Sunday, September 28, 2025

 5️⃣0️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  

*69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీl*
 *యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే:ll*

అందరూ నిద్రపోతున్న సమయంలో, ద్వంద్వాలను సమానంగా చూచేవాడు అయిన సంయమీంద్రుడు అంటే స్థితప్రజ్ఞుడు, మేల్కొని ఉంటాడు. అలాగే అందరూ మేలుకొని ఉన్న సమయంలో ముని అయిన వాడు నిద్రపోతాడు.

ఇక్కడి నుండి పరమాత్మ మరొక విషయం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అదే బ్రాహ్మీస్థితి. అలౌకిక స్థితి. సిద్ధపురుషుడి స్థితి. ఈ శ్లోకాలను చిక్కుముడి శ్లోకాలు అని అంటారు. ఓ పట్టాన అర్థం కావు. నిశితంగా పరిశీలిస్తే గానీ బోధపడవు. ఇందులో చెప్పింది ఏమిటంటే అజ్ఞానులకు ఏది రాత్రి అయితే అది జ్ఞానులకు పగలు. జ్ఞానులకు రాత్రి అజ్ఞానులకు పగలు. ఇది కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వివరంగా చెప్పాలంటే, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేవాడికి పరమాత్మ గురించి గానీ, ఆత్మజ్ఞానము గురించి గానీ తెలియదు. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎప్పుడూ ధనం సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం, భార్య పిల్లలు బంధువులు, మిత్రులు, సంసారము, ఆస్తిపాస్తులు వీటి గురించే ఆలోచిస్తుంటాడు. ఆత్మతత్వము గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు. ప్రయత్నం కూడా చేయడు. అటువంటి వారి దృష్టికి ఆత్మజ్ఞానము అనేది కనిపించదు. రాత్రి పూట మనకు వస్తువులు కనిపించనట్టే, సంసారంలో మునిగిన వాడికి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము కనిపించవు. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము వరంగా వారు చీకట్లో ఉన్నట్టే లెక్క. అంటే వారికి అది రాత్రి. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము విషయంలో వారు నిద్రపోతుంటారు.

కాని సంయమీంద్రులు, జ్ఞానులు, వివేకము కలవారు, వీరు మాత్రము ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము గురించి నిరంతరము ఆలోచిస్తుంటారు. మెలుకువగా ఉంటారు. అంటే వారికి నివృత్తి మార్గం ఎల్లప్పుడూ వెలుగుతో నిండి ఉంటుంది. ఆధ్యాత్మికత పరంగా వారికి అది పగలు. ప్రాపంచిక విషయాలు, విషయసుఖాలు, వీటి విషయంలో వారికి ఆసక్తి ఉండదు. వాటి వంక చూడరు. అవి ఉన్నా వారికి లేనట్టే. అసలు వారి కంటికి విషయవాంఛలు కనపడవు. అంటే ప్రాపంచిక విషయాలు, విషయవాంఛల పరంగా వారు చీకటిలో అంటే రాత్రిలో ఉన్నట్టు లెక్క. ఇదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే కొన్ని జంతువులు పగలు చూడలేవు. వాటికి రాత్రిళ్లు మాత్రమే కళ్లు కనపడతాయి. గుడ్లగూబ, పెళ్లి మొదలైనవి. మానవులుకూడా కొంత మంది రాత్రిళ్లు పబ్బులలో, క్లబ్బులో తెల్లవార్లుమేలుకొని, పగలంతా నిద్రపోతారు. మరి కొందరు ధనసంపాదనలో మునిగితేలుతూ జీవితం అంతా రాత్రిళ్లు పనిచేస్తూ పగలు నిద్రపోతారు. అటువంటి వారు ధనసంపాదనకు, శరీరసుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వారు ఆధ్యాత్మికత దృష్ట్యా రాత్రిలో అంటే చీకటిలో ఉన్నట్టే లేక్క

పైన చెప్పినట్టు అజ్ఞాని గుడ్లగూబతో సమానము. అది రాత్రి మాత్రమే చూస్తుంది. అది సూర్యుని వెలుగు చూడలేదు. రాత్రేసర్వస్వం అనుకుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది రాత్రి 2, 3 గంటల దాకా పబ్బులు క్లబ్బులలో గడుపుతారు. తెల్లవారి 9 కూడా లేవరు. వారికి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఎల్లప్పుడూ ఎసి. పగలుకూడా సూర్యరశ్మిని చూడలేరు... అలాగే జ్ఞాని ఆత్మను, ఆత్మసుఖాన్ని చూడగలడు, అజ్ఞాని కేవలం ప్రాపంచిక సుఖములు మాత్రమే చూడగలడు. జ్ఞానికి కనిపించేది అజ్ఞానికి కనిపించదు. అజ్ఞాని చూచేది అనుభవించేది జ్ఞానికి కనిపించదు. జ్ఞానికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని, వేరు వేరు దారులలో ప్రయాణం చేస్తుంటారు. దానిని వర్ణించడానికి వ్యాసుల వారు అజ్ఞానికి పగలు జ్ఞానికి రాత్రి అనీ, జ్ఞానికి పగలు, అజ్ఞానికి రాత్రి అని నిర్వచించాడు.

సత్యం కనుక్కోడానికి జ్ఞాని మేలుకొని ఉంటాడు. ప్రాపంచిక విషయాలను అనుభవించడానికి అజ్ఞాని మేలుకొని ఉంటాడు. ప్రపంచం నిద్రపోయినపుడు అజ్ఞాని నిద్రపోతాడు. జ్ఞాని నిశ్చలంగా ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే సాధారణంగా మానవులు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానము అంటే చీకటి. వెలుగు కనపడదు. అందుకే అజ్ఞానాంధకారము అని వాడుతుంటారు. ఆ చీకట్లో వారు ఆత్మను చూడలేరు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. చీకటి జీవితం అంటే ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు. అదే వెలుగు అనుకుంటారు. అంటే ఆత్మ విద్య పరంగా వారు నిద్రపోతుంటారు. ప్రాపంచిక విషయముల గురించి మేలుకొని ఉంటారు.

చిన్న ఉదాహరణ. టీచరు పాఠాలు చెబుతుంటే అంటే జ్ఞానబోధ చేస్తుంటే విద్యార్థులు తూలుతుంటారు. అదే సినిమా కథ చెబుతుంటే ఉత్సాహంగా వింటారు. జ్ఞానం వారికి చీకటి. ప్రాపంచిక విషయాలు వెలుగు. అదే జ్ఞానికి ఆత్మజ్ఞానం వెలుగు. ప్రాపంచిక విషయములు చీకటి. ప్రాపంచిక విషయములు వచ్చినపుడు జ్ఞాని నిద్రలోకి జారుకుంటాడు. మానవుడు మెలుకువగా వాటిని అనుభవిస్తుంటాడు. జ్ఞాని అజ్ఞాని పరస్పర విరుద్ధమైన పరిస్థితులతో ఉంటారు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P131

No comments:

Post a Comment