Saturday, September 27, 2025

 _[-యండమూరి వీరేంద్రనాథ్ గారి “బేతాళ ప్రశ్నలు”.. పుస్తకం నుంచి ఈ అంశం... 🙏]_ 

*_|| అసత్యదీవి ||_*
==================
*పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు వెళ్లి శవాన్ని భుజాన వేసుకుని వెనుదిరిగి మౌనంగా నడవసాగాడు. అతడికి మౌనభంగం కావించటానికి శవంలోని బేతాళుడు ఈ విధంగా చెప్పసాగాడు.*

*“రాజా! జన్మలో ఎప్పుడో ఒకప్పుడు అసత్యం చెప్పనివాడు అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కానీ అసత్యదీవి అని ఒకటున్నది. అక్కడి ప్రజలందరూ నిరంతరం అబద్ధమే చెపుతూ ఉంటారు. చిత్రహింస పెట్టినా నిజం చెప్పరు. వీరివల్ల సత్యం తెలుసు కోవాలంటే ఒకటే మార్గం! వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవటమే! ‘ఈ పండు విషపూరితం కాదు. తినవచ్చు' అని ఆ దీవిలో ఎవరైనా చెప్తే, ఆ పండు నిజంగా విషమే. ఆ దీవికి కొంతదూరంలో 'సత్యదీవి' అని మరొక దీవి ఉన్నది. చిత్రమేమిటంటే, ఆ దీవిలో అందరూ నిజమే చెప్తారు. ప్రాణం పోయినా అసత్యమాడరు.*

*చంద్రగుప్తుడనే రాజు ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా, ఒక పడవలో ముగ్గురు ఓడ దగ్గరికి వచ్చారు. తమ తమ దీవుల్లో దొరికే వస్తువుల్ని అమ్మటం కోసం వారు వాటిని రాజుకి, మంత్రికి చూపించారు. మంత్రి పేరు సుబుద్ధి. బహువిధ శాస్త్ర ప్రావీణ్యుడు. వారి వస్తువుల్ని పరీక్షిస్తూ రాజు "నువ్వు ఏ దీవికి సంబంధించినవాడివి?” అని ఆ ముగ్గుర్లో ఒకర్ని అడిగాడు. పక్కనున్న సుబుద్ధి సన్నగా నవ్వటం చూసి, ఆ వృద్ధుడివైపు తిరిగి "ఎందుకు మంత్రివర్యా ఆ మందహాసం? నా ప్రశ్నలో ఏమైనా తప్పు ఉన్నదా?” అని అడిగాడు రాజు.*

*అవునన్నట్టు తలూపుతూ, మంత్రి... “ఏ దీవి నుంచి వచ్చినవాడైనా, తాను సత్యదీవి నుంచి వచ్చాననే చెపుతాడు కదా” అన్నాడు. మంత్రి మాటలు అర్థమవటానికి రాజుకి కొంచెంసేపు పట్టింది. 'నిజమేకదా' అనుకున్నాడు. ఈ లోపులో రాజు పక్కన నిలబడి ఆల్చిప్పల్ని, శంఖాల్ని పరిశీలిస్తున్న రాకుమార్తె, అందులోని ఒకర్ని “వారిద్దరూ ఒకే దీవి నుంచి వచ్చారా?” అని అడిగింది. అతడు 'అవును' అన్నాడు. రెండో వ్యక్తిని కూడా అదే ప్రశ్న వేసింది. అతడు కూడా ఆ సమాధానమే చెప్పాడు. మూడో వ్యక్తిని అదే ప్రశ్న వేయబోతూండగా మంత్రి కల్పించుకుని "అనవసరం రాకుమారీ! అతడు కూడా అదే సమాధానం చెపుతాడు" అన్నాడు.*

*రాకుమార్తె పేరు పద్మజనేత్ర. తన విశాలమైన కనులని మరింత పెద్దవి చేస్తూ “అదెలా చెప్తాడు మహామంత్రీ? అందులో ఒకరు ఒక దీవి నుంచి వచ్చిన వ్యక్తి, మరొకరు మరొక దీవి నించి వచ్చిన వ్యక్తి అయి వుండవచ్చు కదా" అన్నది. మంత్రి నవ్వి ఊరుకున్నాడు. అతడు ఎందుకు సమాధానం చెప్పలేదో రాజుకి అర్థమయింది. చిన్నపిల్ల అయిన పద్మజనేత్రకి ఆ తర్కం చెప్పినా అర్ధం కాదని, కూతురికి తన మంత్రి అందుకే సమాధానం చెప్పలేదని అనుకున్నాడు. నిజానికి రాజుకి కూడా అర్ధం కాలేదు.*

*¥ ¥ ¥ ¥ ¥*

*"విక్రమార్కా! అందులోని తర్కం నేన్నీకు చెప్తాను విను. వచ్చినవారు రాముడు, భీముడు, కృష్ణుడు అనుకుందాం. రాకుమార్తె రాముడిని "మిగతా ఇద్దరూ ఒకే దీవి నుంచి వచ్చారా?" అని అడిగింది. "అవును" అన్నాడు రాముడు. అతడు ఏ దీవికి సంబంధించినవాడో మనకి తెలీదు. రాముడు సత్యదీవివాడైతే, మిగతా ఇద్దరి సంగతీ నిజమే చెప్తాడు కదా! అలా కాకుండా, అతడు అసత్యదీవికి చెందినవాడైతే, అతడు చెప్పేది అబద్ధం కాబట్టి, భీముడు కృష్ణుడు వేర్వేరు దీవుల వారైవుండాలి. అప్పుడు వారిద్దరిలో ఒకరు నిజం చెప్పేవారు, మరొకరు అబద్ధం చెప్పేవారు అవుతారు. రెండో వ్యక్తిని రాకుమార్తె అదే ప్రశ్న వేసింది. అతడు కూడా "మిగతా ఇద్దరూ ఒకే దీవికి చెందినవార"ని రాకుమార్తెకి చెప్పాడు. అతడు నిజం చెప్పేవాడో, అబద్ధం చెప్పేవాడో మనకి అనవసరం. అతడేం చెప్తాడో, మూడో మనిషీ అదే చెప్తాడు. ఏ దీవినుంచి వచ్చిన వారైనా ఇద్దరూ ఒకే సమాధానం చెపుతారని అంతకు ముందే మంత్రి రాజుకి చెప్పాడు కదా! అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుంది.*

*ఇది కాస్త కష్టమైన అవగాహన, తర్కానికి పరాకాష్ట. ఇంతజ్ఞానం చంద్రగుప్త మహారాజుకి లేదు. అతడు కేవలం పరాక్రమాన్ని నమ్ముకున్న వాడు. మంత్రి తన పక్కనున్నంత వరకూ అతడికి తెలివితేటల అవసరం అంతగా రాలేదు. కొద్ది రోజులకి వచ్చింది. రాజా! శ్రమ తెలియకుండా ఆ కథ కూడా చెపుతాను విను.*

*రవికిరణుడు అనే పొరుగుదేశపు యువరాజూ, పద్మజనేత్ర ప్రేమించు కున్నారు. పేర్లు కలిసినట్టే వారి హృదయాలు కూడా ఒకరి చూపుకోసం మరొకటి తపించసాగాయి. ఒక ఉద్యానవనంలో అతడి రవికిరణాలకి ఆమె కలువలు విచ్చుకుంటున్న సమయంలో చంద్రగుప్తుని సైనికులు రవికిరణుని బంధించారు. అయితే అది అంత సులభంగా జరగలేదు. దాదాపు వందమంది సైనికులు కలిసి సింహాన్ని బంధించినట్టు బంధించవలసి వచ్చింది. రాజకుమారుణ్ని అతిథి గృహ దిగ్బంధనంలో పెట్టారు.*

*అతడి విషయం ఏం చెయ్యాలా అని చంద్రగుప్తుడు మంత్రిని సంప్రదించాడు. "అతడి పరాక్రమం కళ్ళారా చూశాము కదా! అంతటి శూరుడు దొరకడు. వివాహం చేయండి మహారాజా! అతను చేసింది తప్పే కాని అతడిని శిక్షిస్తే పక్కరాజ్యంతో అనవసరంగా శత్రుత్వం వస్తుంది" అన్నాడు మంత్రి.*

*ఆ సలహా నచ్చలేదు. దేశప్రజల ముందు పరువు పోతుందని ఆయన అభిప్రాయం. అప్పుడు మంత్రి ప్రజలందరూ వింటూండగా నిండుసభలో ఈ విధంగా ప్రకటించాడు. "రవికిరణా! నీ అదృష్టాన్ని విధి నిర్ణయిస్తుంది. రేపు రెండు గదుల్లో ఒకదాన్ని నువ్వు ఎన్నుకోవలసి ఉంటుంది. ఒక గదిలో రాకుమార్తె పూలమాలతో నిలబడి ఉంటుంది. మరొక గదిపైన విషపూరిత కత్తి వేలాడుతూ ఉంటుంది. మీ ఇద్దరి వివాహం భగవంతుడికి ఇష్టమైన పక్షంలో మీ వివాహం జరుగుతుంది. లేని పక్షంలో నీవు మరణానికి సిద్ధం కావలసి ఉంటుంది. దీనికి నీకు సమ్మతమేనా?" అని అడిగాను.*

*రాకుమారుడు దీనికి తన అంగీకారం తెలిపాడు. అప్పుడు మంత్రి కొనసాగించాడు. "రెండు గదుల ముందూ ఇద్దరు కాపలాదార్లు ఉంటారు. అందులో ఒకరు ఎప్పుడూ అబద్ధమే చెప్పే అసత్యదేవివాడు. రెండవవాడు ఎప్పుడూ నిజం చెప్పే సత్యదీవి నివాసుడు. అందులో ఎవరో ఒకర్ని, కేవలం ఒకే ఒక ప్రశ్న వేసే అవకాశం నీకిస్తాం" అన్నాడు.*

*ఆ సాయంత్రం రాకుమార్తె సుబుద్ధిని కలుసుకుని వేదనగా "ఇది అన్యాయం మంత్రివర్యా! అబద్ధం చెప్పే కాపలాదారుకు, నిజం చెప్పే కాపలాదారుకు కూడా విషం గదిని చూపించి "విషం కత్తి గది ఇదేనా" అని అడిగితే ఒకరు అదే నంటారు. మరొకరు కాదంటారు. ఇలాంటి పరీక్ష పెట్టడం మీకు భావ్యమేనా? విషం గది ముందు అబద్ధాల దీవి వాడు ఉన్నాడనుకుందాం. దురదృష్టవశాత్తు రాకుమారుడు అతడిని నా గురించి ప్రశ్నిస్తే, అది మృత్యుగదిలో ప్రవేశించటమేగా" అని అంది.*

*అప్పుడు సుబుద్ధి "తెలివైనవారు అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడరు తల్లీ! ఆ రోజు పడవలో ముగ్గురు వ్యక్తులు కలిసినప్పుడు నా సంభాషణ గుర్తు చేసుకో” అన్నాడు.*

*క్షణాల్లో అతడు చెప్పింది ఆమెకు అర్థమై కళ్లు మిలమిలా మెరిశాయి. ఆ రాత్రే చెలికత్తె ద్వారా యువరాజుకి మరుసటిరోజు కాపలాదారుని ఏ ప్రశ్న అడగాలో వార్త పంపింది. ఆపై వారి వివాహం ఘనంగా జరిగింది."*

*ఇంతవరకూ చెప్పి బేతాళుడు విక్రమార్కుడితో, "రాజా! రాకుమార్తె తన ప్రియుడికి పంపిన ప్రశ్న రూపం ఏమై ఉంటుంది? దానికీ పడవలో వ్యక్తులకి సంబంధం ఏమిటి? తెలిసీ దీనికి సమాధానం చెప్పక పోయావో నీ తల వేయి ప్రక్కలవుతుంది సుమా" అన్నాడు. దానికి సమాధానంగా విక్రమార్కుడు ఈ విధంగా చెప్పాడు.*
_(ఇక ఇప్పుడు సమాధానం చూడండి...)_
-----------------

*"నువ్వు నిజం చెప్పేవాడివా? అసత్యవంతుడివా?" అని అడిగితే, ఇద్దరూ సత్యవంతులమే అంటారు. కాబట్టి ఆ ప్రశ్న వల్ల లాభం లేదు. అయినా, కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడగాలి కాబట్టి, ఇద్దరూ ఒకే సమాధానం చెప్పే ప్రశ్న తయారు. చెయ్యాలి. ఆ ప్రశ్న గమ్మత్తుగా ఉండాలి.*

*(+1) × (-1) = (-1) అదే విధంగా (-1) × (+1) కూడా (-1) అవుతుంది. అటువంటి ప్రశ్న తయారు చెయ్యాలి. "రాకుమార్తె నీ గదిలో ఉన్నదా-- అని ఆ రెండో కాపలాదారుడిని అడిగితే అతడేం సమాధానం చెప్తాడు?" అని మొదటి కాపలాదారుడిని యువరాజు అడగాలి.*

*ఈ ప్రశ్నకి మొదటి కాపలాదారు సత్యవంతుడైతే, రెండోవాడు... (అంటే అబద్ధం వాడు) ఏం చెప్తాడో అదే చెప్తాడు. అంటే అది అబద్ధం.*

*మొదటి కాపలాదారు అబద్దాల దీవి వాడైతే, నిజం చెప్పేవాడు ఏం చెప్తాడో దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అదీ అబద్ధమే, ఆవిధంగా ఇద్దర్లో ఎవరు చెప్పినా అబద్ధం బయట పడుతుంది. ఒక ఉదాహరణ ద్వారా ఇది బాగా అర్ధమవుతుంది.*

*రాకుమారుడు మొదటి కాపలాదారయిన సత్యవంతుడి దగ్గరకి వెళ్ళి "నీవు కాపలా కాస్తున్న గదిలో రాకుమార్తె వున్నదా-- అని నీ పక్క మనిషిని అడిగితే అతడు. ఏం సమాధానం చెపుతాడు?" అన్న ప్రశ్న అడిగాడనుకుందాం.*

*ఇప్పుడు రెండు రకాల అవకాశాలున్నాయి. అసత్యవంతుడి గదిలో రాకుమార్తె ఉండటం, ఉండకపోవటం, ఒకవేళ ఉందనుకుందాం. అప్పుడు.... అసత్యవంతుడు ఏం సమాధానం చెపుతాడు? "నా గదిలో రాకుమార్తె లేదు యువరాజా!" అని అబద్ధం చెపుతాడు కదా! కాబట్టి సత్యవంతుడయిన కాపలాదారు, రెండో కాపలాదారు ఏమి జవాబు చెపుతాడో అదే చెపుతాడు. "లేదని అంటాడు. యువరాజా ఆ కాపలాదారు" అని చెపుతాడు.*

*రాకుమారుడికి ఎవరు సత్యవంతుడో, ఎవరు అసత్యవంతుడో తెలీదు. పొరపాటున అసత్యవంతుడి దగ్గరికి వెళ్ళి "తాను కాపలాకాస్తున్న గదిలో రాకుమార్తె ఉన్నదా- అని నీ పక్క మనిషిని అడిగితే అతడు ఏం సమాధానం చెపుతాడు?" అని అదే ప్రశ్న అడిగాడనుకుందాం, అసత్య వంతుడెప్పుడూ అబద్ధమే చెపుతాడు కాబట్టి "తన గదిలో రాకుమార్తె లేదని అతడు చెపుతాడు యువరాజా” అంటాడు.*

*కాబట్టి - సత్యవంతుడు చెప్పినా, అసత్యవంతుడు చెప్పినా "లేదు" అనే  గదిలో రాకుమార్తె ఉంటుంది. ఉందన్న గదిలో రాకుమార్తె ఉండదు.*

*అసత్యాన్ని సత్యవంతుడు "అసత్యం" అంటాడు. సత్యాన్ని అసత్యవంతుడు కూడా "అసత్యం” అనే అంటాడు. అదే ధర్మం ఇక్కడ వర్తిస్తుంది."*

*రాజుకీ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.*
~~~~~~~~~~~~~~~~~~
*_{ఇలాంటి విషయాలు ఇటు పెద్దలు, ఉపాధ్యాయుల మరియు అటు పిల్లల మెదళ్ళను బాగా పదును పెడతాయి. ఒక సమస్య వచ్చినప్పుడు భయపడకుండా, వివిధ కోణాలలో పరిష్కారాన్ని ఆలోచించే ప్రయత్నం చేయడం కదా.. కావాల్సింది! అలాగే సమయం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు కూడా! అంతేకదండీ! : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment