడా పలకని రాజేష్ హఠాత్తుగా రామాయణం గురించి అథారిటేటివ్ గా తెలుసుకోవాలనుకుంటే విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఏమైనా సన్యాసం తీసుకొనే ఉద్దేశంలో ఉన్నాడా అని కొంచెం అనుమానించారు కూడా.

స్టేట్స్ లో జరిగిన విషయాలు, తాము ఇప్పుడు ప్రత్యేకమైన పనిపై రావటం గురించి వాళ్ళకు చెప్పాడు రాజేష్. రామాయణ రహస్యాలు విడమరచి చెప్పగల స్వామీజీ కాని మరెవరైనా కాని వాళ్ళకు తెలిస్తే చెప్పమని లేదా తెలుసుకు నైనా చెప్పమని అడిగాడు.

లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఉన్నపళం గా అటువంటి విజ్ఞాన ఖనిని ఎలా పట్టుకొనేది, కొంచెం టైమ్ కావాలని చెప్పారు వాళ్ళు.
🌊
*సశేషం*  ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment